కరోనా ముప్పు ఇంకా పొంచి ఉన్నా.. ఐటీ ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకు రప్పించడానికి ప్రధాన కారణమిదే..!

ABN , First Publish Date - 2021-10-26T16:09:23+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో..

కరోనా ముప్పు ఇంకా పొంచి ఉన్నా.. ఐటీ ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకు రప్పించడానికి ప్రధాన కారణమిదే..!

రారండోయ్‌.. ఆఫీసుకు!

‘ఐటీ’లో పూర్తి ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు స్వస్తి!

ఇకపై హైబ్రిడ్‌ విధానంలో పని


న్యూఢిల్లీ: దేశంలోని బడా ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గత ఏడాదిన్నరగా అవలంబిస్తున్న పూర్తి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచి పని) విధానానికి స్వస్తి పలకనున్నాయి. తమ సిబ్బందిని ఇక కార్యాలయాలకు రప్పించనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. ‘‘ఉద్యోగుల్లో 70 శాతం మందికి కొవిడ్‌ టీకా రెండు డోసులు పూర్తయ్యాయి. 95 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. కాబట్టి, ఈ ఏడాది చివరి నుంచి ఉద్యోగుల్ని క్రమంగా కార్యాలయాలకు రప్పించాలని ఆలోచిస్తున్నాం’’ అని సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 90 శాతం ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకి రప్పించాలని తొలుత టీసీఎస్‌ భావించింది. 2025 వరకు 25 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచే పనిచేస్తారని ఇప్పుడంటోంది.


కరోనా ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ఆఫీసుకు వచ్చేవారికి సరైన రక్షణ ఏర్పాట్లు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఇకపై హైబ్రిడ్‌ పని విధానాన్ని అవలంబించే ఆలోచనలో ఉంది. కంపెనీ సిబ్బందిలో 86 శాతం మందికి పైగా కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) ప్రవీణ్‌ రావు తెలిపారు. కాబట్టి పూర్తి రక్షణ ఏర్పాట్లతో కొంత మంది ఉద్యోగుల్ని ఆఫీసులో పనిచేయించనున్నట్లు ఆయన చెప్పారు. విప్రో ఉద్యోగుల విషయానికొస్తే, రెండు డోసులు పూర్తయినవారు ఇప్పటికే ఆఫీసుకెళ్లి పనిచేస్తున్నారు. కాకపోతే, వారంలో రెండ్రోజులే. మిగతా దినాల్లో మాత్రం ఇంటి నుంచే పని. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సైతం తమ సీనియర్‌ ఉద్యోగుల్ని వారంలో రెండ్రోజులైనా ఆఫీసుకు రావాలని కోరింది. మిగతా సిబ్బంది వారానికోసారైనా ఆఫీసులో పనిచేయడం తప్పనిసరి చేసింది. 


కారణాలేంటి..? 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల భద్రతతోపాటు నిర్వహణ వ్యయాలు తగ్గించునే దృష్ట్యా ఐటీతోపాటు సేవల రంగాలకు చెందిన పలు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంబించాయి. వైరస్‌ తీవ్రత తగ్గాక చాలా రంగాల్లో ఉద్యోగులు యధావిధిగా కార్యాలయాలకు వెళ్తుండగా.. కొన్ని కంపెనీలు మాత్రం హైబ్రిడ్‌ విధానంలోకి మారాయి. అంటే, వెసులుబాటును బట్టి కొందరు ఆఫీసు నుంచి లేదా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఐటీ సెక్టార్‌లో మాత్రం పూర్తి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం కొనసాగుతూ వచ్చింది. అయితే, ఇంటి నుంచి పని కారణంగా ఉత్పాదకత తగ్గడంతోపాటు కొందరు ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బయటి ప్రాజెక్టులు చేపట్టడంతో అధిక సమయం వాటిపైనే వెచ్చిస్తున్నట్లు కంపెనీల దృష్టికి వచ్చిందని నిపుణులంటున్నారు. ఐటీలో ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకు రప్పించడానికి ఇదే ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-26T16:09:23+05:30 IST