వీళ్లు అదుర్స్‌!

ABN , First Publish Date - 2020-12-30T05:54:40+05:30 IST

పన్నెండేళ్ళ నుంచి నూట నాలుగేళ్ళ వయసు వరకూ...

వీళ్లు  అదుర్స్‌!

పన్నెండేళ్ళ నుంచి నూట నాలుగేళ్ళ వయసు వరకూ...

అగ్రశ్రేణి ఐటీ కంపెనీ ఛైర్‌పర్సన్‌ నుంచి పారాఅథ్లెట్‌ వరకూ...

తాము ఎంచుకున్న రంగాల్లో అద్వితీయమైన ముద్ర వేశారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొంది వార్తల్లో నిలిచారు.

వారిలో కొందరు...




పారా హుషార్‌

మానసీ గిరీష్‌ చంద్ర జోషి

వయసు: 31

ప్రత్యేకత: పారా ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఒడుదొడుకులు లేకుండా సాగిపోతున్న మానసి జీవితం ఒక ఘోర ప్రమాదంతో అనుకోని మలుపు తిరిగింది. ఆమె మోటార్‌బైక్‌ మీద ఆఫీసుకు వెళ్తూండగా ఒక తాగుబోతు ట్రక్కుతో ఢీకొట్టాడు. బాగా దెబ్బతిన్న ఆమె ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. అయితే ఆమె కుంగిపోతూ ఇంట్లో కూర్చోలేదు. ప్రొస్తెటిక్‌ కాలు అమర్చాక,  శరీరం మళ్ళీ మామూలు స్థితికి రావడం కోసం చిన్నప్పటి ఇష్టమైన బ్యాడ్మింటన్‌ ఆడడం మొదలుపెట్టారు. స్నేహితుల ప్రోత్సాహంతో పారా ఒలింపిక్స్‌ మీద దృష్టి సారించారు.


2015లో జరిగిన పారా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ పోటీల్లో పతకం సాధించడంతో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొంది తన ఆటను మెరుగుపరుచుకున్నారు మానసి. 2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీల్లో స్వర్ణం సాధించి, వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్స్‌లో.. ఎస్‌ఎల్‌3 సింగిల్డ్‌ విభాగంలో వరల్డ్‌ నెంబర్‌-2 స్థానానికి చేరుకున్నారు. మరో వైపు వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్నారు. పారా క్రీడల పట్లా భారతీయుల దృక్పథాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న ఆమె   ‘టైమ్స్‌-నెక్స్ట్‌ జనరేషన్‌ లీడర్స్‌-2020’, ‘బీబీసీ- 100 ఉమెన్‌ ఆఫ్‌ 2020’లోచోటు సంపాదించుకున్నారు.





లక్ష్యం ఘనం!

రిఽథిమా పాండే...

వయసు: 12

ప్రత్యేకత: పర్యావరణ పరిరక్షణ కార్యకర్త

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ గళాలను గట్టిగా వినిపిస్తున్న బాల కార్యకర్తల్లో ఉత్తరాఖండ్‌కు చెందిన రిథిమ ఒకరు. వివిధ దేశాల వైఖరి కారణంగా పర్యావరణానికీ, జీవ వైవిధ్యానికీ ఏర్పడుతున్న ముప్పునూ, వాటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతనూ ఆమె చాటి చెబుతోంది.

వాతావరణ మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఫిర్యాదు చేసి ఆమె వార్తల్లోకి ఎక్కింది. బాలల హక్కులకు భంగం కలిగిస్తున్నాయంటూ అయిదు దేశాలపై కిందటి ఏడాది ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన పదహారు మంది బాల కార్యకర్తల్లో రిథిమ కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగిన సదస్సుల్లో కూడా పాల్గొన్న రిథిమ ‘బీబీసీ- 100 ఉమెన్‌ ఆఫ్‌ 2020’లో చోటు దక్కించుకుంది. 




పరుగుల బామ్మ

మాన్‌ కౌర్‌

వయసు: 104

ప్రత్యేకత: దేశంలో అత్యంత వయోధికురాలైన అథ్లెట్‌

తొంభయ్యేళ్ళు దాటే వరకూ క్రీడలతో కనీస పరిచయం లేని, పంజాబీ తప్ప మరే భాషా మాట్లాడలేని ఈ బామ్మ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకొనే స్థాయికి ఎదిగారు. మాన్‌ కౌర్‌ కుమారుడు గురుదేవ్‌ అథ్లెట్‌. తల్లి మరింత ఆరోగ్యంగా ఉండాలన్న అతని కోరికను మన్నించి పరుగు మొదలెట్టిన మాన్‌ కౌర్‌ ఇప్పుడు విజయాలతో దూసుకుపోతున్నారు. షాట్‌పుట్‌, జావెలిన్‌త్రోలోనూ ఆమె ప్రతిభను చాటుతున్నారు. ఆక్లాండ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌లో 200 మీటర్ల పరుగు, షాట్‌పుట్‌లలో బంగారు పతకాలు గెలిచిన ఆమె జావెలిన్‌ త్రోలో అత్యంత ఎక్కువ దూరం విసిరిన వందేళ్ళకు పైబడిన మహిళగా ఏకంగా గిన్నిస్‌ రికార్డు స్థాపించారు.


ఇరవైకి పైగా అంతర్జాతీయ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. భారతదేశంలో అత్యంత వయోధికురాలైన అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందారు. ఈ ఏడాది మార్చిలో కేంద్రప్రభుత్వం ఆమెకు ‘నారీశక్తి’ పురస్కారం అందించింది. ఈ వయసులో మాన్‌ కౌర్‌ ప్రదర్శిస్తున్న క్రీడాస్ఫూర్తికి  ప్రధాని నరేంద్ర మోదీ అభివందనం చేసి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.




మేజర్‌ సర్వీస్‌!

సుమన్‌ గవానీ

వయసు: 33

ప్రత్యేకత: దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకురాలుగా సేవలు

ఒక మహిళ సైన్యంలో చేరడం, గుర్తింపు పొందడం అంత తేలిక కాదు. కానీ దాన్ని సుసాధ్యం చెయ్యడంతో పాటు ప్రపంచ స్థాయిలో సైతం తన పనితీరును చాటుకున్నారు మేజర్‌ సుమన్‌ గవానీ. నాలుగు సార్లు ప్రయత్నించి మరీ ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగం సంపాదించుకున్నారామె.


సిగ్నల్స్‌ కార్ప్స్‌ విభాగంలో పని చేస్తున్నప్పుడు దక్షిణ సూడాన్‌ వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ ఐక్యరాజ్యసమితి తరఫున సైనిక పరిశీలకురాలుగా వ్యవహరించారు. ఎప్పుడూ ఘర్షణలు జరిగే ఆ ప్రాంతంలో మహిళల మీద లైంగిక హింస కూడా ఎక్కువే. దాన్ని నిరోధించడం కోసం కోసం దాదాపు 250 మంది సైనిక పరిశీలకులకూ, దక్షిణ సూడాన్‌ భద్రతా దళాలకూ ఆమె శిక్షణ ఇచ్చారు. పరిశీలక బృందాల్లో మహిళలకు స్థానం కల్పించారు. అక్కడి పరిస్థితులు శాంతి పరిరక్షక దళాలకు అనుకూలంగా ఉండేలా దోహదం చేశారు.


గవానీ చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ‘ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు-2019’ ఆమెను వరించింది. ఈ ఏడాది దాన్ని ఆమె అందుకున్నారు. ఈ పురస్కారం భారతీయులకు రావడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సైతం ఆమెను ‘శక్తిమంతమైన ఆదర్శ మహిళ’ అని ప్రశంసించడం విశేషం.




కొత్త పా(బా)ట!

గానా ఇసైవాణి

వయసు: 24

ప్రత్యేకత: ‘గానా’ రీతిలో మొదటి ప్రొఫెషనల్‌ మహిళా గాయని

ఇసైవాణి తమిళనాట ఒక సంగీత సంచలనం. పురుషులదే పూర్తి ఆధిపత్యమైన, తమిళనాడులోని ఉత్తర చెన్నైకి ప్రత్యేకమైన ‘గానా’ అనే ఆలాపనా ధోరణిని ఒడిసి పట్టుకొని... ఆ రీతిలో మొదటి ప్రొఫెషనల్‌ మహిళా గాయనిగా ఎదిగారు. దళిత వర్గానికి చెందిన ఆమె ఈ క్రమంలో, అగ్రకుల ఆధిపత్యాన్ని సైతం దీటుగా ఎదుర్కొన్నారు.


చెన్నై కేంద్రంగా ఏర్పడిన ‘ది క్యాస్ట్‌లెస్‌ కలెక్టివ్‌’ అనే తమిళ్‌-ఇండీ బ్రాండ్‌లో సభ్యురాలైన ఆమె పాటకు ఇళయరాజా లాంటి ఎందరో ప్రముఖులు అభిమానులయ్యారు. ఒకప్పుడు ‘గానా’ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించడానికి సంకోచించిన ఎందరో మహిళలు ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే... ఇసైవాణి విజయం అందించిన స్ఫూర్తే దానికి కారణం. ‘2020లో ప్రపంచంలో వందమంది అత్యుత్తమ మహిళ’ల్లో ఒకరిగా ఆమెను బీబీసీ’ ఎంపిక చేసింది. తన స్వరంతో మరిన్ని ప్రయోగాలు చేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు.




లేడీ బాస్‌

రోషిణీ నాడార్‌ మల్హోత్రా

వయసు: 38

ప్రత్యేకత: భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన మహిళ

భారతదేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ ఏకైక సంతానం రోహిణి. దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు చేసే సంస్థల్లో మూడో అతి పెద్దదైన ఈ సంస్థ ఛైర్‌పర్సన్‌గా 2020 జూన్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే అంతకుముందే ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా గుర్తింపు సాధించారు.


అమెరికాలోని కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌లో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. మరోవైపు తమ కుటుంబానికి చెందిన శివనాడార్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శాస్త్రీయ సంగీతంలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. ‘2019 ఫోర్బ్స్‌- ప్రపంచంలోని అతి శక్తిమంతమైన మహిళల జాబితా’లో ప్రవేశించిన ఆమె 2020లో కూడా ఆ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.




నిరసన స్వరం

బిల్కిస్‌ బానో దాదీ

వయసు: 82

ప్రత్యేకత: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నిరసనకారిణి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... 2019 డిసెంబర్‌ నుంచి 2020 మార్చి వరకూ దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగిన ఆందోళనల్లో అందరి దృష్టినీ ఆకర్షించారు బిల్కిస్‌ దీదీ. ఎనిమిది పదులు దాటిన వయసులో... తీవ్రమైన చలిని లెక్క చెయ్యకుండా, తోటి ఉద్యమకారులకు స్ఫూర్తినిస్తూ తన పోరాట పటిమను చాటుకున్నారామె. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సైతం షాహీన్‌బాగ్‌ మాదిరి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచారు. ‘షహీన్‌బాగ్‌ దాదీ’గా అందరికీ ఆమె గుర్తుండిపోయారు


. అంతేకాదు, తాజాగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఆమె మద్దతు ప్రకటించడంతో పాటు వారిని   కలిసి, తన సంఘీభావం తెలిపారు. ‘‘మేము రైతు బిడ్డలం, రైతులు కష్టాల్లో ఉండి, నిరసన తెలుపుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? ప్రజలందరూ వారికి మద్దతు తెలపాలి’ అని స్పష్టం చేశారు. మొక్కవోని పోరాటపటిమను ప్రదర్శించిన బిల్కిస్‌ దీదీ పేరు ‘టైమ్స్‌’ పత్రిక ‘అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితా- 2020’, ‘బీబీసీ- 100 ఉమెన్‌ ఆఫ్‌ 2020’ జాబితాల్లో చోటు దక్కించుకుంది. 


Updated Date - 2020-12-30T05:54:40+05:30 IST