ఇరుకున ‘ఆహ్లాదం’.. కుంచించుకుపోతున్న పార్కులు..

ABN , First Publish Date - 2021-11-22T17:08:32+05:30 IST

సన్‌డే ఫన్‌డే పేరిట ట్యాంక్‌బండ్‌ వద్ద కార్యక్రమాలు నగరవాసులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి...

ఇరుకున ‘ఆహ్లాదం’.. కుంచించుకుపోతున్న పార్కులు..

  • ఎన్టీఆర్‌ గార్డెన్‌లో బారికేడ్లు.. కనిపించని గ్రీనరీ
  • లుంబినీ పార్కులో లేజర్‌ షో మూత
  • స్వాగతం పలుకుతున్న కాంక్రీట్‌ జంగిల్‌

‘‘సన్‌డే ఫన్‌డే పేరిట ట్యాంక్‌బండ్‌ వద్ద కార్యక్రమాలు నగరవాసులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సండేను సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతకు ముందు సండే, మండే అనే తేడాలేకుండా నగర వాసులకు ఆహ్లాదం పంచిన పార్కులు నేడు అధ్వానంగా మారాయి. అభివృద్ధి పనులతో కుంచించుకుపోతున్నాయి.’’


హైదరాబాద్‌ సిటీ : నగర ప్రజలకు ఆహ్లాదం పంచాల్సిన పార్కులు అధ్వానంగా మారాయి. హుస్సేన్‌సాగర్‌ వెంట గల ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీపార్కు గత వైభవాన్ని కోల్పోయాయి. సుమారు 30 ఎకరాల్లో ఆహ్లాదకరంగా ఉండే ఎన్టీఆర్‌ గార్డెన్‌, పూర్తిగా కుంచించుకపోయింది. పిల్లలు ఆడేందుకు ఆట వస్తువులు సైతం కరువయ్యాయి. లుంబినీపార్కులో వినోదం దొరకడం కష్టంగా మారింది. ఎన్టీఆర్‌ గార్డెన్‌లో ఆరు ఎకరాలకు పైగా స్థలాన్ని విగ్రహ ఏర్పాటుకు కోసం స్వాధీనం చేసుకోగా, లుంబినీపార్కు లో అమరవీరుల స్మృతివనం కోసం మూడెకరాలకు పైగా తీసుకోవడంతో పచ్చదనం కరువైంది. ఆయా పార్కుల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వచ్చేవారంతా అధ్వానపు పరిస్థితుల్లో నిరాశగా వెనుదిరుగుతున్నారు.


కుంచించుకుపోయిన ఎన్టీఆర్‌ గార్డెన్‌

సచివాలయం సమీపంలోనే ఎంతో విశాలంగా ఉండే ఎన్టీఆర్‌ గార్డెన్‌  పూర్తిగా కుంచించుకుపోయింది. ఇక్కడే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు ఆరు ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనంలో ఉంచుకున్నారు. పిల్లలు ఆడుకునే ప్లే ఏరియాతోపాటు హెచ్‌ఎండీఏ పార్టీ జోన్‌, పార్కులోని కొంత స్థలానికి పూర్తిగా బారికేడ్లు పెట్టేశారు. దీంతో పిల్లలు ఆడేందుకు స్థలమే లేదు. విగ్రహం కోసం ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ పార్కింగ్‌ ఏరియా, ఆ పక్కన గల గ్రౌండ్‌, డాక్టర్‌ కార్‌ ఏరియా ఇలా సుమారు ఆరు ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని వినియోగించకుండా ఎన్టీఆర్‌ గార్డెన్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్‌ గార్డెన్‌లో గ్రీనరీ దెబ్బతిన్నది. పార్కు కోసం నిర్మించిన సావనీర్‌ బిల్డింగ్‌ను కూడా కూల్చేసే పరిస్థితికి చేరింది. ఎన్టీఆర్‌ గార్డెన్‌కు వచ్చే సందర్శకులకు అడ్డుగా పెట్టిన బారికేడ్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.


లుంబినీ పార్కు ఇలా..

పార్కుల్లో పచ్చికబయళ్లపై హాయిగా కుటుంబ సమేతంగా గడుపొచ్చని లుంబినీపార్కు వచ్చేవారికి కాంక్రీట్‌ జంగిల్‌ స్వాగతం పలుకుతోంది. రూ.20లతో టికెట్‌ కొనుగోలు చేసి పార్కులోకి ఎంట్రీ అయితే వినోదం కోసం మరో మూడు టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.   లేకుంటే ఎంట్రీ టికెట్‌కు చేసిన ఖర్చు దండగే అనే పరిస్థితి ఎదురవుతోంది. ఎంట్రీ టికెట్‌కు రూ.20, క్లాక్‌రూమ్‌లో బ్యాగ్‌ పెట్టేందుకు మరో రూ.20 చెల్లించాల్సి వస్తోంది. 


కూర్చునే స్థలమే కనిపించదు..

లుంబినీపార్కులో కూర్చునే స్థలాలు కూడా కరవయ్యాయి. పార్కులో పచ్చిక బయళ్లే లేవు. కూర్చునేందుకు సరైన బెంచీలు లేకపోవడం గమనార్హం. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులన్నీ దెబ్బతిన్నాయి. పిల్లల జారుడు టేబుల్‌ దెబ్బతినడంతో దుస్తులు చిరిగిపోతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కనీసం ఉయ్యాలలు కూడా లేవు. ఫౌంటేన్‌లో నీరంతా మురుగుగా మారింది. అందులోనే పిల్లలు ఆడుతున్న పరిస్థితి.


నెల రోజులుగా నిలిచిన చుక్‌చుక్‌ రైలు

ఎన్టీఆర్‌ గార్డెన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే చుక్‌చుక్‌ రైలు నెల రోజులుగా నిలిచిపోయింది. సమీపంలో సచివాలయ నిర్మాణం కోసం, మరోవైపు ఎన్టీఆర్‌ గార్డెన్‌లో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణంలో భాగంగా రాళ్ల తొలగింపు కోసం బాంబు పేలుళ్లు జరిపారు. సమీపంలోని రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. దీంతో రైలు నడిపే పరిస్థితి లేకుండాపోయింది. బారికేడ్లు సైతం రైల్వే ట్రాక్‌ వరకు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దెబ్బతిన్న ట్రాక్‌పై రైలును నడిపితే పట్టాలు తప్పే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు రైలు నిర్వహణను నిలిపివేశారు. దీంతో సందర్శకులు నిరాశకు గురవుతున్నారు.


మూతపడిన లేజర్‌ షో

లుంబినీ పార్కులోని లేజర్‌ షో మూతపడింది. కొవిడ్‌-19 కారణంగా గతేడాది మార్చి 22న మూతపడిన లేజర్‌ షో నేటికీ పున:ప్రారంభం కాలేదు. లేజర్‌ షోను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారనే అంశంపై అధికారుల వద్ద కూడా స్పష్టత లేదు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు కనులవిందు చేసే  లేజర్‌ షో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. లేజర్‌ షోను నిలిపివేయడం వల్ల హెచ్‌ఎండీఏ సైతం ఆదాయం కోల్పోతోంది. లేజర్‌ షో నిర్వహణను గతంలో హెచ్‌ఎండీఏ చేపట్టగా, రెండున్నరేళ్ల క్రితం నుంచి ఓ ప్రైవేటు సంస్థ చేపడుతోంది. సరికొత్త టెక్నాలజీతో లేజర్‌ షోకు మరింత మెరుగులు అందించేందుకు ప్రైవేటు సంస్థకు కేటాయించారు. దీంతో లేజర్‌ షో ద్వారా ఏడాదికి రూ.1.11కోట్లను హెచ్‌ఎండీఏకు చెల్లించేలా ప్రైవేటు సంస్థ ఒప్పందం చేసుకొంది. అయితే కేవలం ఏడాది మాత్రమే లేజర్‌ షో నిర్వహించింది. ఆ వెంటనే కరోనా కారణంగా మూతపడిన లేజర్‌ షో ఇప్పటికీ ఓపెన్‌ చేయలేదు. రెండు విడతలుగా లాక్‌డౌన్‌ జరిగి ఆ తర్వాత అన్‌లాక్‌ పరిస్థితుల్లో పార్కులు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కానీ లేజర్‌ షో మాత్రం రాలేదు. లేజర్‌ షో ప్రారంభం కాకపోవడంతో హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలకు వచ్చే వేలాది మంది సందర్శకులు నిరాశ చెందుతున్నారు.  

Updated Date - 2021-11-22T17:08:32+05:30 IST