Siddaramaiah: వారు గాంధీనే చంపేశారు.. నన్ను వదులుతారా?: సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2022-08-20T00:22:23+05:30 IST

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య(Siddaramaiah) తన భద్రతపై తీవ్ర ఆందోళన

Siddaramaiah: వారు గాంధీనే చంపేశారు.. నన్ను వదులుతారా?: సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య(Siddaramaiah) తన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొడుగు (Kodagu)లో పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య కారుపై కొందరు గుడ్లు విసిరి, నల్ల జెండాలు చూపించి ఆందోళనకు దిగిన తర్వాతి రోజే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. గాంధీనే చంపిన వారు తనను వదులుతారని తాను అనుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీని గాడ్సే (Godse)ను కాల్చి చంపాడని, కానీ వారు గాంధీ ఫొటోను పూజిస్తారని విమర్శించారు. 

 

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సిద్ధరామయ్య గురువారం కొడుగులో పర్యటించారు. అయితే, అక్కడాయనకు బీజేపీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నల్లజెండాలు చూపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘Go back Siddaramaiah’ అని నినదించారు. అంతేకాదు, కొందరు కార్యకర్తలు ఆయన కారుపై గుడ్లు కూడా విసిరినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఓ కార్యకర్త సిద్ధరామయ్యపైకి సావర్కర్ ఫొటోను విసిరాడు.


వీరు తనను కూడా వదలరన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర (Araga Jnanendra) స్పందించారు. ఆందోళనను అనుమతిస్తామని, కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటామంటే మాత్రం సహించబోమని అన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను విశ్వసించబోనన్న మంత్రి.. ఆయనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనపై ఎవరూ దాడిచేయరని, ఎవరూ హత్య చేయరని అన్నారు. సిద్ధరామయ్యకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించినట్టు పోలీసులు కూడా తనకు చెప్పారని మంత్రి జ్ఞానేంద్ర తెలిపారు. 

Updated Date - 2022-08-20T00:22:23+05:30 IST