గుజరాత్ కుబేరులు..!

ABN , First Publish Date - 2021-05-04T21:44:59+05:30 IST

గుజరాత్.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు పుట్టినిల్లు.

గుజరాత్ కుబేరులు..!

గుజరాత్.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు పుట్టినిల్లు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే.. గుజరాత్ వాసులు మాత్రం వ్యాపారంపైనే దృష్టి పెడతారు. పశ్చిమ భారతానికి ఆభరణం అని వర్ణించే గుజరాత్ నుంచి ఎందరో వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. ధీరూభాయ్ అంబానీ కూడా గుజరాత్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించి కుబేరుడిగా ఎదిగారు. ఆయన తనయుడు ముఖేష్ అంబానీ ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ టెన్ ధనవంతుల్లో ఒకరు. 


`ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ గుజరాత్ రిచ్ లిస్ట్-2020` ప్రకారం గుజరాత్ కుబేరుల సంపద అక్షరాల 4 లక్షల కోట్ల రూపాయలు. 2019తో పోల్చుకుంటే 2020లో వీరి సంపద 32 శాతం పెరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం గుజరాత్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాప్ టెన్ కుబేరుల జాబితా.. 


గౌతమ్ అదానీ


గుజరాత్‌కు చెందిన అదానీ కుటుంబ వారసుడు గౌతమ్ అదానీ ఆస్తుల విలువ అక్షరాలా 1.40 లక్షల కోట్లు. అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తున్న అదానీ.. అంబానీ తర్వాత దేశంలోనే రెండో రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. ఒక్క 2020లోనే అదానీ గ్రూపు సంస్థల ఆదాయం 48 శాతం పెరిగింది. పోర్ట్ డెవలప్‌మెంట్, విద్యుత్తు, ఎంటర్‌ప్రైజెస్ వంటి రంగాల్లో అదానీ గ్రూపు కార్యకలాపాలు సాగిస్తోంది. 


కర్శన్‌భాయ్ పటేల్


భారత్‌లో అత్యంత పాపులర్ బ్రాండ్ `నిర్మా` వ్యవస్థాపకుడు కర్శన్‌భాయ్ పటేల్. ఈయన ఆస్తి విలువ 33,800 కోట్ల రూపాయలు. `నిర్మా`ను ప్రారంభించడానికి ముందు కర్శన్‌భాయ్ సొంతంగా డిటర్జెంట్లను తయారు చేసి ఇంటింటికీ వెళ్లి విక్రయించేవారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఈయన రెండో అత్యంత ధనవంతుడు. 


పంకజ్ పటేల్


దిగ్గజ ఫార్మ సంస్థ `క్యాడిలా హెల్త్ కేర్` అధిపతి పంకజ్ పటేల్. పంకజ్ తండ్రి, అతని కుటుంబ సభ్యులు `క్యాడిలా హెల్త్ కేర్`ను స్థాపించారు. ప్రస్తుతం పంకజ్ పటేల్ ఆ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సంస్థ విలువ రూ.33,700 కోట్లు. 


సమీర్, సుధీర్ మెహతా

టొరెంట్ ఫార్మస్యూటికల్స్ అధిపతులు సమీర్, సుధీర్ మెహతాలు సంయుక్తంగా ఈ జాబితాలో ఐదో స్థానాన్ని ఆక్రమించారు. ఈ సంస్థను వీరి తండ్రి ఉతమ్‌భాయ్ 61 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ కంపెనీ ఆస్తి విలువ రూ.21 వేల కోట్లు. 


భద్రేష్ షా

ఆహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐఏ ఇంజనీరింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రమోటర్ భద్రేష్ షా ఆస్తుల విలువ 11,600 కోట్ల రూపాయలు. సిమెంట్, మైనింగ్, పవర్ ఇండస్ట్రీస్‌కు అవసరమయ్యే క్రోమియం గ్రైండింగ్ పార్ట్స్‌ను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ రంగంలో ఇది ప్రపంచంలోనే రెండో పెద్ద సంస్థ.


బినీష్, నిమీష్, ఉర్మీష్

ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అధిపతులు బినీష్, నిమీష్, ఉర్మీష్ వరుసగా ఈ జాబితాలో వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంటాస్ కంపెనీ విలువ 10,600 కోట్ల రూపాయలు. ఈ సంస్థకు భారత్‌లో 10 కర్మాగారాలు ఉండగా.. యూరప్, మెక్సికోలో మరో ఐదు ఉన్నాయి. బ్రెస్ట్ కేన్సర్‌కు సమర్థంగా పనిచేసే `ఎలెఫ్తా` మందును ఈ సంస్థ 2019లో లాంఛ్ చేసింది. 


సందీప్ ప్రవీణ్ భాయ్


ఈ జాబితాలో పదో స్థానం సందీప్ ప్రవీణ్ భాయ్ ఇంజినీర్‌ది. ఈయన `ఆస్ట్రాల్ పైప్స్` సంస్థకు అధిపతి. ఈ కంపెనీ విలువ రూ.9,500 కోట్లు. ఆయన కొడుకులు కైరవ్, సౌమ్య కూడా సంస్థ కార్యకలాపాల్లో చరుగ్గా పాల్గొంటున్నారు. 


Updated Date - 2021-05-04T21:44:59+05:30 IST