సుప్రీం స్టే ఇచ్చినా ఆపరా? బుల్డోజర్లపై ఓవైసీ ఫైర్

ABN , First Publish Date - 2022-04-21T00:43:06+05:30 IST

చట్టబద్ధంగా బుల్డోజర్ల ఊరేగింపు జరుగుతోంది. ముస్లింలు సామూహికంగా శిక్ష అనుభవిస్తున్నారు. పేదలకు ఇది శాపం. మసీదు ముందున్న దుకాణాలను కూల్చేశారు. మరి దేవాలయాల ముందున్నవి ఎందుకు కూల్చరు? ఇది ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కుట్ర. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..

సుప్రీం స్టే ఇచ్చినా ఆపరా? బుల్డోజర్లపై ఓవైసీ ఫైర్

హైదరాబాద్: దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించడం కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు చేపట్టిన కార్యక్రమంపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినప్పటికీ అక్కడ ఇంకా కూల్చివేతలు కొనసాగడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులకు బంగ్లాదేశీ, రోహింగ్యా అని ముద్రలు వేసి అరాచాకాలు చేస్తున్నారని ఆయన తీవర్ స్థాయిలో మండిపడ్డారు. కాగా, జహంగీర్‌పూర్‌లో పర్యటించి సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం ఓవైసీ ఢిల్లీకి బయల్దేరారు.


దీనికి ముందు ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ ‘‘చట్టబద్ధంగా బుల్డోజర్ల ఊరేగింపు జరుగుతోంది. ముస్లింలు సామూహికంగా శిక్ష అనుభవిస్తున్నారు. పేదలకు ఇది శాపం. మసీదు ముందున్న దుకాణాలను కూల్చేశారు. మరి దేవాలయాల ముందున్నవి ఎందుకు కూల్చరు? ఇది ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కుట్ర. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ కూల్చివేతలపై సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చి, వెంటనే స్టే ఇవ్వడం హర్షణీయం. కానీ వాళ్లు కూల్చివేతలు ఆపడం లేదు. పైగా వారిని బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అని ముద్ర వేస్తున్నారు. వారంతా భారతీయులు’’ అని ఓవైసీ అన్నారు.


ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం ఈ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, జహంగీర్ పురి ఏరియాలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు.


కాగా, ఈ విషయమై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కూల్చివేతలను నిలిపేయాలని బుధవారం ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. ఇదే అంశంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనిపై విచారణ జరపనున్నట్లు చెప్పింది. హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం ఈ ప్రాంతంలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్లు, 25 మంది వయోజనులను ఈ కేసులో అరెస్టు చేశారు.

Updated Date - 2022-04-21T00:43:06+05:30 IST