కోపంలో వివేకం ఉండదు!

ABN , First Publish Date - 2021-03-26T05:37:06+05:30 IST

‘తన కోపమె తన శత్రువు’ అన్నాడు సుమతీ శతకకర్త. ‘కోపమున ఘనత కొంచెమై పోవును’ అన్నారు నార్లవారు.

కోపంలో వివేకం ఉండదు!

‘తన కోపమె తన శత్రువు’ అన్నాడు సుమతీ శతకకర్త. ‘కోపమున ఘనత కొంచెమై పోవును’ అన్నారు నార్లవారు. ‘కోపం వచ్చినప్పుడు కలిగే ఒక విధమైన రసాయన ప్రక్రియ వల్ల మెదడులోని వివేచన భాగం పని చెయ్యదు’ అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. సారాంశం ఒక్కటే... కోపానికి దూరంగా ఉండాలి. కోప సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు.


వారణాసి రాజు బ్రహ్మదత్తుడు. అతను సహృదయుడు. ఒక రోజు హిమాలయాల నుంచి ఒక తాపసి ఆ నగరానికి వచ్చాడు. రాజును దర్శించుకున్నాడు. అతని సందేశం విన్న రాజు శాశ్వతంగా తన రాజ్యంలోనే ఉండిపోవాలని తాపసిని  వేడుకున్నాడు. తాపసి అంగీకరించాడు. నగరం పొలిమేరలో రాజుగారి ఉద్యానవనం ఉంది. దాన్ని ఆనుకొని మహా వనం ఉంది. అందులో రకరకాల జంతువులు ఉన్నాయి. ఉద్యానవనాన్ని ఆనుకొని ఒక దేవాలయం ఉంది. ఆ ఉద్యానవనంలో తాపసికి రాజు మంచి కుటీరాన్ని నిర్మింపజేశాడు. అతని సేవ కోసం సుమంగళుడు అనే తోటమాలిని ప్రత్యేకంగా నియమించాడు. తాపసిని రోజూ రాజప్రాసాదానికి తీసుకువెళ్ళడం, భోజనానంతరం తిరిగి తీసుకురావడం, అతని సేవలు చేయడం సుమంగళుడి పని. తాపసి సేవలను సుమంగళుడు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడు. 


ఒక రోజు తాపసి- ‘‘సుమంగళా! నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఒక పక్షం రోజుల తరువాత వస్తాను. ఆ విషయం రాజుగారికి విన్నవించు’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. 


తాపసి వెళ్ళిన పదో రోజున సుమంగళుడి ఇంటికి పొద్దుపోయాక బంధువులు వచ్చారు. వారికి మాంసంతో భోజనం పెట్టాలనుకొని, విల్లు తీసుకొని రాజవనంలోకి వేటకు వెళ్ళాడు సుమంగళుడు. ఆ వనంలో, ఆలయ సమీపంలో పొద కదుల్తోంది. విల్లు ఎక్కుపెట్టి, బాణం విడిచాడు.అంతే.... చావుకేక వినబడింది. భయంతో పరుగుపరుగున వెళ్ళి చూశాడు. గుండెల్లో బాణం దిగి... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తాపసి కనిపించాడు. ‘‘నేను అనుకున్న సమయంకన్నా ముందే వచ్చాను. కుటీరానికి దారి మూసివేయడంతో ఇక్కడ రాతి మీద పడుకున్నాను, ఇందులో నీ దోషం ఏమీ లేదు’’ అని చెప్పి తాపసి ప్రాణాలు విడిచాడు. 


తాపసిని తాను ఉద్దేశపూర్వకంగా చంపలేదనీ, అయినా ఈ విషయం తెలిస్తే రాజు తనకి మరణ దండన విధించడం తథ్యమనీ భావించి, భయంతో ఆ రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పారిపోయాడు సుమంగళుడు. మరునాడు ఈ విషయం తెలిసి రాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ‘సుమంగళుణ్ణి వెతికి, పట్టి బంధించి తెండి’’ అని ఆజ్ఞ ఇచ్చాడు. భటులు సుమంగళుడి కోసం రాజ్యంలో వెతకసాగారు.ఏడాది గడిచాక సుమంగళుడు మారువేషంలో మహామంత్రి దగ్గరకు వచ్చాడు. జరిగినదంతా చెప్పాడు. ‘‘ఈ విషయంలో నేను నిర్దోషినని రాజుగారితో తమరే చెప్పండి’’ అని ప్రాధేయపడ్డాడు.



ఆ రోజు రాజు దగ్గర సుమంగళుడి విషయం మంత్రి ప్రస్తావనకు తెచ్చాడు. అతని పేరు వినగానే రాజు మండిపడ్డాడు. ఇంటికి వెళ్ళిన మంత్రి... ‘‘రాజుగారు కోపంలో ఉన్నారు మళ్ళీ రా!’’ అని సుమంగళుడికి చెప్పి,  పంపాడు. 


మరో ఆరు నెలల తరువాత సుమంగళుడు వచ్చాడు. మంత్రి మళ్ళీ తిప్పి పంపాడు. మళ్ళీ ఆరు నెలల తరువాత సుమంగళుడు వచ్చాడు. మంత్రి మరోసారి రాజు దగ్గర అతని విషయం ప్రస్తావించాడు. ఈ సారి రాజు మంత్రితో  ‘‘సుమంగళుణ్ణి పిలిపించండి’’ అన్నాడు. సుమంగళుడు వచ్చి, జరిగిన నిజం చెప్పాడు. రాజు అతణ్ణి క్షమించి వదిలేశాడు. 


ఆ తర్వాత రాజుతో మంత్రి మాట్లాడుతూ ‘‘దేవా! సుమంగళుడి విషయం నేను మూడుమార్లు చెప్పాను. మూడోసారి పిలిపించుకొని, క్షమించి వదిలేశారు. ఈ పని మొదటే చెయవచ్చు కదా!’’ అని అడిగాడు.


‘‘మహామాత్యా! మొదట సుమంగళుడి మీద కోపంతో ఉన్నాను. కోపంతో ఉన్నప్పుడు విచారణ చేసి, శిక్ష విషయంలో నిర్ణయం తీసుకోకూడదు. కోపంలో వివేకాన్ని కోల్పోతాం. సరైన నిర్ణయం తీసుకోలేం. అందుకే మీరు చెప్పినా అంగీకరించలేదు. కాలం గడిచిన కొద్దీ కోపం తగ్గింది. అందుకే ఇప్పుడు రమ్మన్నాను’’ అన్నాడు బ్రహ్మదత్తుడు.


కోపతాపాలకు అతీతంగా ఉన్నప్పుడే న్యాయ నిర్ణయాలు తీసుకోవాలనే చక్కని సందేశం ఇచ్చిన జాతక కథ ఇది.

 


 ‘కోపం వచ్చినప్పుడు కలిగే ఒక విధమైన రసాయన ప్రక్రియ వల్ల మెదడులోని వివేచన భాగం పని చెయ్యదు’ అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. కోప సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-03-26T05:37:06+05:30 IST