కిలో బంగాళదుంపలు రూ. 3 వేలు

Sep 19 2021 @ 17:43PM

కాబూల్ : కిలో ఆలుగడ్డలు కిలో రూ. 3 వేలు. ఇది నిజమే... ఎక్కడంటే... ఇటీవల తాలిబన్లు ఆక్రమించుకున్న ఆప్ఘనిస్తాన్‌లో... తాలిబాన్ల దురాక్రమణ నేపధ్యంలో అక్కడి పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతోన్న విషయం తెలిసిందే. అప్ఘన్‌లో తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ప్రకటించుకున్న తాలిబన్లు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో దారుణంగా విఫలమవుతున్నారని అంతర్జాతీయ సమాజం నుంచి వినవస్తోంది. కాగా ప్రస్తు పరిస్థితుల్లో అప్ఘన్లు బతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు.


కనీసం దేశం విడిచి పారిపోదామనుకున్నా కూడా పరిస్థితులు సహకరించడం లేదు. కాబూల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు విమాన రాకపోకలను కూడా నిలిపివేశారు. మరోవైపు ఇతర దేశాలతో ఉన్న నగరాల సరిహద్దులను సైతం మూసివేశారు. దీంతో అప్ఘన్లు ఎటూ వెళ్లలేని దుస్థితి నెలకొంది. మరోవైపు సరిహద్దు దేశాలు సైతం భూభాగాలను మూసివేశాయి. దీంతో సరిహద్దుల్లోనే లక్షలాది అఫ్ఘన్లు శరణార్థులుగా మిగిలిపోయారు.. మరోవైపు దేశంలో ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. 


ఇక ‘అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి’ చందాన పరిస్థితులు తయారయ్యాయి. రూ. లక్ష ఖరీదు చేసే వస్తువులు అక్కడ కేవలం రూ. 10 వేలకే దొరుకుతున్నాయి. రూ. 25 వేల విలువ చేసే రిఫ్రిజరేటర్లు, టీవీలు కూడా రూ. 5 వేలలోపే అమ్ముడవుతున్నాయి. ఇక ఆహార నిల్వలు తగ్గిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఓ మాదిరి ధనిక కుటుంబం సైతం కిలో బంగాళ దుంపలు కొనలేని పరిస్థితి నెలకొంది.


కిలో బంగాళా దుంపలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 3 వేలు చెల్లించాల్సిందే. బయటి నుంచి ఆహార దిగుమతులు లేకపోవడంతో నిత్యావసర సరకుల ధరలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. మరోవైపు బ్యాంకులు సైతం సరిగ్గా పని చేయకపోవడంతో నగదు కోసం అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కిలో టమాటాలు రూ. వెయ్యి పైమాటే. ఒక కొత్తిమీర కట్టను కొనాలంటే రూ. వంద పెట్టాల్సిందే. ఇక పెట్రోలు ధరైతే చుక్కలను చూపిస్తోంది. లీటరు పెట్రోలుకు రూ. 900 పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవే కాదు... ఏ వస్తువు కొనాలన్నా ఇదే మాదిరిగా ఉంటోంది. మరి ఆప్ఘన్లకు విముక్తి ఎప్పుడు లభిస్తుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.