అవకతవక లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2021-11-27T06:14:52+05:30 IST

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో వెలుగుచేసిన అవకతవక లకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు.

అవకతవక లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
లింగాల్లో ధాన్యం కొనుగోలును పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో కలెక్టర్‌ నివాస్‌ పర్యటన 

 ధాన్యం ఆరలేదని తక్కువ ధరకు కొంటున్నారని రైతుల ఆవేదన

మండవల్లి, నవంబరు 26 : కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో వెలుగుచేసిన అవకతవక లకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని  కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుభరోసా కేంద్రాల్లో మెరుగైన సేవలను  అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండవల్లి మండలం లింగాల గ్రామంలో శుక్రవారం రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 11వేల బస్తాలు అక్రమంగా తరలిపోయిన విషయంపై విలేకర్లు ప్రశ్నించగా అవకతవకలు జరిగిన సంఘటనపై సమాచారం ఉందని, దీనిపై సమగ్ర నివేదిక అందాల్సి ఉందన్నారు. ఈసందర్భంగా రైతుభరోసా కేంద్రంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు  ఎలాంటి అవరోధాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనుకుమార్‌, ఎంపీపీ శ్రీరామదుర్గాప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యుడు ముంగర విజయనిర్మల, ఎంపీడీవో శేషగిరిరావు పాల్గొన్నారు.


ధాన్యం ఆరబెట్టి ఆర్‌బీకేలకు తీసుకురావాలి

ముదినేపల్లి రూరల్‌ : వరి కోత యంత్రాలతో ధాన్యాన్ని అరబెట్టి రైతు భరోసా కేంద్రాలకు  తీసుకురావాలని కలెక్టర్‌ జె.నివాస్‌ రైతులను కోరారు.  వడాలి గ్రామంలోని ఆర్‌బీకేను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యం శాంపిల్స్‌ ఎంత తేమ శాతం ఉందో పరీక్షించారు. వరి కోత యంత్రాలతో కోసిన ధాన్యం తేమశాతం అధికంగా ఉండటంతో రైతులు మద్దతు ధర కోల్పోతున్నారని అన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురాకపోతే మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తారన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు ధాన్యాన్ని అరబెట్టాలి అంటే కూలీల కొరత ఎదుర్కొంటున్నామన్నారు. రోజుకు 700 రూపాయలు ఇచ్చినా కూలీలు దొరకటం లేదన్నారు. మరోపక్క వాతావరణం అనుకూలించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యంత్రాలతో కోసిన ధాన్యాన్ని గత్యంతరం లేక విక్రయించుకుంటున్నామని రైతులు కలెక్టర్‌ ఎదుట వాపోయారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూల దృక్పథంతో ప్రభుత్వం త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయం చేశానని, వ్యవసాయంలో ఇబ్బందులు, మెలకువలు తనకు అవగాహన ఉందని రైతులతో కలెక్టర్‌  అన్నారు. ఈ- క్రాఫ్‌ చేయాలని ప్రభుత్వం తప్పనిసరి చేయటంతో తాము పంట విక్రయించేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్‌ ఎదుట తమ గోడు విన్నవించుకున్నారు.  తహసీల్దార్‌ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 


Updated Date - 2021-11-27T06:14:52+05:30 IST