నిరుద్యోగులకేదీ భరోసా?.. ఎమ్మెల్సీ ప్రచారంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కనిపించని హామీలు

ABN , First Publish Date - 2021-02-27T04:54:05+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారపర్వం మరింత ఊపందుకుంది. ప్రధానపార్టీల నేతలు, అభ్య ర్థులు నిరుద్యోగులకు భరోసా నిచ్చేలా ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. కేవలం ఒకరిపై ఒకరు, ఓ పార్టీపై మరో పార్టీ వారు విమర్శలు చేసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.

నిరుద్యోగులకేదీ భరోసా?.. ఎమ్మెల్సీ ప్రచారంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కనిపించని హామీలు

విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితమవుతున్న అభ్యర్థులు, నేతలు 

మండలి పోరులో పెరుగుతున్న మాటల మంటలు

ఖమ్మం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారపర్వం మరింత ఊపందుకుంది. ప్రధానపార్టీల నేతలు, అభ్య ర్థులు నిరుద్యోగులకు భరోసా నిచ్చేలా ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. కేవలం ఒకరిపై ఒకరు, ఓ పార్టీపై మరో పార్టీ వారు విమర్శలు చేసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. నిరుద్యోగ ఓటర్లకు ఎలాంటి వరాలు ప్రకటించకపోగా.. వారి సమస్యల పరిష్కారానికి సబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకపోతుం డటంతో యువత నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితికి బరిలో ఉన్న అభ్యర్థులంతా ఏదో ఒక పార్టీకి చెందిన వారు కావడం, ఆ పార్టీల ఎజెండాతోనే వారు పోటీకి దిగడం, ప్రచారంలో పాల్గొంటుడమే కారణ మని చెబుతున్నారు. అధికారపార్టీనేతలు, అభ్యర్థులు అభివృద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుండగా... ప్రశ్నించే గొంతుకలమంటూనే విపక్ష పార్టీల అభ్య ర్థులు కూడా విమర్శలు, ఆరోపణలకే పరిమితమవుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, టీజేఎస్‌, యువ తెలంగాణ, తెలంగాణ ఇంటిపార్టీ, ఆమ్‌ఆద్మీపార్టీతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు తమ పార్టీల విధానాలు, తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాలను వివరిస్తూనే.. ఎవరికి వారు అనుకూలమైన మాటలతో ప్రచారం సాగిస్తున్నారు. 

ఉద్యోగ, ఉపాధి మార్గాలపై ఊసులేని హామీలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,30,000కుపైగా పట్టభద్రుల ఓటర్లున్నారు. వారిలో నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ, ఉపాధి మార్గాలపై ఇప్పటివరకు ఏపార్టీ అభ్యర్థి స్పష్టమైన భరోసా ఇవ్వలేకపోవడం గమనార్హం. రాష్ట్రవిభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీ నెరవేరి.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి 

అవకాశాలు వస్తాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని తమ ఎజెండాలో చేర్చకపోవడం గమనార్హం. జిల్లాలో వాణిజ్య, ఆహార పంటలు సమృద్ధిగా పండుతున్న నేపథ్యంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు, అగ్రిపరిశ్రమలకు, అగ్రిఉత్పత్తులకు, వాటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉండగా., వాటిని ఏర్పాటు చేయించగలిగితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరూ ఈ దిశగా ప్రకటనలు చేయడంలేదు. ఖనిజ సంపద మెండుగా ఉండగా.. ఈ సంపదను వెలికితీసి అందుకు అవసరమైన నైపుణ్యం పెంచే శిక్షణ కేంద్రం ఏర్పాటు, ఖనిజ ఉత్పత్తులు పెంపునకు చర్యలు, పరిశ్రమల ఏర్పాటు హామీలు లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఏజెన్సీలో బొగ్గునిల్వలు అపారంగా ఉండగా.. పుష్కలంగా ఉన్న నీటి వనరుల ఆధారంగా మినీ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేయొచ్చని, వాటితో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. చింతకానిలో రైల్వే డబ్లింగ్‌ పరిశ్రమ, గ్రానైట్‌హబ్‌, గోదావరి జలమార్గం, ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి లాంటివి అసలు ప్రచారంలోనే కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

విమర్శలు, ప్రతి విమర్శలతోనే నేతలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. వీరి గెలుపుకోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగారు. అభ్యర్థులతో పాటు నేతలు కూడా విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమవుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయన తరుపున మంత్రిపువ్వాడ అజయ్‌కుమార్‌, 

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీనామ నాగేశ్వరరావు, మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ప్రచారంలో కేసీఆర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అబివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెడుతున్నారు. ఏనియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గ అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పనిలోపనిగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారే తప్ప నిరుద్యోగులకు మేలు చేసే హామీలు ఇవ్వడంలేదు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డితో పాటు రాష్ట్ర, ఙిల్లా నేతలు ఎమ్మెల్యేలు ప్రచారంలో ఉన్నారు. బీజేపీ నేతలు అధికార టీఆర్‌ఎస్‌, సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు తప్ప తమ గెలుపుతో నిరుద్యోగులకుచేసే మేలు గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. టీజేఎస్‌ అభ్యర్థి కోదండరాం కూడా తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను వివరించడంతో పాటు ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలోనే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. వామపక్షాల అభ్యర్థి జయసారధిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ల విజయం కోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రచారం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. తమ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అంటురన్నారు. కానీ నిరుద్యోగులకు మాత్రం ఏమేరకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఇక యువతెలంగాణ పార్టీ భద్రాద్రి ఆలయ అభివృద్ధి సమస్యను వెలుగులోకి తెచ్చి ఆసమస్యను ఎజెండాగా చేసుకుంది. ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలు, భద్రాద్రి ఆలయ అభివృద్ధి నినాదంతో ముందుకెళుతున్నారు. ఆప్‌ అభ్యర్థి తిరుమలరావు, తెలంగాణ ఇంటిపార్టీ నుంచి చెరుకుసుధాకర్‌, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కూడా ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్య మిస్తుండటంతో నిరుద్యోగ పట్టభద్రులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

Updated Date - 2021-02-27T04:54:05+05:30 IST