వాళ్లే.. మళ్లీపుట్టారు!

Sep 20 2021 @ 02:29AM

బోటు ప్రమాదంలో నాడు ఇద్దరు ఆడబిడ్డలు మృతి

రెండేళ్లకు సరిగ్గా అదే తేదీన మళ్లీ కవలల జననం

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బోటు ప్రమాదంలో అయినవారందరినీ కోల్పోయిన ఆ దంపతుల ముఖంలో మళ్లీ చిరునవ్వులు పూశాయి. రెండేళ్ల క్రితం ఏ రోజైతే ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో.. సరిగ్గా అదే తేదీన.. ఊహించని రీతిలో మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) జన్మించడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టినప్పటికీ.. ఆ ఇద్దరూ దేవుడిచ్చిన బిడ్డలే అంటూ దంపతులిద్దరూ మురిసిపోతున్నారు. 15 సెప్టెంబరు, 2019.. ఏపీలోని రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ఆ బోటులో విశాఖపట్నం ఆరిలోవకు చెందిన ఒక కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. అద్దాలపై డిజైన్లు వేసే తలారి అప్పలరాజు తన తల్లిదండ్రులతో పాటు తన ఇద్దరు కూమార్తెలు గీతావైష్ణవి (3), ధాత్రి అనన్య (18 నెలలు)లను కూడా భద్రాచలం రాముడి దర్శనానికి పంపించారు. ఆ ప్రమాదంలో నలుగురినీ కోల్పోయారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. భార్య భాగ్యలక్ష్మికి అప్పటికే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ జరగడంతో పిల్లలు పుట్టరని కుంగిపోయారు. కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకొని నగరంలోని పద్మశ్రీ ఆస్పత్రిని గతేడాది సంప్రదించారు. సరిగ్గా ప్రమాదం జరిగిన తేదీనే సెప్టెంబరు 15నే ఆమె ఇద్దరు కవలల (ఆడపిల్లలు)కు జన్మనివ్వడం విశేషం. ‘ఇద్దరు బిడ్డలనూ కోల్పోయి శోకంలో ఉన్న మాకు.. ఇది దేవుడిచ్చిన వరం’ అంటూ దంపతులిద్దరూ మురిసిపోతున్నారు.

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.