
- కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్
కరీంనగర్ అర్బన్, మార్చి 27: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో మార్పు రావాలన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అందరిని కలుపుకుని, అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళితే పార్టీకి మేలు జరుగుతుందని అన్నారు. పార్టీ అధినేత సోనియాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు గ్యాస్ పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలపై ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్టన్లు తెలిపారు. 31న గ్యాస్ సిలిండర్లు పెట్టి వాటికి పూజ చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మల దహనం, 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, ముట్టడి, 7వ తేదీన విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నామని చెప్పారు. సోనియాగాంధీ నాయకత్వం బలపర్చాలంటే ఏ ఒక్క నాయకుడు కూడా బయటకు వెళ్లకుండా చూసుకుంటానని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలందరికీ పిలుస్తున్నానని తెలిపారు. సోనియాగాంధీ సీడబ్ల్యూసీ సమావేశం పెట్టిన తర్వాత గులాం నబీ ఆజాద్, ఆనంద్‌శర్మ లాంటి వాళ్లలో కూడా మార్పు వచ్చిందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, ముఖ్యమంత్రి ఎవరన్నది సోనియాగాంధీ నిర్ణయిస్తుందన్నారు. సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.