హైదరాబాద్‌లో దోపిడీ దొంగల హల్‌చల్‌.. బెంబేలెత్తుతున్న ప్రజలు

May 9 2021 @ 08:57AM

  • రాత్రిపూట ఏటీఎంలు, పగలు దారిదోపిడీలు 
  • బెంబేలెత్తుతున్న ప్రజలు 
  • ఆర్థిక ఇబ్బందులతో దొంగలుగా మారుతున్న కొందరు..?

హైదరాబాద్‌ సిటీ : ఒకవైపు కరోనా కష్టాలతో ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు నగరంలో  దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు దారిదోపిడీలు, రాత్రి ఏటీఎం లూటీలు, ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దాంతో నగరంలోని పలు ప్రాంతాల్లో  ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.


ఏప్రిల్‌-29: కూకట్‌పల్లిలో ఏటీఎం సెంటర్‌ వద్ద భారీ దోపిడీకి పాల్పడిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.5లక్షలు దోచుకెళ్లారు. అంతర్రాష్ట్ర బిహార్‌ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అంతకు ముందు జీడిమెట్లలో దోపిడీకి పాల్పడి రూ. 1.90లక్షలు దోచుకెళ్లింది కూడా ఈ ముఠాయేనని పోలీసులు తేల్చారు. 


మే-1 : నాచారంలో ఇద్దరు దోపిడీ దొంగలు మానిక్‌చంద్‌ ఎక్స్‌రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో దోపిడీకి విఫలయత్నం చేసి స్థానికుల సహకారంతో పోలీసులకు చిక్కారు. అదేరోజు నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలోని హైదర్షాకోట్‌లో రోడ్డుపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు అతడ్ని అడ్డగించారు. బెదిరించి జేబులో ఉన్న రూ.5వేలు దోచుకొని పారిపోయారు. అదే రోజు బంజారాహిల్స్‌ పరిధిలోని ఓ డాక్టర్‌ ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ. 5లక్షలు చోరీ చేశారు.


మే-3 : ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. అతడ్ని తీవ్రంగా కొట్టి జేబులోని పర్సు, డబ్బులు, బంగారు ఉంగరాలు దోచుకొని పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు మృతి చెందాడు. 


మే-6 : దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలో అర్ధరాత్రి ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడ్డారు. బంగారం దోపిడీకి విఫలయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ అలారం మోగడంతో అప్రమత్తమైన  పారిపోయారు.  


 మే-7 : జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డుపై మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు అదే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు.


మే-7 : బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీంలో దోపిడీకి విఫలయత్నం చేశాడో దొంగ. ఎంత ప్రయత్నించినా డబ్బుల పెట్టెను బయటకు తీయడంలో విఫలమై వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ ట్రై కమిషనరేట్‌ పరిధిలో దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు.

శివారు ప్రాంతాలే టార్గెట్‌.. 

నగరంలో హల్‌చల్‌ సృష్టిస్తున్న దొంగలు రాత్రి పూట శివారు ప్రాంతాలను టార్గెట్‌ చేస్తున్నారు. రాత్రి 9నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండటంతో రోడ్లపై జనం ఉండటం లేదు. నిర్మానుష్యంగా ఉంటున్నాయి. దాంతో దొంగలు నగర శివారు ప్రాంతాలను టార్గెట్‌ చేసి ఏటీఎం సెంటర్‌లు, ఫైనాన్స్‌ సం స్థలను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడున్నారు. పగటిపూట జనం తక్కువగా ఉన్న కాలనీల్లో రోడ్డుపై వెళ్తున్న వారిని టార్గెట్‌ చేసి చైన్‌ స్నాచింగ్‌లు, దారిదోపిడీలకు పాల్పడుతున్నారు.


ఆర్థిక ఇబ్బందులే కారణమా..?

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతం అవుతున్న నేపథ్యంలో అనేక వ్యాపార సంస్థలు, పలు కార్యాలయాలు మూతపడ్డాయి. దాంతో చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాటి నుంచి గట్టెక్కడానికి కొంతమంది ఇలాంటి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతు న్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇంతకు మందు నేరచరిత్ర లేని వారు సైతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పోలీసులకు పట్టుబడిన దొంగల్లో ఎక్కువ మంది స్థానిక దొంగలు కావడం గమనార్హం.


మీ సేవ కేంద్రాల్లో చోరీ 

అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని రెండు మీ సేవ కేంద్రాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఎస్‌ఆర్‌నగర్‌ ప్రధాన రహదారిలోని మీ సేవ కేంద్రంతోపాటు మోతీనగర్‌లోని మీ సేవ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన ద్వారాల గ్రిల్స్‌ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలను తెరిచి అందులోని పత్రాలు, సామగ్రిని చిందర వందర చేశారు. మోతీనగర్‌ మీ సేవ కేంద్రంలో రూ.25వేల నగదును దొంగిలించారు. ఎస్‌ఆర్‌నగర్‌ మీ సేవ కేంద్రంలో స్వల్ప మొత్తంలో నగదు ఎత్తుకుపోయారు. శనివారం ఉదయాన్నే చోరీ జరిగినట్లు గుర్తించిన మీ సేవ సిబ్బంది సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకుని ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.