చాణక్యనీతి: విజయ సాధకులు శునకం నుంచి నేర్చుకోవాల్సిన 4 అత్యున్నత విషయాలివే!

ABN , First Publish Date - 2022-04-06T13:11:05+05:30 IST

మనిషి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి...

చాణక్యనీతి: విజయ సాధకులు శునకం నుంచి నేర్చుకోవాల్సిన 4 అత్యున్నత విషయాలివే!

మనిషి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఆచార్య చాణక్య అనేక మార్గాలను అందించాడు. ఒక వ్యక్తికి నేర్చుకునేందుకు తగిన వయస్సు, సమయం అంటూ ఉండదని అతను తన పరిసరాల నుండి నిరంతరం ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోవచ్చని తెలిపాడు. ఇదేకోవలో విజయ లక్ష్యాన్ని సాధించాలనుకునేవారు... శునకం నుంచి కూడా నాలుగు అత్యున్నత విషయాలను నేర్చుకోవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు. చాలా ఆకలిగా ఉన్నా తిన్నదానితోనే సంతృప్తి చెందడం, గాఢనిద్రలో కూడా అప్రమత్తంగా ఉండడం, అంకితభావం, ధైర్యం.. ఈ నాలుగు సుగుణాలు శునకం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని చాణక్య తెలిపారు.


మనిషి ఎప్పుడూ ఆహారం కోసం పరిగెత్తకూడదని, తనకు లభించే ఆహారంతో సంతృప్తి చెందాలన్నారు. ఆకలిగా అనిపించిన సమయంలో కాస్త ఆహారం దొరికినా నోరు మెదపకుండా తినాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఉన్నదానితోనే సంతృప్తి చెందాలని, ఎప్పుడూ అధికంగా ఆశించకూడదని, అత్యాశ హాని చేస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి గాఢంగా నిద్రపోకూడదు. ఎప్పుడూ కుక్కలా నిద్రపోవాలి. చిన్నచిన్న శబ్దాలకూ కుక్క మేల్కొంటుందని, అదేవిధంగా మనిషి నిద్రపోవాలని చాణక్య సూచించారు. దీనివల్ల అవసరమైనప్పుడు అప్రమత్తం కావచ్చని తెలియజేశారు. ఒక కుక్క మాదిరిగా మనిషి తన యజమానికి విధేయత చూపిస్తూ అంకితభావంతో ఉండాలని చాణక్య సూచించారు. అదేవిధంగా మనిషి తాను ప్రేమించిన వ్యక్తికి విధేయునిగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు మీ సంస్థకు విధేయునిగా ఉండాలి. ఈ విధంగా నడుచుకున్నప్పుడు మీ లక్ష్యాన్ని సాధించవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కుక్క నుండి ధైర్య గుణాన్ని నేర్చుకోవాలి. తన యజమానికి హాని చేస్తే తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడే ఎంతో ధైర్యగుణం కలిగిన జంతువు శునకం. మనిషి శునకం మాదిరిగా ఎప్పుడూ నిర్భయంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు లోనుకాకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-04-06T13:11:05+05:30 IST