ఈ రైళ్లు విమానంతో పోటీ

ABN , First Publish Date - 2022-05-26T06:52:11+05:30 IST

నరసాపురానికి చెందిన ఓ వ్యక్తి అత్యవసర పనిమీద గురువారం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది.

ఈ రైళ్లు విమానంతో పోటీ

వేగంలో కాదు.. టిక్కెట్‌ ఛార్జీల్లో..!

శేషాద్రి, ధర్మవరం, లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌ల్లో మోత

ప్రీమియం తత్కాల్‌ టిక్కెట్‌ ధరలు మూడింతలు

బెంగళూరుకు తత్కాల్‌లో ఏసీ త్రీ టైర్‌ చార్జ్‌ రూ.1,490.. ప్రీమియంలో రూ.4,370 

హైదరాబాద్‌కు స్లీపర్‌ టిక్కెట్‌ రూ.370.. వసూలు రూ.920

తిరుపతికి తత్కాల్‌ రూ.420.. ప్రీమియంలో రూ.1000పైనే 

నరసాపురానికి చెందిన ఓ వ్యక్తి అత్యవసర పనిమీద గురువారం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లేందుకు బుధవారం ఆన్‌లైన్‌లో తత్కాల్‌ ప్రీమియం టిక్కెట్‌ను బుక్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఉదయం పది గంటలు కాగానే టిక్కెట్‌ కోసం ఆన్‌లైన్‌లో పోటీ పడ్డాడు. చివరికి ఏసీ త్రీ టైర్‌లో రూ.4,370తో బెంగళూరుకు టిక్కెట్‌ దొరికింది. మరో ప్రయాణికుడు స్లీపర్‌లో తిరుపతి వెళ్లేందుకు ప్రీమియం బుక్‌ చేసుకుంటే.. వెయ్యి  రూపాయలకు టిక్కెట్‌ లభించింది. 

నరసాపురం, మే 25 : ప్రయాణీకుల డిమాండ్‌కు తగ్గట్టు వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపకుండా తత్కాల్‌ టిక్కెట్ల స్థానంలో ప్రీమియం టిక్కెట్లను పెట్టి రైల్వే శాఖ క్యాష్‌ చేసు కుంటుంది. జిల్లా మీదుగా వెళ్లే శేషాద్రి, ధర్మవరం, లింగం పల్లి ఎక్స్‌ప్రెస్‌లలో ప్రీమియం టిక్కెట్లు విమానం ఛార్జీలతో పోటీ పడుతున్నాయి. నరసాపురం నడిచే లింగంపల్లి, ధర్మ వరం ఎక్స్‌ప్రెస్‌లకు అన్ని రోజుల్లోను డిమాండ్‌ ఉంది. ఇటు కాకినాడ నుంచి భీమవరం మీదుగా తిరుపతి, బెంగళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎప్పుడూ కిటకిటలాడుతుంది. ఈ రైళ్లల్లో ప్రయాణించాలంటే రెండు నెలల ముందే రిజర్వేషన్‌ చేయించుకోవాలి. నరసాపురం నుంచి తిరుపతి మీదుగా వెళ్లే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌కు ఇదే డిమాండ్‌ ఉంది. కొవిడ్‌ కారణంగా గడిచిన రెండేళ్లలో చాలామంది తీర్థయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లలేదు. కొవిడ్‌ తగ్గడంతో చాలామంది ప్రయాణాలు పెట్టుకున్నారు. అప్పటికే రైళ్లన్నీ నిండుకున్నా యి. డిమాండ్‌కు అనుగుణంగా ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపలేదు. దీంతో ప్రయాణీకులంతా తత్కాల్‌ టిక్కెట్లపైనే ఆధారపడ్డారు. గతంలో తత్కాల్‌ టిక్కెట్‌ ధర స్లీపర్‌కు రూ.75, ఏసీ త్రీటైర్‌ రూ.150, టూ టైర్‌కు రూ.200 ఉండేది. 


నేడు ప్రీమియం బాదుడు

అయితే రైల్వే ప్రయాణీకుల రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు ప్రీమియం టిక్కెట్లను అమల్లోకి తెచ్చింది. ఉదాహరణకు 40 టిక్కెట్లు తత్కాల్‌లో ఉంటే వాటిలో 20 ప్రీమియం రేట్లకు విక్రయిస్తున్నారు. అంటే డిమాండ్‌ను బట్టి టిక్కెట్‌ ధర పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు భీమవరం నుంచి బెంగళూరుకు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ త్రీ టైర్‌ ధర రూ.1,490, బుధవారం ప్రీమియం కోటలో ఈ టిక్కెట్‌ ధర రూ.4,370కు వెళ్లింది. ఇదే రైలులో ఏసీ టూ టైర్‌ టిక్కెట్‌ తత్కాల్‌లో రూ.2,600 టిక్కెట్‌ దొరక్కపోవడంతో ప్రీమియం కోటాలో రూ.6,300 పెట్టి కొనాల్సి వచ్చింది. నరసాపురం నుంచి లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు స్లీపర్‌ టిక్కెట్లు మంగళవారం రెట్టింపు ధరలు పలికాయి. రూ.370 ఉండే స్లీపర్‌ ధర రూ.920కి వెళ్లింది. 1,150 ఉండే త్రీ టైర్‌ ఏసీ రూ.2,730 పలికింది. తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు ప్రీమియంలోనూ టిక్కెట్లు దొరకలేదు. ఎక్కువ మంది శ్రీవారి దర్శనాలకు వెళ్లడంతో టిక్కెట్లకు ప్రతి రోజు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ రైలులో తత్కాల్‌ టిక్కెట్‌ రూ.420, కానీ ప్రీమియం కోటాలో రూ.1000పైనే పలుకుతోంది. ఏసీ అయితే రూ.2500 దాటి ఉంటుంది. దీంతో తత్కాల్‌ ప్రీమియం టిక్కెట్లు అంటేనే ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. ఏసీలో నాలుగు టిక్కెట్లు తీయాలంటే రూ.12 వేలు పైనే ఉండాలి. బెంగళూరుకు అయితే రూ.15 వేలు పైమాటే. ఆదివారాల్లో ఇది మరింత ఎక్కువ ఉంటుంది. జిల్లా మీదుగా మూడు రైళ్లలోనే ఈ డిమాండ్‌ అధికంగా ఉండడం విశేషం. హైదరాబాద్‌కు వారానికి ఒక రోజు మాత్రమే స్పెషల్‌ రైలు నడుస్తోంది. దీనిని మరో రెండు రోజులు పొడిగిస్తే కొద్దిగా డిమాండ్‌ తగ్గుతుంది. ఇటు తిరుపతి రైళ్లకు అదనంగా రెండు బోగీలు జత చేసి నడుపుతున్నారు. ఇలా కాకుండా వారానికి రెండు రోజులు డెల్టా మీదుగా స్పెషల్‌ రైలు నడిపితే రద్దీ చాలా వరకు తగ్గుతుంది. ప్రయాణికులకు మేలు జరుగుతుంది. 

Updated Date - 2022-05-26T06:52:11+05:30 IST