వీరు అనర్హులంట!

ABN , First Publish Date - 2021-11-01T05:54:38+05:30 IST

రకరకాల పింఛన్‌దారులను అనర్హులుగా తేల్చేశారు.

వీరు అనర్హులంట!

  1. భారీగా పింఛన్‌ లబ్ధిదారుల తొలగింపు
  2. అన్ని పత్రాలు ఉన్నా తీసేసిన వైనం
  3. రూ.6 కోట్ల మేర తగ్గిన పంపిణీ
  4. పునరుద్ధరణకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ


కర్నూలు-ఆంధ్రజ్యోతి: రకరకాల పింఛన్‌దారులను అనర్హులుగా తేల్చేశారు. ఇది లబ్ధిదారుల్లో ఆందోళనకు కారణమైంది. జిల్లాలో దాదాపు నాలుగున్నర లక్షల మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో తొంభై శాతానికి పైగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులే! అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో వీరిలో చాలా మంది అనర్హులయ్యారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా అర్హత కోల్పోయారు. ఒకటో తేదీ వస్తోందంటే చాలు.. తమకు పింఛన్‌ వస్తుందా? ఆపేస్తారా? అని పింఛన్‌ డబ్బు మీదే ఆధారపడిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. 


మూణ్ణాళ్ల ముచ్చటే..


అర్హులందరికీ సామాజిక పింఛన్లు నెల నెలా అందిస్తామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా హామీ ఇచ్చింది. ఒకటో తేదీ తెల్లవారు జామున ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి వలంటీర్ల ద్వారా అందజేస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. కానీ ఇంకో పక్కన అనర్హత పేరుతో పింఛన్‌లకు కొత పెట్టేస్తున్నారు. కేవలం అయిదు నెలల్లో జిల్లా వ్యాప్తంగా పింఛన్‌ పంపిణీ దాదాపు రూ. 6 కోట్ల మేర తగ్గిపోయింది. దీన్ని బట్టే జిల్లాలో ఏ మేర లబ్ధిదారుల మీద అనర్హత వేటు పడిందో అర్థం చేసుకోవచ్చు. హామీ ప్రకారం పింఛను పెంచకపోగా, ఎప్పటి నుంచో వస్తున్న దాన్ని కట్‌ చేయడమేమిటని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


తిలాపాపం..


లబ్ధిదారులకు పింఛను ఆగిపోవడంలో తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్లు తయారైంది. అనర్హులను ఏరివేయమని ప్రభుత్వం ఆదేశించడంతో క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి ఎంపీడీవో స్థాయి అధికారుల వరకు అమితోత్సాహం చూపుతున్నారు. దీంతో అనర్హుల జాబితా పెరిగిపోతోంది. ఎక్కువ మీటర్లు ఉన్నాయని, వితంతువుల రేషన్‌ కార్డులో భర్త పేరు ఉందని పింఛన్లు రద్దు చేస్తున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా భూమి లేనివారికి ఉన్నట్లు, ఇళ్లు లేనివారు సొంత ఇంట్లో నివసిస్తున్నట్లు అప్‌లోడ్‌ చేశారు. ఇలాంటి సమాచారం ప్రకారం పింఛనుకు అర్హులైతే ‘ఎలిజిబుల్‌’ అని, కాని వారికి ‘నాట్‌ ఎలిజిబుల్‌’ అని రిమార్క్‌ రాస్తున్నారు ఆధార్‌, రేషన్‌ కార్డు వంటివి పెండింగ్‌ ఉంటే వాటిని రాసి పై అధికారులకు పంపాలి. అయితే ఇలాంటి వారందరి వివరాలను ఖాళీగా పంపుతున్నారు. దీంతో కంప్యూటర్‌లో నాట్‌ ఎలిజిబుల్‌ అని వస్తోంది. వివరాల్లో ఖాళీలను చూసి తిరస్కరించాల్సిన ఎంపీడీవోలు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో చాలామంది అనర్హులైపోతున్నారు. 


ఏం చేయాలి? 


గతంలో ఒకటో తారీఖు కోసం పింఛనుదారులు ఎదురు చూసేవారు. ఆదరణకు నోచుకోని వృద్ధులు, కష్టం చేయలేని దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలు ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బుతో ఆసరా పొందేవారు. ఇపుడు ఆ భరోసా పోయింది. ఈ నెలైనా పింఛన్‌ వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా తమ పేర్లు అనర్హుల జాబితాలో తోసేస్తారేమో అని గుబులు చెందుతున్నారు. క్షేత్రస్థాయి అధికారుల తప్పుల వల్ల అయితేనేమి, లబ్ధిదారుల సమాచారాన్ని ఎంట్రీ చేసే సమయంలో దొర్లే తప్పుల వల్ల అయితేనేమి.. చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. ఒకసారి ఇలా అనర్హతకు గురైతే మళ్లీ ఎపుడు పునరుద్ధరించేదీ అధికారులకు కూడా తెలియని పరిస్థితి. చాలామంది లబ్ధిదారులకు తమకు ఎందుకు పింఛను ఎందుకు ఆగిపోయిందో కూడా తెలియడం లేదు. పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కసారి కోత పడ్డాక తమ చేతుల్లో ఏమీ లేదని సచివాలయ ఉద్యోగులు సమాధానమిస్తున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. 


మళ్లీ వచ్చేనా..?


ఆదాయ పన్ను, పొలం, కారు వంటివి ఉన్న వారికి పింఛను నిలిపివేయాలంటూ ప్రభుత్వం నిబంధనలు తెచ్చింది. ఈ వడపోత ప్రక్రియలో పింఛన్లు కోల్పోయిన లబ్ధిదారులు సరైన పత్రాలతో అధికారులు చుట్టూ తిరుగుతున్నా పింఛను అందుకోలేకపోతున్నారు. వివిధ కారణాలతో ఒకసారి తిరస్కరణకు గురైన పింఛన్‌ తిరిగి ఎప్పటికి పునరుద్ధరణ అయ్యేదీ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఒకసారి అనర్హుడిగా నమోదు చేసిన ఐడీ డిలిట్‌ కాకపోవడంతో కొత్త వివరాలను నమోదు చేసే అవకాశం ఉండడం లేదు. పింఛను పునరుద్ధరణ ప్రక్రియ తమ చేతుల్లో లేదని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. 


భారీగా కోత..


జిల్లా వ్యాప్తంగా జూన్‌ వరకు దాదాపు రూ.109 కోట్లకుపైగా పింఛన్ల పంపిణీ జరిగింది. అక్టోబరులో దాదాపు 103 కోట్ల రూపాయల పంపిణీ చేశారు. ఈ అయిదు నెలల్లో రూ. 5.90 కోట్ల పింఛన్లు పంపిణీ తగ్గింది. గతంలో ప్రతి నెలా ఏయే వర్గాల వారికి ఎంతెంత పంపిణీ చేస్తున్నదీ డీఆర్‌డీఏ అధికారుల వద్ద పక్కా వివరాలు ఉండేవి. అయితే ఆగస్టు నుంచి కేవలం ఎంతమంది లబ్ధిదారులకు ఎంత పంపిణీ చేస్తున్నారో వివరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఏ నెల ఏ కేటగిరి వాళ్లు ఎంత మంది పింఛనుకు దూరమవుతున్నదీ తెలియడం లేదు. 


నా పింఛన్‌ తీసేశారు


నాకు ఏ ఆసరా లేదు. సరిగ్గా నడవ లేను. ముసలి దాన్ని అని కూడా చూడకుండా పింఛను తీసివేశారు. ఎందుకు తీసివేశారు అని వార్డు సచివాలయంలో అడిగితే ఏదో సర్వే లేనందున పింఛను తీసివేశామంటున్నారు. అధికారులు ఇలా పింఛను నిలిపివేస్తే నేను బతికేదెట్టా! 


- పింజరి రోశమ్మ, కర్నూలు


పింఛన్‌ అందడం లేదు


నా వయస్సు 70 సంవత్సరాలు. ఎన్నో ఏళ్లుగా పింఛన్‌ అందుతున్నది. వేలిముద్రలు పడలేదనే సాకుతో పింఛన్‌ తొలగించారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పింఛన్‌ రావడం లేదు. దయచేసి నా పింఛన్‌ను పునరుద్ధరించాలి. 


- ముల్లా మాబున్ని, పెరవలి, మద్దికెర మండలం


త్వరలోనే పరిష్కరిస్తాం


కొన్ని సాంకేతిక కారణాల వల్ల అర్హులైన వారి పింఛను కూడా ఆగిపోయాయి. ఒకసారి అప్‌లోడ్‌ చేశాక మా చేతుల్లో ఉండదు. పై నుంచి పునరుద్ధరించమని ఆదేశాలు వస్తే చేస్తాం. ప్రతి నెలా కొంతమందికి లబ్ధి చేకూరేలా చేస్తున్నాం. త్వరలోనే మిగతావారి సమస్యలను కూడా పరిష్కరిస్తాం.             


- వెంకటేశులు, పీడీ, డీఆర్‌డీఏ


వయస్సు తగ్గించి.. పింఛన్‌ తొలగించారు


నాకు వయస్సు లేదని పింఛన్‌ తొలగించారు. 2019 వరకు పింఛన్‌ వచ్చేది. టీడీపీ మద్దతుదారులమని నా వయస్సు 66 ఏళ్లు ఉన్నా తగ్గించి వేశారు. పింఛన్‌తోనే నేను బతుకుతున్నాను.


 -షేక్‌ దుబ్బకాశీం, బొందిమడుగుల

Updated Date - 2021-11-01T05:54:38+05:30 IST