Amanatullah Khan arrest: గుజరాత్‌లో బీజేపీకి తగిన శాస్తి తప్పదు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-09-17T20:17:20+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్టుపై ఆ పార్టీ సుప్రీం, ఢిల్లీ ముఖ్యమంత్రి..

Amanatullah Khan arrest: గుజరాత్‌లో బీజేపీకి తగిన శాస్తి తప్పదు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (Amanatullah Khan) అరెస్టుపై ఆ పార్టీ సుప్రీం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) కేంద్రంలోని అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. ''గుజరాత్‌లో వారికి తగిన శాస్త్రి తప్పదు'' అని అన్నారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన అవినీతి నిరోధక విభాగం అధికారులు అమానుతల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు.


ఆమానుతుల్లా ఖాన్ అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమని, 2 సంవత్సరాల 9 నెలల క్రితం కేసులో ఈ అరెస్టు జరిగిందని, ఆయన నివాసంపై దాడుల్లో ఏమీ దొరకలేదనే విషయం ఏసీబీ కూడా ఒప్పుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్వీట్‌లో తెలిపింది. ఎమ్మెల్యేను అరెస్టు చేసి, పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు జరిగిన కుట్రగా అమానతుల్లా ఖాన్ అరెస్టును పేర్కొంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు సంబంధించి అమానతుల్లా ఖాన్ నివాసంపై దాడులు జరిపిన ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. ఈ చర్యను కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో ఖండించారు. ''తొలుత వారు సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేశారు. కోర్టు పదేపదే అడిగినప్పటికీ వాళ్లు ఎలాంటి సాక్ష్యాలు సమర్పించలేకపోయారు. ఆ తర్వాత మనీష్ సిసోడియా ఇంటిపై దాడులు చేశారు. అక్కడ కూడా దొరికేందేమీ లేదు. ఇప్పుడు అమానతుల్లాను అరెస్టు చేశారు. మరింత మంది ఎమ్మెల్యేల అరెస్టులు కూడా చోటుచేసుకోవచ్చు'' అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో అన్నారు.


ఆయుధాల చట్టం కింద ఖాన్ అనుచరుడి అరెస్టు...

మరోవైపు, అక్రమ ఆయుధాల చట్టం కింద అమానతుల్లాఖాన్ సహచరుడు, బిజినెస్ పార్టనర్ హమిద్ అలీని ఢిల్లీ పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. ఒక పిస్తోలు, కొన్ని బుల్లెట్లు, రూ.12 లక్షలు అతని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-09-17T20:17:20+05:30 IST