ఇప్పట్లో దర్శనాలు పెంచే ఆలోచన లేదు: ఈవో

ABN , First Publish Date - 2021-07-24T06:45:07+05:30 IST

సెకండ్‌ వేవ్‌ పూర్తిగా పోలేదనీ, ఇప్పట్లో దర్శనాలు పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

ఇప్పట్లో దర్శనాలు పెంచే ఆలోచన లేదు: ఈవో

తిరుమల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిగా పోలేదు. థర్డ్‌ వేవ్‌ కూడా మొదలైందనే రిపోర్ట్స్‌ ఉన్నాయి. రానున్న నెలలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలో రిస్క్‌ తీసుకోలేము. ఇప్పట్లో దర్శనాల సంఖ్య పెంచే ఆలోచన లేదు. ప్రస్తుతం ఉన్న దర్శనాల సంఖ్యే కొనసాగుతుంది’ అంటూ టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి దర్శనాల సంఖ్య పెంపుపై శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ఇతర విభాగాల అధికారులతో కలిసి తిరుమలలోని పలు ప్రదేశాల్లోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండించేందుకు కార్యాచరణ రూపొందించామని, ఈ మేరకు పలువురు దాతలు కూడా ముందుకొస్తున్నట్టు వెల్లడించారు. శ్రీవారికి నైవేద్యం, దీపారాధన కోసం దేశీయ ఆవు నెయ్యిని తిరుమలలోనే తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను మరుసటి రోజున సేకరించి తిరుపతిలోని గోశాలలో అగరబత్తీలు తయారు చేసేందుకు చర్యలు చేపడతామని, ఆగస్టు 15వ తేదీ నాటికి కొన్ని ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ఈ అగరబత్తీలను తిరుమలలో కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు విక్రయిస్తామని, ఇందులో వచ్చే లాభాన్ని గోసంరక్షణకు వినియోగిస్తామన్నారు. 

Updated Date - 2021-07-24T06:45:07+05:30 IST