అలా వదిలేశారు!

ABN , First Publish Date - 2022-09-24T05:56:25+05:30 IST

ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 65 ప్రకారం మండల, జిల్లా పరిషత్‌ల నుంచి ఏటా ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు జమ చేయాల్సి ఉంది.

అలా వదిలేశారు!
ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

నిధులు అక్కడ.. సమస్యలు ఇక్కడ

పదేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌కు జమకాని ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌

జడ్పీ, మండల పరిషత్‌లలోనే మూలుగుతున్న రూ.17.50 కోట్లు

పట్టించుకోని అధికారులు

జీవోలను అమలు చేయకపోయినా అడిగేదెవరు అన్నట్లు ఇన్నేళ్లు పరిషత్‌ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించారు. ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం ఖర్చుచేయాల్సిన నిధులను తమ వద్దనే నిరుపయోగంగా పెట్టుకున్నారు. వాటాగా రావాల్సిన సొమ్మును తమ ఖాతాకు జమచేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కూడా వారిని అడగనేలేదు. ఫలితంగా పదేళ్ల నుంచి  మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ నుంచి ఎస్సీ కార్పొరేషన్‌కు రావాల్సిన  రూ.17.50 కోట్లు ఇంతవరకూ జమకాలేదు. ఇటుచూస్తే కార్పొరేషన్‌లో చిల్లిగవ్వ లేక ఎస్సీలకు ఎటువంటి పనులూ కావడం లేదు. అటు ప్రభుత్వం చూస్తే పథకాలన్నింటినీ అటకెక్కించింది. దీంతో ఔత్సాహిక ఎస్సీ యువకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఒంగోలు నగరం, సెప్టెంబరు 23 : ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 65 ప్రకారం మండల, జిల్లా పరిషత్‌ల నుంచి ఏటా ఇయర్‌ మార్క్‌డ్‌ ఫండ్స్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు జమ చేయాల్సి ఉంది. కానీ జిల్లాలోని ఏ మండల పరిషత్‌ కార్యాలయం నుంచి, జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి కానీ ఒక్క పైసా  కూడా ఎస్సీ కార్పొరేషన్‌కు జమ కాలేదు. పదేళ్ల కిందటి వరకు ఏటా ఇయర్‌ మార్కుడ్‌ ఫండ్స్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు జమ అయ్యేవి. 2012-13 నుంచి ఈ నిధులను మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఇవ్వటం మానేశాయి. మాకు రావాల్సిన నిధులు మాకు పంపండి అని కార్పొరేషన్‌ అధికారులు కూడా అడగటం మానేశారు. దీంతో కార్పొరేషన్‌లో ఎస్సీలకు పథకాలు అమలు చేసేందుకు చిల్లిగవ్వ కూడా లేక పథకాలన్నింటినీ మూలన పడేశారు. 


నిధుల పంపిణీ చేయాల్సింది ఇలా..

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌కు వచ్చే ఆదాయంలో ఏటా 15శాతం ఎస్సీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఖర్చుచేయాల్సి ఉంది. ఈ 15 శాతం నిధుల్లో మూడో వంతు ఎస్సీ కార్పొరేష న్‌కు పంపించాలి. ఇలా ఏటా మండల పరిషత్‌ కార్యాలయాల నుంచి కానీ, జిల్లా పరిషత్‌ కార్యాల యం నుంచి కానీ రూ.కోటికిపైగా ఎస్సీ కార్పొరేష న్‌కు జమకావాల్సి ఉంది. అయితే పదేళ్లుగా నిధుల విషయాన్ని పట్టించుకున్న వారే లేకపోవటంతో కార్పొరేషన్‌కు జమ కాలేదు. ఇలా రూ.17.50 కోట్లు ఇప్పటివరకు కార్పొరేషన్‌కు జమకావాల్సి ఉంది.  


ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది

జిల్లాలోని మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల నుంచి ఏటా ఎస్సీ కార్పొరేషన్‌కు రావాల్సిన ఇయర్‌ మార్క్‌డ్‌ నిధులు జమకాకపోయినా ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఎస్సీ కార్పొరేషన్‌లో పథకాలు అమలయ్యేవి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్లకు దండిగా నిధులు ఉండటంతో పథకాల అమలుకు నిధుల కొరత ఉండేది కాదు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు ఈ ఇయర్‌ మార్కుడు ఫండ్స్‌ గురించి పట్టించుకునే వారే కారు. దీంతో జిల్లా పరిషత్‌, మండలపరిషత్‌ కార్యాలయాల్లోని ఎంపీడీవోలు ఈ నిధులను కార్పొరేషన్‌కు పంపించాలనే సంగతే పట్టించుకునే వారు కాదు. అయితే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల పరిస్థితి తారుమారైంది. 


అటకెక్కిన పథకాలు

గత మూడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేయటం లేదు. కార్పొరేషన్ల ద్వారా అమలు జరుగుతున్న దాదాపు అన్ని పథకాలను అటకెక్కించింది. చిన్న చిన్న పథకాలు అమలుకు కూడా కార్పొరేషన్లలో నిధులు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో అయినా కార్పొరేషన్‌ అధికారులు మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ కార్యాలయాల నుంచి ఎస్సీ కార్పొరేషన్‌కు రావాల్సిన నిధులపై దృష్టిపెట్టలేదు. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌లో కూడా పథకాలన్నీ దాదాపు నిలిచిపోయాయి. పథకాల అమలుకు ఎంతమేర నిధులు అవసరమో అంటూ ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపేసుకున్నారు అధికారులు. అయితే కార్పొరేషన్‌కు ఏఏ మార్గాల ద్వారా నిధులను సమీకరించవచ్చో అనే దిశగా ఏ మాత్రం ఆలోచన చేయనేలేదు. 

Updated Date - 2022-09-24T05:56:25+05:30 IST