ఇవీ.. ఇంటి స్థలాలు..!

ABN , First Publish Date - 2021-07-20T05:47:47+05:30 IST

చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు నీటి మడుగులను తలపిస్తున్నాయి.

ఇవీ.. ఇంటి స్థలాలు..!

  1. మడుగుల్లా మారిన జగనన్న కాలనీలు
  2. ఇళ్లెలా నిర్మించుకోవాలని లబ్ధిదారుల ప్రశ్న


ఎమ్మిగనూరు/ఆత్మకూరు/హొళగుంద/ఆలూరు జూలై 19: చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు నీటి మడుగులను తలపిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో అనువుగాని చోట ఇంటి స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు వాపోతున్నారు. వద్దన్నా వినకుండా అధికారులు మొండిగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఇళ్లను ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.


 పాములపాడు మండలంలోని రుద్రవరం, జూటూరు, శ్రీపతిరావుపేట, కోల్స్‌ ఆనందపురం, తుమ్మలూరు గ్రామాలకు చెందిన 270 మంది లబ్ధిదారులకు జూటూరు శివారు లోని ఊట వాగు సమీపంలో ఇంటి స్థలాలు ఇచ్చారు. ఆ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. 


 హొళగుంద మండలం మార్లమడికి గ్రామస్థులకు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని నాగరకన్వి రోడ్డు పక్కన వంకలో ఇంటి స్థలాలను ఇచ్చారు. వంక నీటికి వర్షపు నీరు తోడై.. మొత్తం 42 ప్లాట్లను ముంచెత్తుతోంది. దీంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేం దుకు ముందుకు రావడం లేదు. 


 ఆలూరు పట్టణ శివారులోని బళ్లారి రోడ్డులో ఉన్న జగనన్న కాలనీలో వర్షపు నీరు చేరింది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. వర్షం కురిస్తే పట్టణంలోని నీరంతా ఈ కాలనీలోకి చేరుతోంది. మొత్తం 3.50 ఎకరాలలో 139 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. 


 కోసిగి మండలంలోని నేలకోసిగి, వందగల్లు గ్రామాలకు చెందిన వంద మందికి నేలకొసిగి వద్ద స్థలాలు కేటాయించారు. ఈ స్థలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. 


 కౌతాళంలోని 692 మంది పేదలకు ఈచనహాల్‌ వద్ద ఇంటి స్థలాలు కేటాయించారు. ఎప్పుడు వర్షం కురిసినా ఈ ప్రాంతం మడుగులా మారిపోతోంది. 


 నందవరంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలు వంక పక్కనే ఉన్నాయి. దీంతో భద్రత కరువైంది. ఇళ్లు నిర్మించుకున్నా.. భారీ వర్షం కురిస్తే కాలనీ నీట మునుగుతుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 


ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలంట!


  1. చిన్న వర్షానికే నీట మునిగిన జగనన్న కాలనీలు
  2. నిర్మాణాలకు ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు
  3. నివాసయోగ్యమేనా అని ఆవేదన


కర్నూలు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఇల్లంటే పిల్లా పాపలతో సౌకర్యంగా ఉండాలి.. కనీస వసతులు ఉండాలి.. భద్రత ఉండాలి. కానీ జగనన్న కాలనీల్లో ఇవేవీ లేవని, ఇక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. నవరత్నాల పథకం కింద పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని వైసీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. లబ్ధిదారులను ఎంపిక  చేసి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. ఈ నెల ఒకటి, మూడు, నాలుగు తేదీల్లో గ్రౌండింగ్‌ పనులను కూడా చేపట్టింది. ఇదంతా పేద ప్రజల ఉద్ధరణగా వైసీపీ ప్రభుత్వం చాటుకుంటోంది. ఇందులో తమకు మరే ప్రభుత్వం సాటి రాదని ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో పేదల కోసం కేటాయించిన జగనన్న కాలనీల్లో ఒక్కటి కూడా అనువైన ప్రాంతంలో లేదు. చిన్న వర్షానికే ఈ కాలనీలు జలమయమైపోతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి  తీసిన శంకుస్థాన గుంతల్లో నీరు చేరింది. ఈ నీరు భూమిలో ఇంకి పోవా ల్సిందేగాని బయటకు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగాలేదు. వర్షానికే నీటి మడుగుల్లా మారిన జగనన్న కాలనీల్లో ఇళ్లు ఎలా కట్టుకో వాలని, ఒక వేళ నిర్మించుకున్నా భారీ వర్షాలు కురిస్తే గతేమిటని లబ్ధిదారు లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరు ఇక్కడ ఇళ్లు నిర్మించుకు నేందుకు ఆసక్తి చూపడం లేదు.


 పేరు గొప్ప..


జగనన్న కాలనీలో భాగంగా మొదటి విడత జిల్లాకు 638 కాల నీల్లో 98,388 ఇళ్లను కట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రూ.1,771 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా కూడా వేసింది. ఈ పనులు చేపట్టాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గత నెలలో అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల ఒకటో తేది నుంచి మూడు రోజుల పాటు 45,417 ఇళ్లకు గౌండింగ్‌ పనులు చేపట్టారు. ఇంత ఘనంగా చేపట్టిన జగనన్న కాలనీల పరిస్థితి ఒక్క వానకు బయటపడింది. ఎక్కడో పొలాల్లో, వాగుల పక్కన ఏర్పాటు చేసిన లే అవుట్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ రెండు మూడు రోజుల కిందట కురిసిన వర్షాలతో బండి ఆత్మకూరు, నందవరం, ఆలూరు మండలాల్లోని జగనన్న కాలనీల్లో నీరు నిలిచిపోయింది. ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే బేస్‌మెంట్‌ను ఆరు అడుగుల మేర నిర్మించి దానిపైన ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. 

Updated Date - 2021-07-20T05:47:47+05:30 IST