ఇవీ రోడ్లు! చూడండి సీఎం సారూ

ABN , First Publish Date - 2021-11-13T05:40:52+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టనందు వల్ల అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి.

ఇవీ రోడ్లు! చూడండి సీఎం సారూ

    1. జిల్లా వ్యాప్తంగా శిథిలమైన రోడ్లు
    2. రెండేళ్ల నుంచి ఒక్క పనీ చేయలేదు
    3. కేటాయించిన నిధులు కాగితాల్లోనే..
    4. గుంతల దారుల్లో నిత్యం ప్రమాదాలు
    5. ‘పెట్రోలు పన్ను’ రోడ్ల కోసమేనట..
    6.  ప్రభుత్వ ప్రకటనలపై ప్రజాగ్రహం



గత ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టనందు వల్ల అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,205 కోట్లతో 8,970 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేస్తున్నాం. ఇందుకోసం మన ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరు పెట్రోల్‌కు కేవలం ఒక్క రూపాయి సుంకంగా గత ప్రభుత్వం విధించిన దానికంటే అదనంగా విధించాల్సి వచ్చింది. 

- రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రకటన ఇది. మరి రూ.కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో? రోడ్లు ఎక్కడ అభివృద్ధి చేశారో వారికే తెలియాలి!


 రాబడిపై తప్ప రహదారుల దుస్థితిపై అవగాహన లేదు. ప్రకటనలపై ఖర్చు తప్ప  ప్రజా రవాణా మార్గాలను మెరుగుపరచాలన్న చిత్తశుద్ధి లేదు. రెండున్నరేళ్లలో జిల్లాలో రెండొందల కి.మీ. రోడ్లు నిర్మించలేకపోయారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన రాష్ట్ర పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోంది. పెంచిన పెట్రోల్‌ ధరలన్నీ రోడ్ల నిర్మాణాల కోసమే అని కుంటి సాకులు చెబుతోంది. రూ.2,025 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు జరుగుతున్నాయని బాహాటంగా ప్రకటించుకున్న  ప్రభుత్వానికి కర్నూలు జిల్లా రోడ్లు కనిపించడం లేదేమో! అకాల వర్షాలు, వరదలతో వందల కి.మీ. రహదారులు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పటికీ రోడ్ల పనులు మొదలవ్వలేదు. రెండేళ్లలో ప్రారంభంకాని పనుల్లో ఆర్‌ అండ్‌ బీ రోడ్లే 70 శాతం ఉన్నాయి. రోడ్లపై తారు లేచిపోయి కంకర తేలింది. సీసీ రోడ్లపై సిమెంట్‌ స్థానంలో గుంతలు మిగిలాయి. ఏయే సంవత్సరాలలో ఎంతెంత ఖర్చు పెట్టారో, ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణాలు జరిగాయో చెప్పలేక అధికారులు ముఖం చాటేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఖర్చు చేసేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. ప్రయాణం సాధ్యం కాని రోడ్లను చూసిన ప్రజానీకం ఇదేనా  అభివృద్ధి అని ముక్కున వేలేసుకుంటోంది.

కాగితాల్లో నిధులు


గడిచిన రెండున్నరేళ్లలో అకాల వర్షాలతో కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 270.94 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 2019-20 నాటికే 155.94 కి.మీ. మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లు శిథిలమయ్యాయి. నిధులు మంజూరయ్యాయని, కానీ కాగితాలకే పరిమితమయ్యాయని అధికారులే అంటున్నారు. రూ.26.17 కోట్ల నిధులకు సంబంధించి రెండేళ్లు గడుస్తున్నా టెండర్ల దశ కూడా దాటలేదు. నాలుగు నెలల క్రితం జిల్లాలో 78.4 కి.మీ.ల మేర మేజర్‌ రహదారులు, 17 ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులు వర్షాలకు దెబ్బతిన్నాయి. జిల్లా ప్రధాన రహదారుల్లో 44 ప్రాంతాల్లో రోడ్లు కోసుకుపోయాయి. 2020-21లో 17 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వాటికి రూ.8.3 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు పూర్తి కాలేదు. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోనూ పరిస్థితి ఇలానే ఉంది. 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది. 384 ప్రాంతాల్లో పనులకు కేంద్రం నుంచి రూ.27.9 కోట్లు, రాష్ట్రం తరపున రూ.8.4 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో 67 పనులు మొదలైనా, ఇప్పటి దాకా పూర్తి కాలేదు. రూ.28.3 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి.  


వర్షం వస్తే అంతే..

ఫ ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సమీపంలో రెండు చోట్ల భారీగా గుంతలు పడ్డాయి. వర్షం వస్తే రహదారి వంకను తలపిస్తుంది. కలుగొట్ల నుంచి కే తిమ్మాపురం వరకు ప్రధాన రహదా రికి ఇరువైపులా తారు లేచిపోయింది. 

ఫ కౌతాళం నుంచి ఉరుకుందకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. వర్షం వస్తే బురద మయమవుతోంది. కౌతాళం నుంచి ఆదోనికి వెళ్లే రహదారిలో ఎరిగేరి వద్ద గుంతలు పడ్డాయి. కౌతాళం నుంచి బాపురం వెళ్లే దారిని మరమ్మతు చేసేందుకు పుష్క రాల సమయంలో తవ్వి వదిలేశా రు. ఇప్పటికీ పనులు చేపట్టలేదు. 

- కోసిగి నుంచి చింతకుంట, పల్లెపాడు మీదుగా మాలపల్లికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి 12 కి.మీ. కంకర తేలి ఆధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దకడుబూరు నుంచి పెద్దతుంబళం వెళ్లే రహదారి కంకరతేలి గుంతలు పడ్డాయి. కమ్మళదిన్నె రహదారి, ఎమ్మిగనూరు నుంచి నాలుగో మైలు రాయి వరకు రహదారి గుంతల మయంగా మారింది. 

గుంతలమయం

- బనగానపల్లె-గుత్తి రహదారిలో క్రిష్ణగిరి మెట్ట నుంచి పెద్దరాజుపాలెం వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. ప్యాచ వర్కులు కూడా చేయడం లేదు. అవుకు నుంచి ఇల్లూరు కొత్తపేట వరకు కూడా రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. క్రిష్ణగిరి గ్రామం నుంచి మంగంపేట, మంగంపేట తండా, కాశిరెడ్డి నాయన ఆశ్రమం వరకు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి బీటీ రోడ్డు వేయలేదు. సుమారు 13 కి.మీ. వరకు గ్రామాల పరిధిలో బీటీ రోడ్డు లేదు. 

ఫ కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల - చిన్నకొప్పెర్ల గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిలో మోరీపై గుంతలు పడ్డాయి. మోరీ కూలేందుకు సిద్ధంగా ఉంది. బ్రిడ్జిపై రంధ్రం పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వల్లంపాడు - లింగాల గ్రామాల మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు శిథిలావస్థకు చేరుకుంది. రహదారికి ఇరువైపులా రక్షణ గోడలు లేవు.  

ఫ కర్నూలు నగరంలో బిర్లా గేట్‌, కృష్ణానగర్‌, శివారులోని మామిదాల పాడు, నిడ్జూరుతో పలు కాలనీల్లో రోడ్ల మీద గుంతలు పూడ్చక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 బిల్లులు రాక..

- హొళగుంద నుంచి మార్లమడికి, ఆదోని వరకు రోడ్లు గుంతలమయం అయ్యాయి. ఈ కొద్ది దూరం ప్రయాణానికే గంట పడుతోంది. 

- ఆలూరు-హత్తిబెళగల్‌ రహదారిలో మూడు కి.మీ. నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌ ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. బిల్లులు రాక పనులు నిలిపివేశారు.

నల్లమలలో ప్రమాదకరంగా ప్రయాణం

కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా గుంటూరు వెళ్లే ఎనహెచ 341-సీ జాతీయ రహదారి గుంతలమ యంగా మారింది. కొన్నేళ్లుగా రహదారి నిర్వహణను విస్మరించారు. దీంతో ఎక్కడబడితే అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడు తున్నారు. వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు నిలి చి, గుంతలను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. నడి రోడ్డుపై మోకాల్లోతు గుంతలు ఉండటంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల కం కర చిప్స్‌ వేసి కవరింగ్‌ చేసినా సమస్య తీరడం లేదు. నల్లమలలోని కేజీ రోడ్డు మరింత అధ్వానంగా మారింది. సింగిల్‌ లైన కావడం, రహదారికి ఇరువైపులా గుంతలు ఏర్పడటంతో ఈ దారిలో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. కర్నూలు నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, శ్రీశైలం, తణుకు, తుని, మాచర్ల, ఒంగోలు తదితర ప్రాంతాలకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ రోడ్లపై తిరిగే వాహనాలు దెబ్బతిని మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ సమస్యపై ఇటీవల టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ అధికార ప్రతినిధి మోమిన ముస్తఫా గళమెత్తారు. కేజీ రోడ్డుపై రాస్తారోకో చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కేవలం సిద్ధాపురం చెరువు కట్ట సమీపంలో 900 మీటర్ల రోడ్డును మాత్రమే బాగు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆత్మకూరు నుంచి నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా దెబ్బతింది. వైఎస్‌ఆర్‌ స్మృతివనం నుంచి అటవీ ప్రాంతంలో రహదారిపై అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఇటీవలే రూ.16 కోట్లతో నంద్యాల- ఆత్మకూరు రహదారి పనులను ప్రారంభించారు. ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. 

- నంద్యాల మండలం పెద్దకొట్టాల - అయ్యలూరు మెట్ట మధ్య ఉన్న రోడ్డు ఇది. మహానంది నుంచి కడప, తిరుపతి, చిత్తూరు వైపు వెళ్లడానికి మహానంది-నంద్యాల ప్రధాన రోడ్డుకు అనుసంధానంగా ఈ రోడ్డు ఏర్పాటైంది. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల వాహనాలు వందలాదిగా వస్తూ పోతుంటాయి. ఇంతటి ప్రధానమైన రోడ్డులో సగ భాగం వరకు భారీ గుంతలు పడ్డాయి. తారు రేగిపోయి మట్టిరోడ్డును తలపిస్తోంది. ద్విచక్ర వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేయాల్సిందే. వర్షాకాలంలో, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాలుగా రోడ్డు ఇలాగే ఉంది. రైల్వే గేటు సమీపంలో సీసీ రోడ్డు రెండేళ్ల క్రితం వరదకు తెగిపోయింది. ఇప్పటి వరకు సరి చేయలేదు. 


ఆగిన అలేబాదు రోడ్డు నిర్మాణం

ప్యాపిలి మండలంలోని అలేబాదు రోడ్డు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గార్లదిన్నె నుంచి అలేబాదు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. టెండరు పూర్తయి కొంత మేర పనులు కూడా జరిగాయి. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. రెండున్నరేళ్లు కావస్తున్నా.. పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు గతుకుల రోడ్డుతో ఇబ్బందులు తప్పడం లేదు.  

  మరమ్మతులకూ దిక్కులేదు 

- ఇది డోన మండలంలోని వెంకటాపురం రహదారి. డోన నుంచి వెంకటాపురం రహదారి మీదుగా క్రిష్ణగిరి వరకు ఈ రోడ్డు ఉంది. నిత్యం రద్దీగా ఉంటుంది. తారు, కంకర లేచిపోయి అడుగడుగునా గుంతలు కనిపిస్తున్నాయి. మరమ్మతుల కోసం రూ.10లక్షలు మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు నాలుగు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. అయినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఆర్థిక మంత్రి ఇలాఖాలోనే ఈ దుస్థితి ఉండడం కొసమెరుపు.


రికార్డులు లేవు..

రహదారుల మరమ్మతుల కోసం నిధులు ఖర్చు చేసిన రికార్డులు మా వద్ద లేవు. ఏడేళ్ల వివరాలు కావాలంటే జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో తీసుకోవాలి. మీరడిగిన డేటా మొత్తం వెరిఫై చేయాలంటే వారం పడుతుంది. అందుకు కావాల్సిన సిబ్బంది కూడా మాకు లేరు. ఒక నెల లేదా రెండు నెలల వివరాలు కావాలంటే ఇవ్వగలను. కర్నూలులో పీఏవోను అడిగితే వివరాలు ఇస్తారు. 

- ప్రసాద్‌ రెడ్డి,  ఆర్‌ అండ్‌ బీ ఈఈ 









Updated Date - 2021-11-13T05:40:52+05:30 IST