
బీజేపీఇటీవలి కాలంలో ఎన్నికలలో సుస్థిర విజయాలను సాధిస్తూ వస్తున్నది. ఇందుకు కొన్ని అంశాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మొదటిది మోదీ ఫ్యాక్టర్. సాటిలేని ప్రజాదరణ మోదీ సొంతం. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ ప్రతి ఎన్నికల్లో పార్టీని భుజస్కందాలపై మోసే బాహుబలిగా మోదీ ఆవిర్భవించారు. మోదీకి ఉన్న ఆదరణ కేవలం వ్యక్తిగత ఆకర్షణతో వచ్చింది కాదు. సుపరిపాలన, సానుకూల రాజకీయాలతో వచ్చింది. ఏడేళ్ల పాలనలో మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు అన్ని వర్గాలకు– ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు– విశేష ప్రయోజనాన్ని చేకూర్చాయి. ఈ పథకాల లబ్ధిదారులు కోట్లల్లో ఉన్నారు. వీరి గళమే ఎన్నికల ఫలితాల్లో ప్రతిధ్వనిస్తోంది.
మోదీ ప్రజల ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాదు, వారి పిల్లల చదువులను, పెద్దల ఆరోగ్య సంరక్షణనూ పట్టించుకుంటున్నారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మోదీ నేరుగా ప్రజలతో సంభాషిస్తున్నారు. ప్రజలు చెప్పింది వింటున్నారు. ప్రజలతో పాలనాపరంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా అనుసంధానమై ఉన్నారు. మోదీ ఈ వైఖరే రానున్న చాలా సంవత్సరాల వరకు బీజేపీ విజయానికి దోహదం చేసే అంశం కానున్నది.
బీజేపీని బలోపేతం చేసిన మరో ముఖ్యమైన అంశం సంస్థాగత నిర్మాణం. 2014 పార్లమెంటు ఎన్నికల నుంచి పార్టీ సంస్థాగతంగా పటిష్టమవుతూ వస్తోంది. ఈ ఘనత అమిత్ షాకే దక్కుతుంది. ఆయన నేతృత్వంలో నేను ప్రధాన కార్యదర్శిగా పని చేయడంతో వారిని దగ్గరి నుంచి పరిశీలించే అవకాశం దక్కింది. పార్టీ విస్తరణ కోసం అమిత్ షా అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇవాళ పార్టీ యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో అద్భుత విజయం సాధించిందన్నా, సొంతంగా మెజారిటీ సాధించిందన్నా దానికి కారణం పోలింగ్ బూత్ స్థాయి వరకు బీజేపీకి ఉన్న విస్తృతమైన సంస్థాగత నిర్మాణం.
మూడవ అంశం, బీజేపీ సాంస్కృతిక జాతీయవాద రాజకీయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని విమర్శకులు ద్వేషంగాను, మెజారిటీవాదంగాను చిత్రీకరించారు. హిందూత్వ గుర్తింపుతో భారతదేశం ‘ముందు హిందువులే’ అన్న దేశంగా మారుతున్నదని వారు విలపిస్తున్నారు. హిందుత్వ లేదా సాంస్కృతిక జాతీయవాదం మెజారిటీవాదమో, ద్వేషపూరితమో కాదు. ఇది భారతదేశ సర్వోత్కృష్టమైన నాగరికత ఆత్మ. ఇది భారతీయులను మమేకం చేస్తుంది, వారికి ఒక గుర్తింపునిస్తుంది.
తిలక్, గాంధీ వంటి నాయకులు భారతీయ సంస్కృతి అంతరాత్మను బాగా అర్థం చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో దీనిని సమర్థంగా వినియోగించుకున్నారు. దీనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన జిన్నా కాంగ్రెసును హిందూ మతతత్వ పార్టీగా ముద్రించారు. దీనిని నెహ్రూ సైతం వ్యతిరేకించారు. కానీ అతని కుమార్తె భిన్నంగా వ్యవహరించారు. మోదీ దేవాలయ సందర్శనలను ‘మతపరమైనది’గా భావించేవారు ఇందిరా గాంధీ దేవాలయాలను, సాధువులను క్రమం తప్పకుండా సందర్శించారనే విషయాన్ని తేలిగ్గా మరచిపోతారు. వివాదాస్పద గురువు ధీరేంద్ర బ్రహ్మచారితో ఆమె సాన్నిహిత్యం, దేవ్రాహ బాబాను సందర్శించడం, రుద్రాక్ష మాల వంటి మతపర చిహ్నాలను ప్రదర్శించడం వంటివన్నీ అందరికీ తెలిసినవే. గత ప్రధానమంత్రులు పి.వి.నరసింహారావు, దేవెగౌడ కూడా తమ మతాచారాలను దాచుకోలేదు. ఆ రోజుల్లో ఇంత విస్తృతమైన మీడియా లేదు. ప్రతికూల మేధోవాదం కూడా లేదు.
బీజేపీకి ఉన్న ఈ సానుకూలతలు ఇతర ప్రతిపక్ష పార్టీలను కలవరపెడుతున్నాయి. బీజేపీకి బలం చేకూరుస్తున్న ఈ అంశాలు– నాయకత్వం, పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలను ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు చాలా కష్టంగా ఉంది. కొందరు మంత్రాలు పఠించడం ద్వారా, జంధ్యాన్ని ధరించడం ద్వారా బీజేపీ బలాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు. కానీ అసలు ఎవరో నకిలీ ఎవరో ప్రజలకు తెలుసు. మేలిమి బంగారం అందుబాటులో ఉన్నప్పుడు కల్తీ బంగారం ఎవరికి కావాలి?
ఇప్పుడు ప్రతిపక్షానికి ఒకే ఒక్క అవకాశం కనిపిస్తుంది... అది రాష్ట్ర నాయకత్వం. కానీ మంచి ట్రాక్ రికార్డు, అవినీతి ఆరోపణలు లేని, పరిపాలన దక్షత ఉన్న నాయకులను ముందుపెట్టడం ద్వారా బీజేపీ ఈ ఆశలపైనా నీళ్లు చల్లింది. మోదీ ‘డబుల్ ఇంజన్’ అభివృద్ధి అనేది కేవలం నినాదానికే పరిమితం కాదు. అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ముఖ్యమంత్రుల పనితీరును మెరుగుపర్చే ప్రయత్నం.
సుపరిపాలన అందించిన చోట ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. యూపీలో యోగి విషయమే తీసుకుందాం. కాషాయ వస్త్రధారి అయిన యోగిని చాలామంది అపహాస్యం చేశారు. కానీ ఈ ఐదేళ్ల పాలనలో స్వచ్ఛమైన నాయకుడిగా, సమర్థవంతమైన పరిపాలనాదక్షుడిగా, అభివృద్ధి కేంద్రిత, ప్రజానుకూల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నాడు. మై మోదీ– యోగీ డబుల్ ఇంజిన్ ముందు, అఖిలేష్ పాతకాలపు మై ముస్లిం–యాదవ్ రాజకీయాలకు అవకాశం లేదు.
అనేక భౌగోళిక, రాజకీయ, శాంతిభద్రతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మారుమూల ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించదలిచాను. 2017లో 21సీట్లు గెలుచుకుని, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచేంత వరకు ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థిరమైన ఉనికే లేదు. గత ఐదేళ్లలో సీఎం బీరెన్ సింగ్ తన శక్తి, విశ్వసనీయతే పెట్టుబడిగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషి చేశారు. కొండ–లోయ అన్న విభజనకు ముగింపు పలికారు. అన్ని తెగలను (నాగా, కుకీ, మైతేయి) సమాన భాగస్వాములను చేసారు. పొరుగు రాష్ట్రమైన నాగాలాండ్‌తో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు. తద్వారా రాష్ట్రాన్ని దిగ్బంధించే సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకున్నారు. తొలిసారి నాగాలాండ్, మణిపూర్ ముఖ్యమంత్రులు ఇంపాల్‌లో అధికారిక సమావేశం నిర్వహించారు. ఫలితంగా మణిపూర్‌లో బీజేపీ పూర్తి మెజారిటితో అధికారాన్ని నిలబెట్టుకుంది.
పైన పేర్కొన్న అంశాలు బీజేపీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చాయి. మోదీ చేపట్టిన సరికొత్త పనితీరు రాజకీయాలు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలకు గట్టి పరీక్ష పెట్టబోతున్నాయి. దీనిని కొందరు విమర్శిస్తున్నారు. కానీ ఇది వాస్తవానికి భారత రాజకీయాల్లో జవాబుదారీతనంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతిపక్షాల వైఫల్యాన్ని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడంగా అభివర్ణించడం మేధో దివాళాకోరుతనానికి నిదర్శనం. ఆ ప్రమాణాల ప్రకారం చూస్తే నెహ్రూ పాలనా కాలాన్ని అత్యంత నిరంకుశ పాలనగా పిలవాలి. నేడు బీజేపీ ఉన్నంత పటిష్టంగా స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దాల్లో కాంగ్రెస్ ఉంది. చిన్న పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్‌కు దీటైన సవాలు విసిరేందుకు దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు బీజేపీని సవాలు చేసేందుకు ఇతర పార్టీలకూ సమయం పడుతుంది.
కానీ అప్పటికి, ఇప్పటికి మధ్య ఒక గుణాత్మక వ్యత్యాసం ఉంది. మోదీ భారత రాజకీయ ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారు. అవకాశవాద పొత్తులు ఇక పని చేయవు. అధికార పక్షానికయినా, ప్రతిపక్షానికయినా పనితీరు, ఉద్దేశాలు భవిష్యత్ ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయి. నైతికత, ప్రజాస్వామ్యం లాంటి అందమైన పదజాలంతో విమర్శించే బదులు మేధావులు ‘కుటుంబం కోసం’ కాకుండా, ‘ప్రజల కోసం’ పనితీరు ఆధారంగా విశ్వసనీయ రాజకీయాలను ప్రోత్సహించాలి.

రాంమాధవ్