రఘురామలా నన్నూ కొట్టించాలని చూస్తున్నారు

ABN , First Publish Date - 2022-07-01T08:35:03+05:30 IST

రఘురామలా నన్నూ కొట్టించాలని చూస్తున్నారు

రఘురామలా నన్నూ కొట్టించాలని చూస్తున్నారు

దాని కోసమే శని, ఆదివారాల్లో నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు

కోర్టులు లేకుంటే చంపేద్దురు: అయ్యన్న

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో కొట్టించినట్లు నన్ను కూడా కొట్టించాలని చూస్తున్నారు. దాని కోసమే శని, ఆదివారాల్లో పోలీసులు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజుల్లో కోర్టుకు సెలవులు కాబట్టి రక్షణ దొరకదని అనుకొంటున్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి బతుకుతున్నాం. లేకపోతే మాలాంటి వాళ్లను చంపేద్దురు’’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును కలవడానికి ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయానికి గురువారం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. ‘‘నేనేదో అసభ్య పదజాలం తో మాట్లాడానని వైసీపీ నాయకులు వాళ్ల ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. వాళ్ల భాషలో మాట్లాడితేనే వారికి అర్థం అవుతుందని నేను అలా మాట్లాడాల్సి వస్తోంది. లేకపోతే వాళ్లకు అర్థం కాదు. నాపై ఏవేవో కేసులు పెడుతున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరువుతీశానని ఒక కేసు కొత్తగా పెట్టారు. మమ్మల్ని భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే ఈ కేసులు. ఆయన విశాఖలో ఎలా దోచుకొన్నాడో అందరికీ తెలుసు. మేం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడు తూనే ఉంటాం. నా మీద 12 కేసులు పెట్టారు. నన్ను అరెస్టు చేయదల్చుకొంటే కేసు నమోదుచేయాలి. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలి. దానిని ఆన్‌లైన్‌లో పెట్టాలి. నిబంధనలు పాటించకుండా ఇంటిపైకి వస్తే మమ్మల్ని కాపాడటానికి న్యాయస్థానాలు ఉన్నాయి.. భగవంతుడు ఉన్నాడు’’ అని అయ్యన్న అన్నారు. 

Updated Date - 2022-07-01T08:35:03+05:30 IST