పోషకాల ప్రణాళిక!

ABN , First Publish Date - 2021-03-09T17:39:47+05:30 IST

‘నాకున్నది రెండు చేతులే!’... ఏకకాలంలో పనులన్నీ చక్కబెట్టే క్రమంలో విసిగిపోయిన ప్రతి మహిళ నోటి నుంచి వచ్చే మాట ఇది! అన్ని పనులను ఒంటి చేత్తో చేసే మహిళలు ఆహారం, వ్యాయామాల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా వయసుల వారీగా ఆహారంలో పోషకాల ప్రణాళిక అనుసరించాలి.

పోషకాల ప్రణాళిక!

ఆంధ్రజ్యోతి(09-03-2021)

‘నాకున్నది రెండు చేతులే!’... ఏకకాలంలో పనులన్నీ చక్కబెట్టే క్రమంలో విసిగిపోయిన ప్రతి మహిళ నోటి నుంచి వచ్చే మాట ఇది! అన్ని పనులను ఒంటి చేత్తో  చేసే మహిళలు ఆహారం, వ్యాయామాల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా వయసుల వారీగా ఆహారంలో పోషకాల ప్రణాళిక అనుసరించాలి.


టీనేజీలో...

కౌమారంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి, ప్రతి నెలా నెలసరి ద్వారా ఐరన్‌ కోల్పోతూ ఉంటారు అమ్మాయిలు. ఐరన్‌ను భర్తీ చేయకపోతే వ్యాధినిరోధకశక్తి తగ్గి, నిస్సత్తువ ఆవరించి, తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ వయసు అమ్మాయిలకు ఐరన్‌ లభించే ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలు, మాంసాహారం, గుడ్లు తినిపించాలి.


20 ఏళ్లలో...

ఈ వయసులో శారీరకంగా, హార్మోన్లపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు దృఢపడే వయసూ ఇదే! కాబట్టి క్యాల్షియం శోషణ కోసం విటమిన్‌ డి అవసరపడుతుంది. ఈ వయసులో డి విటమిన్‌ లోపిస్తే, ఎముకలు బలహీనపడి, తేలికగా విరిగిపోయే వీలుంది.  కాబట్టి పాలు, గుడ్లు, వెన్న, నువ్వులు, నట్స్‌ ఆహారంలో చేర్చుకోవాలి.


30 ఏళ్లలో...

ఇరవై నుంచి ముఫ్పై ఏళ్ల మధ్యలో ఆరోగ్యంతో పాటు, పునరుత్పత్తి వ్యవస్థ మీద కూడా శ్రద్ధ పెంచాలి. శరీర మార్పులకు తగ్గట్టుగా ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. భవిష్యత్తులో గర్భధారణకు తగినట్టు శరీరాన్ని సిద్ధం చేసేందుకు అన్ని రకాల విటమిన్లనూ శరీరానికి అందించాలి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు లేదా ఫోలేట్‌ సప్లిమెంట్ల ద్వారా గర్భధారణకు తగిన విధంగా శరీరాన్ని సిద్ధం చేయడం ఎంతో అవసరం.


40 నుంచి 50 ఏళ్ల మధ్యలో...

మెనోపాజ్‌కు ముందరి దశలో ఐరన్‌ కొరత ఏర్పడడం సహజం. అందుచేత వీరు ఐరన్‌ సమృద్ధిగా దొరికే ఆహారం, ఐరన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. 40 ఏళ్ల నుంచి జీవక్రియలు నెమ్మదిస్తాయి. దాంతో బరువు పెరుగుతారు. కాబట్టి క్యాలరీల మీద ఓ కన్నేసి ఉంచాలి. చర్మం పటుత్వం కోల్పోయే ఈ వయసులో కొల్లాజెన్‌ను పెంచే ఆహారం, సరిపడా ప్రొటీన్‌ తీసుకుంటూ రెసిస్టెన్స్‌ వ్యాయామాలు మొదలుపెట్టాలి.


50 దాటిన తరువాత...

యాభై ఏళ్లు దాటిన మహిళలకు బి విటమిన్‌ అవసరం మరింత ఎక్కువ. విటమిన్‌ బి6, బి12, ఫోలిక్‌ యాసిడ్లతో నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపరుచుకోవచ్చు, కొత్త రక్తకణాలను వృద్ధి చేసుకోవచ్చు.  క్యాల్షియం, డి విటమిన్‌ లోపంతో ఈ వయస్కుల్లో ఎముకలు గుల్లబారిపోయే అవకాశాలు మరీ ఎక్కువ. మెనోపాజ్‌కు చేరుకున్న తర్వాత, మహిళలు మెగ్నీషియం,   కొరత రాకుండా చూసుకోవాలి. వైద్యులను కలిసి క్యాల్షియం, డి విటమిన్‌ లోటును భర్తీ చేసే సప్లిమెంట్లు తీసుకోవాలి.

Updated Date - 2021-03-09T17:39:47+05:30 IST