ఇండస్ట్రీలో కనిపించని ఫేవరెటిజం ఉంది!

ABN , First Publish Date - 2021-01-03T05:30:00+05:30 IST

‘‘కొవిడ్‌ మన జీవితాల్లో అంతులేని ఆందోళనను మిగిల్చింది. 2020ను తలచుకుంటే కొన్నిసార్లు భయమేస్తుంది. మరి కొన్నిసార్లు -

ఇండస్ట్రీలో కనిపించని ఫేవరెటిజం ఉంది!

రంగమ్మత్తగా చాలా మందికి తెలిసిన నటి అనసూయ. సోషల్‌ మీడియాలో ఆమె చాలా పెద్ద సెలబ్రిటీ. నటిగా, యాంకర్‌గా, సోషల్‌ మీడియా సెలబ్రిటీగా రకరకాల పాత్రల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయను నవ్య పలకరించింది. ఆ ఇంటర్వ్యూ విశేషాలలోకి వెళ్తే..


‘‘కొవిడ్‌ మన జీవితాల్లో అంతులేని ఆందోళనను మిగిల్చింది. 2020ను తలచుకుంటే కొన్నిసార్లు భయమేస్తుంది. మరి కొన్నిసార్లు - ‘చాలా నేర్చుకున్నాం’ అనిపిస్తుంది. కోవిడ్‌ వల్ల ఎవరూ బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ ఇళ్లలోనే ఉన్నారు. దీని వల్ల కుటుంబసభ్యులు అందరూ కలిసి సమయం గడపగలిగారు. బంధాలు బలపడ్డాయి. కానీ మా పిల్లలను చూస్తే జాలి వేస్తోంది. వాళ్లు బయటకు వెళ్లలేరు. స్నేహితులను కలవలేరు. ఆడుకోలేరు.


మా అమ్మ గురుకుల్‌ పాఠశాలలో టీచర్‌. అందువల్ల చిన్నప్పుడు తనతో కలిసి స్కూలుకు వెళ్లేదాన్ని. కొద్ది సేపు పాఠాలు.. ఎక్కువ సేపు ఆటలు.. ఇలా రోజంతా గడిచిపోయేది. మరి ఇప్పుడు పిల్లలు ఎప్పుడూ కంప్యూటర్‌ లేదా టీవీల ముందు కూర్చుంటున్నారు. లేకపోతే ఫోన్‌లో ఆటలు ఆడుకుంటున్నారు. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని చూసి నేర్చుకొనే అవకాశం లేకుండా పోయింది. చాలా మంది టీవీ నటీనటులకు కొవిడ్‌ వచ్చి తగ్గింది. ఒక్కొక్కరిది ఒకో కథ. వీటన్నింటినీ చూస్తుంటే మళ్లీ మామూలు రోజులు వచ్చేస్తే బావుండుననిపిస్తోంది.



అవే పాత్రలు..

‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర నాకు మంచి పేరు తీసుకువచ్చింది. కానీ ఆ తర్వాత అన్నీ అలాంటి పాత్రలే రావటం మొదలుపెట్టాయి. దాదాపు 15 సినిమాల్లో అలాంటి ఆఫర్లు వచ్చాయి. కానీ ఒకసారి చేసిన పాత్రను మరో సారి చేయటం నాకు ఇష్టం లేదు. దాంతో వాటిని వదిలేసా! జాగ్రత్తగా గమనిస్తే - సినిమాల్లో నేను చేసినవి చిన్న చిన్న పాత్రలే కావచ్చు. కానీ అవి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసే పాత్రలు. వాటి ద్వారా నాకు చాలా మంచి పేరు వచ్చింది. నాతో కలిసి పనిచేసిన యూనిట్‌ సభ్యులు కూడా మెచ్చుకొనేవారు.


‘రంగస్థలం’ సినిమా యూనిట్‌ సభ్యులంతా నన్ను ‘రంగమ్మత్త’ అని పిలిచేవారు. ‘క్షణం’ యూనిట్‌ సభ్యులు ఇప్పటికీ నన్ను ‘ఏసీపీ’ (జయా భరద్వాజ్‌) అని పిలుస్తారు. కొవిడ్‌ ముందు ఒక సినిమాలో ఒక సాంగ్‌ చేశా. ఆ తర్వాత చాలా సినిమాల్లో సాంగ్‌ల ఆఫర్లు వచ్చాయి. నా దృష్టిలో నేను మంచి నటిని. బాగా పెర్‌ఫార్మ్‌ చేయగలను. అలాంటప్పుడు నేను కొన్ని సాంగ్‌లకే ఎందుకు పరిమితం అయిపోవాలి? అందుకని, సున్నితంగా వాటిని తిరస్కరించా!




ఎందుకో తెలియదు..

సినిమా రంగంలో బయటకు తెలియని ఫేవరెటిజం చాలా ఉంటుంది. షూటింగ్‌ పేకప్‌ చెప్పిన తర్వాత చేసే నెట్‌వర్క్‌ ప్రభావం కూడా ఎక్కువే! చాలా సందర్భాలలో పాత్రలు చేతికి వచ్చినట్లు వచ్చి చేజారిపోతాయి! నా అనుభవాన్నే తీసుకుందాం. కొవిడ్‌ సమయంలో నేను నాలుగు పెద్ద సినిమాల్లో పాత్రలు కోల్పోయా!


ఈ నాలుగు సినిమాలకు ఆడిషన్‌ చేసినప్పుడు డైరక్టర్లు చాలా మెచ్చుకున్నారు. ఒకరైతే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆడిషన్లు అయిన కొన్ని రోజుల తర్వాత ఆ పాత్రలను వేరే వాళ్లకు ఇచ్చారని తెలిసింది. ఆ పాత్రలు చేసిన వాళ్లు నాకన్నా గొప్పగా నటించేవారు కారు. అయినా అవకాశం వారికే దక్కింది. ఒకప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు పెద్దగా బాధపడటం లేదు. 


కొత్త ఆశలు..

కొత్త సంవత్సరంలో కొవిడ్‌ కల్లోలం తగ్గుతుందనుకుంటున్నా! ఒకప్పటిలా- అందరూ ఎలాంటి భయం లేకుండా బయటకు వెళ్లగలిగే రోజులు రావాలని కోరుకుంటున్నా. అప్పుడు మన మనస్సుల్లో అంతర్లీనంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది. అందరికీ ప్రశాంతత చేకూరుతుంది.

 భావన



ప్రెషర్‌ కుక్కర్‌..

నేను సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటా! దీనితో రకరకాల కామెంట్స్‌ వస్తూ ఉంటాయి. మొదట్లో ఈ కామెంట్స్‌ను చూస్తే విపరీతమైన కోపం వచ్చేది. వాస్తవానికి ఒకప్పుడు నేను చాలా ఇంపల్సివ్‌గా ఉండేదాన్ని. మనసులో ఏమున్నా బయటకు చెప్పేసేదాన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెషర్‌ కుక్కర్‌లా ఉండేదాన్ని. దీని వల్ల కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకొనేదాన్ని.


కానీ క్రమేపీ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌కు స్పందించటం మానేసా. సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేసే ప్రతి వ్యక్తికి ఒకో అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయాలకు స్పందించటం మొదలుపెడితే మనకు ప్రశాంతత చెడుతుంది. అందువల్ల ఇప్పుడు ఏ కామెంట్‌కు స్పందించటం లేదు. మనకు మన మనసు, మనస్సాక్షి.. మిగిలిన వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియా వల్ల అనేక లాభాలున్నాయంటారు. కానీ నా ఉద్దేశంలో ఆ లాభాల కన్నా నష్టాలే ఎక్కువ.

Updated Date - 2021-01-03T05:30:00+05:30 IST