చాణక్య నీతి: మీరు సాధించిన విజయాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారా?.. అయితే ఆచార్య చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి!

ABN , First Publish Date - 2021-12-14T12:17:44+05:30 IST

మనిషి విజయసాధనకు అవసరమైన విషయాలు..

చాణక్య నీతి: మీరు సాధించిన విజయాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారా?.. అయితే ఆచార్య చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి!

మనిషి విజయసాధనకు అవసరమైన విషయాలు చాణక్య నీతిలో ఉన్నాయి. అదేవిధంగా సాధించిన విజయాన్ని నిలబెట్టుకుని, దానిని కొనసాగించే విధానాలను కూడా చాణక్యనీతిలో ఆచార్య చాణక్య తెలియజేశారు. పురాతన కాలంలో నీతిశాస్త్రంలో ఆచార్య చాణక్యుడు రాసిన విషయాలు ఈ నాటికీ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇవి మనకు జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తాయి. విజయాన్ని సాధించడం ఎంత కష్టమో, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమని చాణక్య నీతిలో చాణక్య పేర్కొన్నారు. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం విజయం సాధించిన మనిషి ఆ తరువాత కూడా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే సాధించిన విజయం ఎక్కువ కాలం నిలవదు. భవిష్యత్‌లో ఆ వ్యక్తి పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే ఏం చేయాలో ఆచార్య చాణక్య తెలిపారు. 


అహంకారానికి దూరంగా ఉండండి

విజయం సాధించిన తరువాత ఆ వ్యక్తి తాను గతంలో సాగించిన జీవన పోరాటాన్ని గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు. కొంతమందిలో విజయం సాధించిన తర్వాత అహంకారం ఏర్పడుతుంది. ఫలితంగా అటువంటివారు ఇతరులను గౌరవించరు. ఇలా ప్రవర్తిస్తే వారి విజయం ఎక్కువ కాలం నిలవదు. అందుకే విజయం సాధించిన వ్యక్తి ఎప్పటికీ గర్వానికి లోనుకాకూడదు. 

మంచిగా మాట్లాడండి

విజయం సాధించిన వ్యక్తి ఆ తరువాత కూడా తన ప్రవర్తనలో, మాటలలో వినయాన్ని కలిగివుండాలి. తద్వారా ఆ వ్యక్తి వలన ఇతరుల మనోభావాలు గాయపడవు. విజయం సాధించిన వ్యక్తి ఇతరుల మనోభావాలను గౌరవించాలి.  నిరాడంబర స్వభావమున్న వారిని అందరూ ఇష్టపడతారు. వినయ విధేయతలనేవి విజయం సాధించిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. అవి లేకపోతే ఆ వ్యక్తి తాను సాధించిన విజయాన్ని కొనసాగించలేడని ఆచార్య చాణక్య తెలిపారు. 


సామాజిక సేవ చేయండి

విజయం సాధించినవారు సమాజ ప్రయోజనాల కోసం పని చేయాలి. ప్రజా ప్రయోజనం కోసం పని చేయాలి. సమాజ హితం కోసం పని చేసే వారు విజయాన్ని కొనసాగించడంతోపాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలను అందుకుంటారు. విజయం సాధించిన వారు ఇతరులు విజయవంతం అయ్యేందుకు సహకారం అందించాలి. వారికి స్ఫూర్తిగా నిలవాలి. 

విశాల హృదయం కలిగివుండాలి

మన చుట్టూ ఉన్నవారిలోని కొంతమంది తప్పులు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో విజయం సాధించిన వారు పెద్ద మనసుతో వారిని క్షమించాలి. వారిని కించపరిచే పని చేయకూడదు. అలా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి మనసులో విజయం సాధించిన వ్యక్తిపై దురభిప్రాయం ఏర్పడుతుంది. విజయం సాధించడం ఎంత కష్టమో, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-14T12:17:44+05:30 IST