మేధో భ్రష్టత్వమే ఈ ‘అగ్ని’ జ్వాలలు

Published: Fri, 24 Jun 2022 01:41:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మేధో భ్రష్టత్వమే ఈ అగ్ని జ్వాలలు

ఆగమన తర్కం, నిగమన తర్కం గురించి మీరు వినే ఉంటారు. మరి ‘మోజిక్’ అనే ఒక ప్రత్యేక తరహా తర్కం గురించి మీకు తెలుసా? దానిపై సర్వ హక్కులూ మన ప్రధానమంత్రివే సుమా! అగ్నిపథ్ పథకంపై ప్రస్తుతం జరుగుతోన్న చర్చలే ఈ సరికొత్త తర్కం తీరుతెన్నులను తేటతెల్లం చేస్తున్నాయి. నోట్లరద్దు, కొవిడ్ లాక్‌డౌన్, 2020 కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన సందర్భాలలో కూడా మోజిక్ మన అనుభవంలోకి వచ్చింది.


ఇవిగో, ఆ తర్క విన్యాసాలు: తొట్ట తొలుత మనకు ఒక తీవ్ర సమస్య వాటిల్లిందని చెపుతారు. అది నల్లధనం కావచ్చు, మహమ్మారి కావచ్చు లేదా మన వ్యవసాయ మార్కెట్ల పరిస్థితి కావచ్చు. ఈ తర్కంలో తదుపరి వాదన ముక్కు సూటిగా ఉంటుంది: సమస్య తీరడానికి ఏదో ఒకటి చేయవలసిన అవసరముంది. ఈ వాదనతో ఎవరైనా ఎలా విభేదిస్తారు? ఇక ఆ తరువాత ప్రధానమంత్రి అనూహ్యంగా వ్యవహరిస్తారు : ఇదుగో, ఒక పరిష్కారం అంటూ ప్రజల ముందుకు వస్తారు. అది, అర్ధరాత్రి నోట్ల రద్దు కావచ్చు లేదా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం కావచ్చు లేదా కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టడం కావచ్చు. నిర్దిష్ట సమస్యలకు కచ్చితమైన పరిష్కారాలుగా మీకు నివేదించిన దాన్ని మీరు అర్థం చేసుకునేలోగానే మీరొక అనివార్య స్థితికి నెట్టబడుతారు. సమస్యను ఆ విధంగా పరిష్కరించుకుందాం. సత్వరమే దానిని పాటించండి. క్షణం కూడా వృథా చేయవద్దు అంటూ మోదీ తన మోజిక్ తర్కాన్ని ఒక ముక్తాయింపునకు తీసుకువస్తారు.


సరే, ప్రతిపాదిత పరిష్కారం మన మెదుర్కొంటున్న సమస్యను రూపుమాపుతుందా? నోట్ల రద్దు నల్లధనాన్ని ఎలా అరికట్టగలుగుతుంది? దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడమే కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏకైక, ఉత్తమ మార్గమా? ఇటువంటి ప్రశ్నను ఇతర ప్రశ్నలతో ముంచెత్తివేయడమే మోజిక్ ప్రత్యేకత. అదే దాని శక్తి. మీరు ఆ సమస్య గురించి పట్టించుకుంటున్నారా? దాని పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలని మీరు భావించడం లేదా? చిన్న చిన్న తప్పులను వెదకడమెందుకు? స్వల్ప లొసుగులను పట్టించుకోవడమెందుకు? ‘సానుకూల’ వైఖరితో ఎందుకు ఆలోచించరు? నాయకుడిని ఎందుకు విశ్వసించరు? ఇలా ఉంటుంది ఆ ప్రశ్నల పరంపర. లేదూ, వాస్తవాలను తారుమారు చేస్తారు కృత్రిమ కథలు అల్లుతారు. వంచన మహా శిల్పమవుతుంది. సమస్యతో సంబంధం లేని పరిష్కారపు వాస్తవిక, ఊహాత్మక భావిత ప్రయోజనాల గురించిన చర్చకు మిమ్ములను ఆహ్వానిస్తారు. మీరు సిద్ధమయ్యేటప్పటికే చర్చ ముగిసిపోతుంది. ఒక సమస్యను అన్వేషిస్తూ దానికి అతిముఖ్యమైన తదుపరి పరిష్కారంపైన మీరు శ్రద్ధ వహిస్తారు! మోజిక్ ఎలా సాగుతుందనడానికి అగ్నిపథ్ ఒక ప్రామాణిక ఉదాహరణ. ఒక వాస్తవ సమస్యను గుర్తించడం ఇందులో మొదటి అడుగు. పలు సంవత్సరాలుగా సైనిక దళాల వేతనభత్యాలు, పెన్షన్ల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు కొవిడ్ మొదలైన అనూహ్య విపత్తులతో మోదీ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. హిమాలయ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు మన జాతీయ భద్రతకు సవాళ్లుగా పరిణమించాయి. యుద్ధ సన్నద్ధతకు అధునాతన సాంకేతికతల, నవీన ఆయుధాలు ఎంతైనా అవసరం. సమస్యా పరిష్కారాన్ని ఇంకెంత మాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. 


ఇక ఇప్పుడు సమస్యా పరిష్కారంలో రెండో మజిలీకి చేరుకున్నాం. ‘మనం ఏదో ఒకటి చేయవలసి ఉంది’. సంభావ్య పరిష్కారాలు అనేకమున్నాయి. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం లేదా సాయుధ బలగాలలోని పౌర ఉద్యోగుల వేతన భత్యాల మొత్తాల్లో కోత విధించడం. సైనికుల, సైనికాధికారుల సర్వీస్ కాలాన్ని తగ్గించాలి. ఇవేమీ చేయకుండానే వ్యయాలను గణనీయంగా తగ్గించుకునే చర్యలు చేపట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఎవరో ఒక ఉన్నతాధికారి వాటిపై సలహా ఇచ్చి ఉంటాడు. సైనికాధికారులతో చర్చించకుండానే మోదీ ఆ చర్యలను అమలుపరిచేందుకు పూనుకున్నారు. ఇది ఆయన స్వాభావిక కార్యాచరణ శైలి. ఆచరణలో వడివడిగా ముందుకు సాగారు. సమస్య తీరిపోతుందా? ఒక సమస్యను పరిష్కరించేందుకు పూనుకుంటే అనేక సమస్యలు ఎదురుకావడం కద్దు. ఇక్కడా అదే జరిగింది. ఒక ‘జాతీయవాద’ ప్రభుత్వం రక్షణ రంగ వ్యయాలలో పిసినారితనంతో వ్యవహరించ కూడదు. అలా వ్యవహరించడాన్ని ప్రజలు సహజంగానే వ్యతిరేకిస్తారు. సైనిక దళాల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించ లేదు. మోదీ తర్కం ఫలవంతం కావాలంటే దానికి ఒక ఆసరా సమకూర్చ వలసి ఉంది. ఇదిగో, అలా ప్రారంభమయింది ఒక పెద్ద అబద్ధం. అసలు సమస్యపై ప్రజల దృష్టిని ఒక అప్రధాన సమస్యపైకి మళ్లించాలి. పరిష్కార పద్ధతిని గందరగోళపరచాలి. అగ్నిపథ్ విషయంలో మనం గత పదిరోజులుగా చూస్తున్నది ఇదే కాదూ?


అగ్నిపథ్ గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. మూడు వాస్తవాలను కప్పిపుచ్చడమే ఈ ప్రచార లక్ష్యమని చెప్పక తప్పదు. ఒకటి– సైనికుల ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్ నిలిపివేత. అగ్నిపథ్ నియామకాలు అదనంగా చేస్తున్నవి ఎంత మాత్రంకాదు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంగా అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టారు. ఇదొక విభ్రాంతికరమైన వాస్తవం. ప్రభుత్వ పత్రికా ప్రకటనల్లో ఎక్కడా దీని గురించిన ప్రస్తావనే కన్పించడం లేదు. మీడియాతో సైనికాధికారుల మాటా మంతీలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడం లేదు. రెండు– సైనిక దళాల సంఖ్య తగ్గింపు. బహుశా వాటి సంఖ్యను సగానికి తగ్గించేందుకు ఆస్కారమున్నది. అయితే అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లలో సంభవిస్తోన్న పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారా? ఆమోదించరని పాలకులకు బాగా తెలుసు. అందుకే సంబంధిత సంఖ్యలను వక్రీకరిస్తున్నారు. మూడు– చారిత్రకంగా కొన్ని ప్రాంతాలు దేశ రక్షణకు అవసరమైన సైనికులను ఇతోధికంగా సమకూరుస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల జనాభాకు అనుగుణంగా మాత్రమే వారి నుంచి సైనికులను రిక్రూట్ చేసుకుంటారు. ఇది సంబంధిత ప్రాంతాల, సామాజిక వర్గాల వారికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదుగనుక సైనిక దళాల అధికార ప్రతినిధులు గంభీరంగా ఒక అసత్యాన్ని చెబుతున్నారు: రెజిమెంట్ (సైనిక పటాలం)లో రిక్రూట్‌మెంట్‌లో ఎటువంటి మార్పు ఉండబోదట!


ఈ నిర్ణయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఉత్తమ మార్గం నామమాత్ర, కల్పిత సమస్యలపై భావోద్వేగ చర్చలను ప్రేరేపించడమే. అగ్నిపథ్ అనేది అదనపు ఉపాధి మార్గమన్నట్టుగా అగ్నివీరుల పని పరిస్థితులు, వేతన భత్యాలపై మీడియా చర్చలు జరుపుతోంది. సైన్యంలో నాలుగు సంవత్సరాలు పనిచేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చుకోవడం సాధ్యమవుతుందట! సైన్యం ఏమన్నా ఉద్యోగ శిక్షణా సంస్థా ఏమిటి?


ప్రతీ అగ్నివీరుడినీ నాలుగు సంవత్సరాల అనంతరం ఒక ఆకర్షణీయమైన ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుందనే ఒక కొత్త ప్రకటనను ప్రతిరోజూ హోరెత్తిస్తున్నారు. మరి మాజీ సైనికులకు ఇచ్చిన హమీలను ప్రభుత్వం నెరవేరుస్తుందా? సైన్యంలో పనిచేయడం వల్ల యువజనులలో దేశభక్తి పెంపొందగలదనే హస్యాస్పద వాదననొకదాన్ని అధికార వర్గాలు చేస్తున్నాయి. అగ్నిపథ్‌లో చేరే యువజనులు దేశ యువతలో కనీసం 1 శాతం కూడా ఉండబోరన్న వాస్తవం ఈ పాలకులకు తెలియదా? సాంకేతిక నైపుణ్యాలు గల యువజనులతో సైన్యాన్ని నింపేందుకే అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టినట్టు చెబుతున్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఇటువంటి ప్రతిపాదనలు చేసిందని అంటున్నారు. ఆ కమిటీ నిజంగా నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు సైనికోద్యోగాన్ని సిఫారసు చేసిందా? సైనిక దళాల సంఖ్యను తగ్గించేందుకు అగ్నిపథ్ పథకమే సరైన మార్గమా?


ఈ అసత్యాల సామ్రాజ్యమే ప్రధాని మోదీ శాశ్వత వారసత్వం కాబోతుంది. అత్యున్నత స్థాయి సైనికాధికారులు అబద్ధాలు చెప్పడాన్ని బాలలు టెలివిజన్‌లో వీక్షించినప్పుడు అది వారి మేధో సామర్థ్యాలను తప్పక ప్రభావితం చేస్తుంది. మోదీ ప్రభుత్వం మనకు కలిగిస్తున్న తీవ్రహాని హిందూ–ముస్లిం ప్రాతిపదికన ప్రజలలో చీలికలు సృష్టించడం కాదు. సాధారణమైపోయిన నైతిక భ్రష్టత్వం సైతం కాదు. పరిపాటిగా మారిన మన సమష్టి మేధో పతనమే– ఒక విశిష్ట, సమున్నత జాతి ప్రజలుగా సత్యాన్ని గ్రహించడంలోనూ, అబద్ధాలను వేటాడడంలోనూ మన వైఫల్యమే– ఆ అపకారం. ‘అగ్నిపథ్’పై ప్రస్తుతం కొనసాగుతున్న చర్చే అందుకొక నిదర్శనం. అబద్ధాల వ్యవస్థీకరణ ఫలితమేమిటో తాత్త్విక విదుషీమణి హన్నా ఆరెంట్ (1906–75) వివరించారు: ‘ప్రతీ ఒక్కరూ ఎల్లప్పుడూ నీకు అబద్ధాలే చెపుతున్నప్పుడు, దాని పర్యవసానం నీవు ఆ అసత్యాలను విశ్వసించడం కాదు. ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం దేనినీ నమ్మకపోవడమే... ఒక సమాజంలోని ప్రజలు ఇంకెంత మాత్రం దేనినీ విశ్వసించనప్పుడు దేనిపైనా ఒక నిర్ణయానికి రాలేరు. క్రియాశీలతనే కాదు, ఆలోచించే, విమర్శించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. అటువంటి ప్రజలతో నీవు నీకు కావలసిన దాన్ని నీవు అనుకున్న రీతిలో సాధించుకోగలవు’. మోజిక్ మొత్తం ఉద్దేశం కూడా ఇదే సుమా!

మేధో భ్రష్టత్వమే ఈ అగ్ని జ్వాలలు

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.