విషాలు, విద్వేషాలకు విరుగుడు ఒకే ఒక్కటుంది!

ABN , First Publish Date - 2022-09-30T06:13:40+05:30 IST

‘ఈవిషాలు, విద్వేషాలకు విరుగుడు లేదా?’ అంటూ అజయ్ గుడవర్తి సెప్టెంబర్ 27న రాసిన వ్యాసానికి సమాధానం ఇది. ఆయన ప్రశ్నకు ఒకే ఒక్క విరుగుడు ఉంది....

విషాలు, విద్వేషాలకు విరుగుడు ఒకే ఒక్కటుంది!

‘ఈవిషాలు, విద్వేషాలకు విరుగుడు లేదా?’ అంటూ అజయ్ గుడవర్తి సెప్టెంబర్ 27న రాసిన వ్యాసానికి సమాధానం ఇది. ఆయన ప్రశ్నకు ఒకే ఒక్క విరుగుడు ఉంది. గుడవర్తి వంటి వారి భావజాలంలో మార్పే ఆ విరుగుడు. భారతదేశంలో కొన్ని పార్టీలు సెక్యులర్ పార్టీలని, మరికొన్ని మతతత్వ పార్టీలనే నమ్మకాన్ని వదిలించుకోగలిగితే విరుగుడు మరింత త్వరగా లభిస్తుంది. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాల్సిందే. అందుకోసం అందరికీ వర్తించే సెక్యులర్ చట్టాలు తయారవ్వాల్సిందే. మత చట్టాలన్నీ రద్దు చెయ్యాల్సిందే. మతం వ్యక్తిగతం, అది ఇంటికే పరిమితం కావాలి. ఇందుకు భిన్నంగా రాజ్యాంగమే ప్రజలను మతపరంగా విడగొట్టింది. ‘భారతీయులమైన మేము’ అనే ప్రారంభ వాక్యం తప్పించి రాజ్యాంగంలో ఎక్కడా భారతీయత లేదు.


భారతదేశంలో సెక్యులర్ పార్టీలు ఉన్నాయనేది భ్రమ. అన్ని పార్టీలూ మతతత్వ పార్టీలే. మెజారిటీ మతతత్వం కొందరిది, మైనారిటీ మతతత్వం మరికొందరిది. మతం వాడుకోని రాజకీయ పార్టీ దేశంలో ఏదీ లేదు. మైనారిటీ మతానికి అనుకూలంగా వ్యవహరించడమే సెక్యులరిజం అనే ఆలోచన గుడవర్తి వ్యాసంలో ప్రముఖంగా కనిపించింది. ఆ భావన ఉన్నంతవరకూ మతవిభేదాలుంటాయి, విద్వేషాలు పెంచేవారుంటారు.


హిందువులకు హిందూ చట్టాలు చేసింది సెక్యులర్ ఛాంపియన్ జవహర్‌లాల్ నెహ్రూ. ముస్లింలకు ముస్లిం చట్టాలను వర్తింపజేస్తున్నది భారత రాజ్యాంగమే. ఇదేమి లౌకికరాజ్యం? అజయ్ గుడవర్తి విశ్వసించే భావజాలం ఉన్నవారంతా ఏనాడూ ఆర్టికల్ 44 గురించి మాట్లాడకపోవడం వల్లనే సమాజంలో విషం, మత విద్వేషాలు వ్యాపిస్తున్నాయి. వారి భావజాలం ప్రకారం భారతీయులందరినీ ఒక్కటిగా కాక, హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులుగా చూస్తూ అదే గొప్ప సెక్యులర్ విధానంగా పొంగిపోతే చాలు. బీజేపీ రాజకీయంగా బలపడింది మిగిలిన రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులతో సహా, అనుసరించిన కుహనా లౌకికవాదం వల్లనే. ఈ అల్పసంఖ్యాకుల సంతుష్టీకరణ విధానం గురించి ప్రజలలోకి బలంగా తీసుకెళ్లగలిగినందునే బీజేపీ నేడు అధికారంలో ఉంది. హిందువులు వారి వాదనను నమ్మారు. అది వాస్తవాన్ని గ్రహించటం వల్ల ఏర్పడిన విశ్వాసం. ఈ కుహనా లౌకికవాదం, అల్పసంఖ్యాక వర్గాల సంతుష్టీకరణ ఆపి, అన్యాయం ఎవరు చేసినా ప్రశ్నించి, అన్యాయానికి గురైన వారి ప్రక్కన నిలబడగలిగిన ప్రజా సంఘాలు, పార్టీలు ఉండి ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చేదే కాదు.


‘వనరుల్లో ప్రథమ వాటా ముస్లిములకు చెందాలన్న’ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన ఒక సెక్యులర్ ప్రధాని చెయ్యవలసిందేనా? ముస్లింల బాగోగుల కోసం ప్రత్యేక కమిటీలు వెయ్యడం, కులాల ఆధారంగా రాజకీయాలు నడపడం సెక్యులరిజమా? హిందూ సమాజం కులాల పేరున విడిపోవాలి, ముస్లింలు అంతా ఏకమై తమకు అండగా నిలబడాలన్నదే సెక్యులర్ పార్టీల రాజకీయ సిద్ధాంతం. ఈ తరహా కుహనా రాజకీయ డ్రామాలు ప్రజలకు బాగా అర్థమయ్యే బీజేపీకి పట్టం కట్టారు.


బిల్కిస్ బానో కుటుంబ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమెకు మాత్రమే అన్యాయం జరిగినట్టు ఆగ్రహిస్తున్న అజయ్ గుడవర్తి గ్రహించాల్సిన విషయం మరొకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పాత నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తను కిరాతకంగా చంపినవారు ముందస్తుగా విడుదలై తమ గ్రామంలో తిరగడం అన్యాయం అన్నది ఆమె పిటిషన్. కానీ ఆమె వెంట అజయ్ గుడవర్తి భావజాల పార్టీ వారు ఏ ఒక్కరూ లేరు. కానీ బిల్కిస్ బానో విషయాన్ని మాత్రం బిజెపియేతర పక్షాలన్నీ, ప్రజా సంఘాలన్నీ భుజాన వేసుకున్నాయి. కారణం ఆమె ముస్లిం, నేరస్థులు హిందువులు. ఇది మాత్రం అన్యాయం కాదా? బిల్కిస్ బానో కేసులో ముందస్తుగా విడుదలయిన వారికి లభించిన స్వాగతాన్ని ఖండించాల్సిందే. కానీ ఈ దేశ మాజీ ప్రధానిని కిరాతకంగా చంపేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న పెరియావాలన్‌ని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌ లోకి స్వాగతించిన విషయాన్ని ఏ పార్టీలూ ఖండించలేదే? అదేమి నీతి?


దేశం నిజమైన సెక్యులర్ దేశంగా మారితే మతసామరస్యాన్ని ఎవరూ రక్షించాల్సిన అవసరమే లేదు. హిందువులు ముస్లిముల మీద దాడి చేసినప్పుడు నేరస్తులు హిందువులని తెలియజేసేలా హెడ్డింగులు పెట్టే మీడియా సంస్థలు ఉదయపూర్‌లో దర్జీ గొంతును కోసి చంపినప్పుడు, నేరస్థులు ముస్లిములని బయటపడకుండా ఎంత తెలివిగా హెడ్డింగులు పెట్టారో ఢిల్లీలో పనిచేసే అజయ్ గుడవర్తికి తెలియదనుకోలేం.

దుగ్గరాజు శ్రీనివాస రావు

విజయవాడ

Updated Date - 2022-09-30T06:13:40+05:30 IST