ఆక్సిజన్‌ కొరత లేదు

ABN , First Publish Date - 2021-04-23T09:53:28+05:30 IST

రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేదని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ఆక్సిజన్‌ కొరత లేదు

రాష్ట్ర అవసరాలకే తొలి ప్రాధాన్యం

ఆ తరువాతే బయటి రాష్ట్రాలకు..

కృష్ణా సహా 5 జిల్లాల్లో కొత్తగా 10 యూనిట్లు: మేకపాటి 


అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేదని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని, రాష్ట్ర అవసరాలు తీరినతర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.  గురువారం ఆక్సిజన్‌ సరఫరా పై 13 జిల్లాలకు చెందిన పరిశ్రమలు, వైద్యశాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని 40 రకాల పరిశ్రమల ద్వారా 510 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ తయారవుతోందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ‘‘బళ్లారి నుంచి రావలసిన 68 ఎంటీ ఆక్సిజన్‌ దిగుమతి వల్ల రాయలసీమకు ఉపశమనం కలిగింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలులో కొంతభాగం, నెల్లూరులో మరికొంత భాగం ఆక్సిజన్‌ కొరత గుర్తించాం. ఈ జిల్లాల్లో ఇన్ఫెక్షన్‌ రేటు యాభై శాతం ఉంది. మరో పది యూనిట్లకు ఈ జిలాల్లో అతిత్వరలోనే లైసెన్సులు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతిరోజూ 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి జరగాలి. ఆ ఉత్పత్తి పరిశ్రమలన్నీ 24 గంటలు పని చేయాలి. ఆక్సిజన్‌ తరలింపులో కీలకమైన వాహనాలకు ఇబ్బందులు రాకుండా కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక చర్యలు చేపడతాం.


ఆక్సిజన్‌ సరఫరాపై అధికారులతో ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి’’ అని అధికారులకు స్పష్టం చేశారు. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాపై క్షేత్రస్థాయిలో నిఘా పెడతామన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా మూడు చోట్ల నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. మెడ్‌టెక్‌ జోన్‌లో కూడా మే 1 నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతుందని, దాన్ని కూడా వినియోగించుకోవాలని మంత్రి... అధికారులకు సూచించారు. కాగా, రోజుకు దాదాపు వంద టన్నులు చొప్పున 766 టన్నుల ఆక్సిజన్‌ ఇప్పటివరకు సరఫరా చేశామని ఆర్‌ఐఎన్‌ఎల్‌  ప్రతినిధి బిశ్వాల్‌ తెలిపారు. విద్యుత్‌ అంతరాయం వల్ల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని లికినొక్స్‌ ప్రతినిధి వెల్లడించారు. 40 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని ఎల్లెన్‌ ప్రతినిధి తెలిపారు. 


నేడు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో డీల్‌

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకోనుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘రాబోయే మూడేళ్లలో 80 లక్షల ఇళ్లను డిజిటల్‌ పద్ధతుల్లో కనెక్ట్‌ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో నాలుగేళ్ల కోర్సులను ఏడాదికి కుదించేందుకు ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాది 1.30 కోట్లమందికి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ వంటి వసతులను సమకూర్చడానికి కసరత్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మైక్రోసా్‌ఫ్టతో జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొననున్నట్టు వెల్లడించారు.

Updated Date - 2021-04-23T09:53:28+05:30 IST