జార్జియాలో బైడెన్ గెలిచినా.. ట్రంప్‌కు ఓ అవకాశం.. అది ఏంటంటే !?

ABN , First Publish Date - 2020-11-07T01:11:19+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. తదుపరి అగ్రరాజ్యాధిపతి ఎవరనేదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

జార్జియాలో బైడెన్ గెలిచినా.. ట్రంప్‌కు ఓ అవకాశం.. అది ఏంటంటే !?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. తదుపరి అగ్రరాజ్యాధిపతి ఎవరనేదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో ఉన్న జో బైడెన్ ఒకవైపు.. ఫలితాలు వెలువడాల్సిన ఐదు రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్ చేస్తే గానీ మరోసారి అధికారం దక్కని స్థితిలో ట్రంప్ మరోవైపు ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క నెవేడా మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన ట్రంప్... ఉన్నట్టుండి జార్జియా, పెన్సిల్వేనియాలో ఆధిక్యాన్ని కోల్పోవడం ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ ఆధిక్యం పడిపోవడం మొదలైంది. ఇక జార్జియాలోనైతే ఏకంగా బైడెన్ వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యంలో దూసుకొచ్చారు. ఇక్కడ ఇప్పటికే 99 శాతం కౌంటింగ్ పూర్తైంది. దీంతో ట్రంప్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే ఆశలకు గండిపడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ బైడెన్ విజయం సాధిస్తే... ఈ రాష్ట్రంలోని 16 ఎలక్టోరల్ ఓట్లు ఆయన సొంతం అవుతాయి. దీంతో బైడెన్ ప్రస్తుతం గెలుచుకున్న 264 ఎలక్టోరల్ ఓట్లకు ఈ 16 ఓట్లు కూడా తోడవుతాయి. దీంతో ఆయన మ్యాజిక్ ఫిగర్ 270ను దాటిపోవడం.. తదుపరి వైట్‌హౌస్ బాస్‌గా అవతరించడం జరిగిపోతుంది. 


అయితే, జార్జియాలో బైడెనె గెలిచినా ట్రంప్‌కు ఓ అవకాశం ఉంటుంది. అదే రీకౌంటింగ్. ఇక్కడ రీకౌంటింగ్ దిశగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బైడెన్ గెలిచిన పెద్ద మార్జినేమి ఉండబోదు. ఇక అమెరికా నిబంధనల ప్రకారం.. గెలుపు మార్జిన్ 0.5 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఓడిపోయిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. అదికూడా ఫలితాలు వెలువడిన రెండు రోజుల లోపే ఓడిన అభ్యర్థి రీకౌంటింగ్‌కు అభ్యర్థించాలి. ఒకవేళ తాజా ఫలితాల్లో ట్రంప్ పరాజయం పాలైతే ఆయనకు రీకౌంటింగ్ కోరే హక్కు ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని ట్రంప్ రీకౌంటింగ్ కోరడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. 

Updated Date - 2020-11-07T01:11:19+05:30 IST