
స్వదేశంలోనే శరణార్థులుగా
1980-90వ దశకంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెచ్చుమీరింది. హిందువులపై అనేక దాడులు జరిగాయి. దీనితో అనేక మంది కశ్మీరీ పండిట్లు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. జమ్మూ, ఢిల్లీ మొదలైన ప్రాంతాల్లో శరణార్థులుగా తలదాచుకున్నారు. తమను కశ్మీర్ లోయలోని స్వస్థలాలకు పంపాలనీ, తమ ఆస్తులను తిరిగి ఇప్పించాలనీ వారంతా పోరాటం చేస్తున్నారు.
‘ద కశ్మీర్ ఫైల్స్’... సినిమా పోస్టర్ కూడా బయటకు రాకమునుపే జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా ఇది. హైదరాబాద్‌కు చెందిన నిర్మాత అభిషేక్ అగర్వాల్‌పై తాజాగా ఫత్వా కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా నిర్మించడానికి గల కారణాలను, ప్రస్తుతం తలెత్తిన వివాదాలను గురించి విలేకర్లతో ఆయన గురువారం మాట్లాడారు.
కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో సినిమా తీయాలనేది చాలా కాలంగా నా కోరిక. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ‘తాష్కెంట్ ఫైల్స్’ నాకు బాగా నచ్చింది. ఆయనను కలిసి కథ చెప్పా. అలా సినిమా ప్రారంభమయింది. షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునే సమయానికి లాక్డౌన్ విఽధించారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్‌లో కాశ్మీర్లో షూటింగ్ ప్రారంభించి ఇటీవల ముగించాం. త్వరలోనే టీజర్ విడుదల చేస్తాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం.
సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్ బయటకు రాకుండానే వివాదాలు ప్రారంభమయ్యాయి. ‘ఈ సినిమా తీసినవాళ్లనూ... చూసినవాళ్లను చంపుతాం’ అంటూ ఫత్వా జారీ అయింది అని జాతీయ వార్తాచానెళ్లలో వార్తలు వచ్చాయి. ఫత్వా ఎవరు జారీ చేశారో నాకు తెలియదు. నాకు నేరుగా ఎలాంటి బెదిరింపులు, ఫోన్‌కాల్స్ రాలేదు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చెప్పటంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. వ్యక్తిగతంగా నేను ఎలాంటి బెదిరింపులకు, ఫత్వాలకు బెదరను.
1980-90 దశకంలో కాశ్మీర్ లోయలో ఏం జరిగిందో అదే చూపించాం. ఇప్పటి దాకా ఎవరూ సినిమాలో ఈ అంశాలను ప్రస్తావించటానికి సాహసించలేదు. వాస్తవిక కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నా. అబ్దుల్ కలాంగారి బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. దీనిలో పరేష్ రావల్ టైటిల్ పాత్ర పోషిస్తారు.