Bipin Rawat: ప్రమాదానికి గురైన Mi-17V-5 హెలికాప్టర్ ప్రత్యేకతలు ఇవే.. అత్యాధునిక టెక్నాలజీ దాని సొంతమైనా..

ABN , First Publish Date - 2021-12-09T02:58:37+05:30 IST

దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్.. ఇలా ప్రమాదానికి గురవడంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది..

Bipin Rawat: ప్రమాదానికి గురైన Mi-17V-5 హెలికాప్టర్ ప్రత్యేకతలు ఇవే.. అత్యాధునిక టెక్నాలజీ దాని సొంతమైనా..

త‌మిళ‌నాడు కూనురు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 14మంది మృతి చెందడం.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని.. అన్ని రాష్ట్రాల సీఎంలు, అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే.. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్.. ఇలా ప్రమాదానికి గురవడంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది.. 


అత్యాధునిక సాంకేతికతను సంతరించుకున్న Mi-17V-5 హెలికాప్టర్.. భారత ఆర్మీలో చాలా ప్రత్యేకమైంది. ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ఎమ్‌ఐ-17 మాజీ పైలెట్‌ అమితాబ్‌ రంజన్‌ తెలిపారు. Mi-17V-5 హెలికాప్టర్.. Mi-8/17 కుటుంబానికి చెందిన మిలిట‌రీ ర‌వాణా విమానం. వీటిని భ‌ద్ర‌తాబ‌లాగాల ర‌వాణా, ఆయుధ రవాణా, అగ్నిప్ర‌మాదాల క‌ట్ట‌డి, పెట్రోలింగ్, గాలింపు తదితర ఆప‌రేష‌న్లలో వినియోగిస్తుంటారు. ఈ రకానికి చెందిన 80 హెలికాప్టర్లను పంపిణీ చేసేలా రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. 2013 వ‌ర‌కు మొత్తం 36 హెలికాప్ట‌ర్లను పంపిణీ చేశారు. భారత వైమానిక దళం కోసం 71 Mi-17V5 హెలికాప్టర్ల డెలివరీ కోసం 2012-13లలో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు.


Mi-17V5 హెలికాప్టర్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకేసారి 36మంది వరకు ఇందులో ప్రయాణం చేయొచ్చు. అలాగే  13,000 కిలోల బరువును సైతం సునాయాసంగా మోయగలదు. 6000 మీటర్ల ఎత్తులో 465 కిలోమీటర్ల దూరం నిర్విరామంగా ప్రయాణం చేసే సామర్థ్యం దీనికి ఉంది. అదేవిధంగా గంటకు 225- 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ఎడారి వంటి అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా పని చేస్తుంది. వీఐపీ చాపర్‌ కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ప్రమాదానికి గురవడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.

Bipin Rawat.. బయో వార్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన మరుసటి రోజే దారుణ ఘటన..!

Updated Date - 2021-12-09T02:58:37+05:30 IST