
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, రానున్న పండుగల దృష్ట్యా కేసులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతూ మరోమారు కరోనా గైడ్‌లైన్స్ విడుదల చేశాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కేరళలో మాత్రం అందుకు భిన్నంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
ఇది మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆందోళనకరంగా మారింది. దీంతో ఆయా రాష్ట్రాలు పలు ఆంక్షలను తిరిగి అమలులోకి తెచ్చాయి. కేరళ, మహారాష్ట్ర నుంచి కర్నాటకు వచ్చేవారు 72 గంటల లోపున తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తమతో పాటు తీసుకురావాల్సివుంటుంది. ఇదేవిధంగా విదేశాల నుంచి వచ్చేవారు కూడా తమ కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి. ఇక మహారాష్ట్రలోకి ఏ రాష్ట్రంవారు వెళ్లాలన్నా 72 గంటలలోపు తీసుకున్న కోవిడ్ నెగిటివ్ రిపోర్టు సంబంధిత అధికారులకు చూపించాల్సివుంటుంది. కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, గుజరాత్‌లలో కూడా ఇదేవిధమైన ఆంక్షలు విధించారు.