‘గడప గడప’కూ సమస్యలే..!

ABN , First Publish Date - 2022-10-01T06:13:51+05:30 IST

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. రేషన్‌ కార్డులు లేవని కొందరు.. పింఛన్లు తొలగించారని మరికొందరు.. రైతుభరోసా అందడం లేదని ఇంకొందరు.. పట్టాలు ఇచ్చినా గృహం మంజూరు చేయలేదంటూ చాలా మంది ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎదుట ఏకరువు పెట్టారు.

‘గడప గడప’కూ సమస్యలే..!
మురికి కూపంగా మారిన వాల్మీకిపేటలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎదుట గిరిజనుల ఏకరువు

కార్డులు, పింఛన్లు తొలగించారని కొందరు.. 

గృహాలు, రైతుభరోసా రాలేదని మరి కొందరు వేదన


కొయ్యూరు, సెప్టెంబరు 30: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. రేషన్‌ కార్డులు లేవని కొందరు.. పింఛన్లు తొలగించారని మరికొందరు.. రైతుభరోసా అందడం లేదని ఇంకొందరు.. పట్టాలు ఇచ్చినా గృహం మంజూరు చేయలేదంటూ చాలా మంది ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎదుట ఏకరువు పెట్టారు. శుక్రవారం కొయ్యూరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కొయ్యూరు కాలనీలో ప్రారంభించిన కార్యక్రమంలో అడుగడుగునా ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. కాలనీలో 20 ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికనే చేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్‌ చేయిస్తానన్న హామీపై బాధితులు నిలదీశారు. అనంతరం 2019లో తహసీల్దారు పట్టా ఇచ్చారని, ఇప్పటికీ ఇల్లు మంజూరు చేయలేదని, దీంతో శి ఇలావస్థకు చేరిన ఇంటిలోనే నివాసం ఉంటున్నామని కొయ్యూరులో కె.అన్నపూర్ణ ఎమ్మెల్యేకు తెలిపారు. అలాగే తన అత్త కె.రాజులమ్మకు సర్వే నంబరు 6-1ఏలో 1-73 సెంట్లు భూమి ఉంటే నాలుగు ఎకరాలు ఉన్నట్టు చూపించి పింఛను రద్దు చేశారని,  తప్పుడు నివేదికలు ఇచ్చి తమ బతుకు తెరువును ఎందుకు తీసేశారో తెలపాలని ఎమ్మెల్యేను నిలదీశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దారును పిలిచి కారణాలు తెలపాలని కోరగా, ఆన్‌లైన్‌లో డిలేట్‌ ఆప్షన్‌ లేక ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు. అదే గ్రామానికి చెందిన ఎం.బోడమ్మ రైతుభరోసా నిలిచిపోయిందని, పునరుద్ధరించాలని కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని వాపోయింది. లేని భూమి ఉన్నట్టు చూపడంతో రెండేళ్ల క్రితం రేషన్‌ కార్డు రద్దు చేశారని, పునరుద్ధరించాలని వినతులు ఇస్తున్నా పట్టించుకోలేదని కోరుకొండ ప్రసాదరావు వాపోయాడు. కాగా, దివంగత చింతపల్లి మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ సతీమణి తమ రేషన్‌ కార్డులు రద్దు చేశారని ఎమ్మెల్యేకు తెలపడం విశేషం. వీటిపై సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బదులిచ్చారు.


మురికికూపం.. స్పందించరేం?

వర్షాలకు డ్రైనేజ్‌ వ్యవస్థ లేక మురికి కూపంగా మారిన వాల్మీకిపేటకు ఎమ్మెల్యే వెళ్లగా, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా స్పందించరా? అని మహిళలు నిలదీశారు. మురుగునీటితో దోమలు, ఈగలు పెరిగిపోయి అనారోగ్యాల బారిన పడుతున్నామని వారు వాపోయారు. దీనిపై జడ్‌పీటీసీ సభ్యుడు వారా నూకరాజు స్పందిస్తూ డ్రైనేజీ నిర్మాణాలకు రూ.5 లక్షలు ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ తిరుమలరావు, ఎంపీడీవో మేరీరోస్‌, ఏవో కృష్ణవేణి, ఆర్‌డబ్యుఎస్‌ జేఈ విశ్వతేజ, ఏపీఎం శ్రీనివాసరావు, ఎంపీపీ బడుగు రమేష్‌బాబు, వైస్‌ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, బీసీ (కొప్పుల వెలమ) కార్పొరేషన్‌ డైరక్టర్‌ నాగమణి, వైసీపీ నాయకులు గాడి సత్యనారాయణ, జల్లి బాబులు, రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T06:13:51+05:30 IST