తిరుపతిలో దొంగలు పడ్డారు

ABN , First Publish Date - 2021-04-18T06:25:50+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు..

తిరుపతిలో దొంగలు పడ్డారు

పోటెత్తిన బోగస్‌ ఓటర్లు

వేలాది నకిలీ ఐడీ కార్డులు

వందలాది బస్సులు


ఎక్కడా చుక్క నెత్తురు చిందలేదు. ఎవరూ కలబడి కొట్టుకోలేదు. తెగబడి దౌర్జన్యాలకు దిగి భయభ్రాంతులను చేయలేదు. డబ్బులు పంచలేదు. పంచుతున్నారని అడ్డుపడలేదు. ఘర్షణల్లేవు. లాఠీలు విరుచుకుపడాల్సిన అవసరమే రాలేదు. అయినా..అంతా ప్రశాంతం అనుకోవడానికి మాత్రం వీలులేదు. ముందస్తు పకడ్బందీ ప్రణాళికలతో నిశ్శబ్ద అరాచకాలకు అధికారపార్టీ ఒడిగట్టింది. ఔరా అని సకలజనులు విస్తుపోయేలా చేసింది. తెల్లారేసరికి తిరుపతి నగరాన్ని వందలాది బస్సులు, అంతకు మించి కార్లు ముంచెత్తాయి. శివార్లలోని మామిడి తోపులు, కళ్యాణమండపాలు, కొన్ని సంపన్న గృహాలు ఆపరిచితులతో కిటకిటలాడాయి. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటరే అగంతుకులకు ఆశ్రయంగా మారింది.


కుప్పలు తెలప్పలుగా సృష్టించిన బోగస్‌ ఓటర్‌ ఐడీ కార్డులతో, ఓటరు స్లిప్‌లతో దర్జాగా బయటి జనం నగరజనం సాక్షిగానే బూత్‌ల్లో బారులు తీరారు. మీడియా, పార్టీలు ప్రశ్నించి నిలేసిన చోట పారిపోయారు. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల నుంచి, కడప జిల్లా రాజంపేట, కోడూరుల నుంచీ అద్దె ఓటర్లు తిరుపతికి చేరుకున్నారు. యథాప్రకారం పోలీసులు మౌనంగా సహకరించారు. పోలింగ్‌ సిబ్బంది ప్రశ్న పెదవి దాటకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం మీద ప్రజాస్వామ్యం నట్టనడి నగరంలో నవ్వులపాలైన తీరును రాష్ట్ర ప్రజలంతా టీవీల్లో నివ్వెరపోయి వీక్షించారు. 



తిరుపతి నగరంలో పోలింగ్‌ ప్రారంభమైంది మొదలు సాయంత్రం వరకూ మెజారిటీ పోలింగ్‌ కేంద్రాల్లో దొంగ ఓటర్ల హవా కొట్టొచ్చినట్టు కనిపించింది. పోలీసులు, మీడియా, నగర ప్రజల సాక్షిగా బహిరంగంగా వందలాది వాహనాల్లో వేలాదిగా తిరుపతికి తరలివచ్చిన దొంగ ఓటర్లతో వైసీపీ నేతలు ఓట్లు వేయించారు. మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. ఎస్వీయూ క్యాంపస్‌లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బావమరిది హరీష్‌రెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాయలసీమ అధ్యక్షుడు హరిప్రసాద రెడ్డి తదితరులు పెద్దసంఖ్యలో దొంగ ఓటర్లతో మకాం వేశారు. అక్కడి నుంచే నగరంలోకి దొంగ ఓటర్లను పంపించారు. టీడీపీ, బీజేపీ నేతలు అడ్డుకునేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలించలేదు. టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహయాదవ్‌, దంపూరి భాస్కర్‌ యాదవ్‌ తదితరులు వాహనాలను అడ్డుకునేందుకు యత్నించారు.


రెండు బస్సులను పోలీసులకు పట్టించారు. దొంగ ఓటర్ల విషయమై మంత్రి పెద్దిరెడ్డ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలు ఎదుట ఆందోళనకు దిగిన నరసింహయాదవ్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, మబ్బు దేవనారాయణరెడ్డిలను పోలీసులు అరెస్టు చేయగా బైరాగిపట్టెడలో దొంగ ఓటర్లను అడ్డుకున్నందుకు శ్రీధర్‌ వర్మ అరెస్టయ్యారు. పూతలపట్టు నుంచీ పెద్ద సంఖ్యలో వచ్చిన దొంగ ఓటర్లను చెన్నారెడ్డి కాలనీలో నిలదీసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వారి నుంచీ బండబూతులు ఎదురయ్యాయి. తీవ్ర మనస్తాపంతో ఆమె అక్కడ నుంచీ వెనుదిరిగారు. బీజేపీ నేత శాంతారెడ్డి పలుచోట్ల దొంగ ఓటర్లను పట్టుకుని నిలదీశారు. ఐదుగురిని పోలీసులకు పట్టించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దొంగ ఓటర్లను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.


శ్రీకాళహస్తిలో చెదురుమదురు ఘటనలు

- శ్రీకాళహస్తి మండలం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం ఊరందూరులో ఎన్నికలను బహిష్కరించారు.పంచాయతీని శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో విలీనం చేసినందుకు నిరసనగా వారీ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2 వేల ఓట్లున్న ఈ గ్రామంలో పోలింగ్‌ ముగిసే చివరి నిమిషంలో పోలీసు అధికారుల జోక్యంతో 34 మంది ఓటు వేశారు.


- శ్రీకాళహస్తి పట్టణం 9వ వార్డులో వైసీపీకి చెందిన దొంగ ఓట్లను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమా ఘర్షణ జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు.

- తొట్టంబేడు మండలం చియ్యవరంలో వృద్ధుడిపై ఓ కానిస్టేబుల్‌ చేయి చేసుకున్నారు. క్యూలో కాకుండా పక్కనుంచీ అందరినీ ఓటేసేందుకు పంపుతుండడాన్ని వృద్ధుడు ప్రశ్నించడంతో పోలీసు ఆయన్ను కొట్టారు.


- శ్రీకాళహస్తి మండలం భీమవరంలో దొంగ ఓట్లను అడ్డుకునే క్రమంలో టీడీపీ, వైసీపీ ఏజంట్ల నడుమ వాగ్వాదం జరిగింది.


- శ్రీకాళహస్తి మండలం పోలి గ్రామంలో వెంకటేశ్వరరెడ్డి అనే వృద్ధుడు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళి తన ఓటు టీడీపీకి వేయాలని సిబ్బందిని కోరారు. అయితే పోలింగ్‌ అధికారిణి వైసీపీకి వేయడంతో గొడవ జరిగింది. ఆగ్రహించిన టీడీపీ ఏజెంట్‌ రాజేష్‌ ఈవీఎంను నేలకేసి బాదారు. అయితే అధికారులు దాన్ని వెంటనే మరమ్మతు చేయించి తిరిగి పోలింగ్‌ కొనసాగించారు.


- శ్రీకాళహస్తి మండలం వెలంపాడులో వైసీపీ నేతలు ఇష్టానుసారం పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్ళిరావడాన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయులు దాడి చేసి కొట్టారు.


- శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త రామకృష్ణపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.


- తొట్టంబేడు మండలం కాసరంలో దొంగ ఓట్లను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై వైసీపీ ఏజెంట్లు గొడవకు దిగారు.


- ఏర్పేడు మండలం సీతారాంపేట, ఆమందూరు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపేందుకు వైసీపీ వర్గీయులు యత్నించారు. అయితే టీడీపీ ఏజెంట్లు తిరగడడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.


- ఏర్పేడు మండలం మర్రిబండకు 30 మంది బయటి వ్యక్తులు దొంగ ఓట్లు వేసేందుకు రావడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ నేత బొజ్జల సుధీర్‌కు సమాచారమిచ్చారు. ఆయన తిరుపతి ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బయటి వ్యక్తులను తరిమివేశారు.


- శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం సమీపంలో వైసీపీ వర్గీయులు ప్రచారం సాగిస్తుండగా టీడీపీ వారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమా ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జి జరిపి చెదరగొట్టారు. మళ్ళీ కొంతసేపటికి ఇరువర్గాలూ గొడవకు దిగడంతో మరోసారి పోలీసులు వారిని చెదరగొట్టారు.


- రేణిగుంట బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్దకు ఐదు కార్లలో దొంగ ఓటర్లు రాగా పోలీసులు వెనక్కు పంపించారు.


- వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఏర్పేడు మండలం మన్నసముద్రంలో కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేశారు.


సత్యవేడులో ప్రశాంతంగా పోలింగ్‌

సత్యవేడు సెగ్మెంట్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అయితే ఇక పోలింగ్‌ ముగుస్తుందనగా బీఎన్‌ కండ్రిగ వెళుతుండిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. రిగ్గింగ్‌ కోసం వెళుతున్నారని అందిన ఫిర్యాదుతో వారు ఆయనకు నోటీసు జారీ చేశారు.దీంతో మండిపడిన ఆయన అక్కడే బైఠాయించారు. ఆయనకు మద్దతుగా వైసీపీ వర్గీయులు చేరుకుని రాస్తారోకోకు దిగారు. నోటీసు ఇచ్చిన సీఐపై చర్యకు డిమాండ్‌ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇది మినహా నియోజకవర్గంలో మరెలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు.


- సత్యవేడు సెగ్మెంట్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.అయితే నియోజకవర్గవ్యాప్తంగా వలంటీర్ల హవా ఎక్కువగా కనిపించింది.వలంటీర్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఓటర్లను ప్రభావితం చేశారు.శ్రీసిటీ పోలింగ్‌ కేంద్రంలో ఆవరణలోనే వలంటీర్లు రోజంతా వుండి కార్యకలాపాలు సాగించారు.


- సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నారాయణవనంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.


- సత్యవేడు పట్టణంలో ఓటు వేసి వెలుపలికి వచ్చిన ఓటర్లకు వైసీపీ వర్గీయులు బిరియానీ పొట్లాలు పంపిణీ చేశారు.


- నారాయణవనంలో వలంటీర్లు పోలింగ్‌ శాతం తక్కువగా వుండడంతో సాయంత్రం 5 గంటల తర్వాత ఇళ్ళకు వెళ్ళి మరీ పోలింగ్‌కు రావాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు.




(తిరుపతి,ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి శనివారం జరిగిన పోలింగ్‌లో తిరుపతి సెగ్మెంట్‌లో పూర్తిగా దొంగ ఓటర్ల హవా నడిచింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచీ భారీ ఎత్తున, అలాగే పొరుగున కడప జిల్లా నుంచీ కొంత మేరకు దొంగ ఓటర్లు తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ నేతలు యత్నించారు. ఆ క్రమంలో ఆందోళనకు దిగిన ఈ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. దొంగ ఓటర్లను నిలదీసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వారి నుంచీ బండబూతులు ఎదురయ్యాయి. శ్రీకాళహస్తి సెగ్మెంట్‌లో చెదురుమదురు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తన ఓటు టీడీపీకి వేయమని పోలింగ్‌ సిబ్బందిని ఓ వృద్ధుడు కోరగా పోలింగ్‌ అధికారిణి వైసీపీకి వేసిన ఘటనలో ఆగ్రహించిన టీడీపీ ఏజెంటు ఈవీఎంను నేలకేసి కొట్టారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంతూరైన ఊరందూరు ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.ఊరందూరు పంచాయతీని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రిగ్గింగ్‌ చేసేందుకు వస్తున్నారని అందిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను బీఎన్‌ కండ్రిగలో అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఈ ఘటన మినహా సత్యవేడు సెగ్మెంట్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

Updated Date - 2021-04-18T06:25:50+05:30 IST