Advertisement

శాంతి భద్రతలకు విఘాతం

Jan 16 2021 @ 23:41PM

అర్ధరాత్రి మహిళలే కాదు పురుషులకూ రక్షణ కరువు

 నగరంలో రోజురోజుకు పెరుగుతున్న దారుణాలు

నెల్లూరు(క్రైం) జనవరి 16 : నెల్లూరు నగరం ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ రాత్రింబవళ్లు ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరిగే అవకాశం లేదు. కొద్ది నెలల క్రితం వరకు ప్రజలకున్న భావన ఇది. ప్రస్తుతం నగరంలో అందుకు భిన్నంగా పరిస్థితులు   చోటుచేసుకుంటున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. అర్ధరాత్రి మహిళలే కాదు పురుషులు కూడా రోడ్లపై నడిచేందుకు భయపడాల్సి వస్తోంది. గత నెలలో నగరంలోని కరెంటాఫీసు సెంటర్‌లో సెల్‌ఫోన్‌ కోసం ఓ బ్యాంకు ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా పోలీసు స్టేషన్లలో న్యాయం జరగడం లేదు.  అధికార పార్టీ నేతల సిఫార్సుతో స్థానిక నాయకులు స్టేషన్లలో మధ్యస్తాలు చేస్తూ హవా కొనసాగిస్తున్నారు. మధ్యస్తాలు చేసేవారిలో ఎక్కువ భాగం రౌడీ షీటర్లు, పలు కేసులు ఉన్న వారు ఉండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు పోలీసు అధికారులు రౌడీషీటర్లు చెప్పినంటూ వింటూ మనసు చంపుకొని విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కొన్ని రోజులుగా నగరంలో శాంతి బధ్రతలు పూర్తిగా లోపించాయి అని చెప్పడానికి ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలే సాక్ష్యం.

 ఇంటి ముందు ఫోన్‌ మాట్లాడుతున్న యువకుడిని చిన్నబజారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. 

 నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌ తూర్పు వైపున అక్క నగదు ఇవ్వలేదని కత్తితో విచక్షణా రహితంగా తమ్ముడు దాడి చేశాడు..

ఆర్థిక లావాదేవీల నేపధ్యంలో ఓ వ్యక్తి తన కుక్కతో మరో వ్యక్తిని కరిపించిన సంఘటన వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

 బాలాజీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలోని ఓ బార్‌లో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమేరా ఫుటేజ్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

నగరంలోని డైకాస్‌ రోడ్డు ప్రాంతంలో ఉన్న మటన్‌ మార్కెట్‌లో రెండు వర్గాలు కత్తులతో  దాడులు చేసుకున్నాయి. మార్కెట్‌లో మాముళ్లు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు దిగారు.

నగరంలో వేదాయపాలెం పోలీసు స్టేషన్‌ పరిధిలో వరుస గొలుసు దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు నిందితులను పట్టుకోలేకున్నారు.

 నగరంలోని మూలాపేట రామయ్యబడి వద్ద ఓ రోజు సాయంత్రం బీజేపీ నాయకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. 

 బాలాజీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువకుడి వద్ద  వేల ల్లో నగదు కాజేశారు.

నగరంలోని ధర్గామిట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అందరూ చూస్తుండగా సాయంత్రం సమయంలో బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు కొందరు ప్రయత్నించారు.

ప్రత్యేక నిఘా ఉంచాం

నెల్లూరు నగర పరిధిలో నేరాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి పూట డీఎస్పీ, సీఐలతో రౌండ్స్‌ వేపిస్తున్నాము. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

 శ్రీనివాసులురెడ్డి, నగర డీఎస్పీ


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.