Advertisement

మానవత్వాన్ని మించిన దైవభక్తి లేదు

Dec 3 2020 @ 03:11AM

బహతే కో మత్‌ బహన్‌ దో కర్ ‌గహి ఎ చహు దౌర్‌

కహో సున్యా మానై నహిఁశబ్ద్‌ కహో దుయి ఔర్‌


ఉపయోగం లేకుండా వ్యర్థంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని మర ల్చి, ఉపయోగపడే విధంగా చేసినట్టు.. చెడుమార్గాన నడిచే మనిషి చేయి పట్టి బలవంతంగానైనా మానవత్వం కలిగుండే మంచి మార్గంలో నడిపించాలి అంటాడు కబీరు దాసు. మనిషి సన్మార్గంలో నడిచినప్పుడే మానవత్వం చిగురిస్తుందని ఆయన ఉద్దేశం. మంచితనమే మానవత్వం అని భావించే కబీరు తన శిష్యులకు.. ‘మంచితనాన్ని మించిన కులం లేదు, మానవత్వాన్ని మించిన మతం లేదు’ అని బోధించేవాడు. ఎన్ని కష్టాలెదురైనా మంచిని పంచే వారికి భగవంతుడు తప్పక ప్రతిఫలాన్నిస్తాడని పెద్దల నమ్మకం. పాండురంగని పరమభక్తుడైన తుకారాం తన మంచితనంతో.. రేపటి రోజుకంటూ ఏదీ దాచుకోకుండా అందరికీ పంచి నిలువ నీడ లేకుండా చేసుకున్నప్పుడు ఆయన ద్వారా సహాయాన్ని పొందిన వారంతా కలసి తుకారాం ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు చేసి ఆదరిస్తారు. ఆ సందర్భంలో తుకారాం.. ‘‘చెడు చూపే ప్రభావం గాలివాటుకు కొట్టుకుపోతుంది. మంచితనం వల్ల లభించే ఫలితాన్ని మాత్రం ఏ తుఫానూ అడ్డుకోలేదు. సూర్యుడు వెలుగును ప్రసాదించేది ఎంత నిజమో మనిషి మంచితనం కూడా అలాగే ఏదో ఒక రూపంలో మేలు కలిగిస్తుందనేది అంతే నిజం’’ అంటాడు.

 

మానవత్వం పరిమళించాలంటే మనిషికి మంచితనం, సహనం, సత్ప్రవర్తన కావాలి. ఇదే మన భారతదేశం మనకిచ్చిన సందేశం అన్నారు స్వామి వివేకానంద. మంచితనం ఎప్పుడూ గెలిచి నిలుస్తుంది. దీనికి అద్దంపట్టే కథ ఒకటి బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే.. ఒక వ్యక్తి రాత్రి బాగా అలసిపోయి నిద్రపోతున్నప్పుడు ఏదో చప్పుడైతే తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడ ఒక దేవత కూర్చొని ఏదో రాస్తూ కనిపించింది. ఆమె దగ్గరకెళ్లి ‘‘అమ్మా, ఏమి రాస్తున్నారు’’ అని అడిగాడు. అందుకామె ‘‘దేవుడంటే ఎందరికి ప్రేమ, భక్తి ఉన్నాయో తెలుసుకుని ఈ పుస్తకంలో రాస్తున్నాను’’ అన్నది. ఆ మాట విన్న ఆయన ‘‘మరి ఆ పుస్తకంలో నా పేరు ఉందా? చూసి చెప్పండి అని నమస్కరిస్తూ అడిగాడు. లేదని ఆ దేవదూత చెప్పింది. అప్పుడాయన ‘‘తోటి మనషులకు నా శక్తి కొద్దీ సహాయం అందిస్తుంటాను.

 

మానవత్వం అనే పుస్తకంలో నాపేరు తప్పక ఉంటుంది’’ అనడంతో ఆ దేవత నవ్వుతూ వెళ్లిపోయింది. మరుసటిరోజు ఆమె మళ్లీ వచ్చింది.. చేతిలో ఒక పుస్తకంతో. ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని ఆయన తదేక దృష్టితో చూస్తుండడంతో.. ‘‘ఏమిటి, తదేక దృష్టితో చూస్తున్నావు. ఇది దేవుడికి ప్రియమైన భక్తుల పేర్లున్న పుస్తకం. దేవుడు నీకు చూపించి తీసుకురమ్మన్నాడు. చూస్తావా?’’ అని అడిగింది. ‘‘తప్పక చూస్తానమ్మా’’ అంటూ ఆత్రుతగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు ఆ వ్యక్తి. ఆ పుస్తకంలోని మొదటిపేజీలో మొదటి పేరు తనదే ఉండడంతో ఆయన కళ్ల నుంచి ఆనందబాష్పాలు జలజలా రాలాయి. ఎదుటివారి కష్టాలను మన కష్టాలుగా భావించి వారి కష్టాలను దూరం చేయడమే మానవత్వం. స్వామి వివేకానంద చెప్పినట్టు మొట్టమొదట మనిషికి కావల్సింది మంచితనం. అదే వ్యక్తిని మానవత్వం వైపు అడుగులు వేయిస్తుంది. అందుకే మంచితనాన్ని మించిన ఆరాధనలేదు. మానవత్వాన్ని మించిన దైవ భక్తి లేదు.

                                                                                                             - పరికిపండ్ల సారంగపాణి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.