ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2021-09-17T04:37:39+05:30 IST

తనకు ప్రాణహాని ఉందని..

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
తహసీల్దార్‌కు వినతిప్రతం ఇస్తున్న చిన్నారి సుహానాబేగం, ఉట్కూరు వాసులు

అలంపూర్‌ తహసీల్దార్‌కు చిన్నారి విజ్ఞప్తి


అలంపూరు: తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సుహానా బేగం అనే చిన్నారి గ్రామస్థులతో కలిసి గురువారం అలంపూరు తహసీల్దార్‌ మదన్‌మోహన్‌కు వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా బాలిక బంధువులు మాట్లాడుతూ అలంపూరు మండలంలోని ఉట్కూరు గ్రామానికి చెందిన సుహానాబేగం తల్లిదండ్రులకు ప్రభుత్వం గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 161లో రెండు ఎకరాల పొలం ఇచ్చిందని తెలిపారు. పదేళ్ల క్రితం వారిద్దరూ అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. వారి పేరున ఉన్న భూమి వారసత్వంగా సుహానా బేగం, ఆమె అక్క ఆస్మాబేగంలకు వచ్చిందని, పాస్‌ పుస్తకాలు కూడా మంజూరయ్యాయని తెలిపారు.


నాలుగేళ్ల క్రితం అక్క ఆస్మా కూడా అనారోగ్యంతో చనిపోయిందన్నారు. వారి పేరున ఉన్న భూమిని ఆక్రమించుకునేందుకు అదే గ్రామానికి చెందిన లక్ష్మన్న అనే వ్యక్తి యత్నిస్తున్నాడని చెప్పారు. సుహానాబేగం బుక్కాపురం ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుకుంటోందని తెలిపారు. వారం రోజుల క్రితం పాఠశాలకు వెళ్తున్న బాలికకు నిప్పంటించి చంపేందుకు లక్ష్మణ్‌ యత్నించాడని ఆరోపించారు. అతడి నుంచి బాలికకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, బాలిక ఫిర్యాదు మేరకు ఎస్పీ, డీఎస్పీ, అలంపూరు ఎస్‌ఐలకు సమాచారం ఇచ్చామని తెలిపారు. బాలిక వెంట మాజీ సర్పంచులు కాంతారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీపీఐ మండల నాయకుడు పెద్దబాబు, మాలమహానాడు నాయకుడు రంగముని తదితరులున్నారు.

Updated Date - 2021-09-17T04:37:39+05:30 IST