పలుచనవుతున్న పరిచయ వాక్యాలు

ABN , First Publish Date - 2022-02-14T07:03:09+05:30 IST

భారత రాజ్యాంగము మొదలుకొని నేడు వస్తున్న అనేక చిన్నా చితక పుస్తకాల వరకు ఏవో కొన్ని మినహాయిస్తే చాలా పుస్తకాలకు పీఠికలు ఉన్నవి. ప్రవేశిక, తొలిపలుకులు, అవతారిక, ఆశంస...

పలుచనవుతున్న పరిచయ వాక్యాలు

భారత రాజ్యాంగము మొదలుకొని నేడు వస్తున్న అనేక చిన్నా చితక పుస్తకాల వరకు ఏవో కొన్ని మినహాయిస్తే చాలా పుస్తకాలకు పీఠికలు ఉన్నవి. ప్రవేశిక, తొలిపలుకులు, అవతారిక, ఆశంస, భూమిక, ఉపోధ్ఘాతము, ముందుమాట, నా మాట, నుడి, మున్నుడి, ఆముఖం, పరిచయం, ప్రస్తావన, పర్యాలోకనం, ఆకాంక్ష, పరామర్శ, అభిప్రాయం... ఇలా అనేక పేర్లతో పీఠిక సజీవంగా ఉంది. పుస్తకంలో ఏముందో సూచన ప్రాయంగా చెప్పడం ముందుమాట లక్ష్యం. పాఠకుణ్ణి వాచకం వైపు మరలించడం దీని లక్షణం. పదకొండవ శతాబ్దిలో నన్నయ రాసిన అవతారిక నుండి ఈ లక్షణం కొనసాగుతున్నది. ఆ కాలంలో రచయితే ముందుమాట (అవతారిక) రాసుకున్నాడు. తన రచన గురించి రచనా లక్షణాల గురించి తెలుపుకున్నాడు. చదువరులకు రచనపై ఆసక్తి పెరగడం కోసం ఈ పని చేశారు. ఇష్టదేవతాస్తుతి; రాజు, పోషక, సహాయకుల ప్రశంసలు; మూలగ్రంథ ప్రాశస్త్యం, పూర్వకవిస్తుతి, కావ్య ప్రశస్తి, ఫలశ్రుతి, అంకితం ఇవ్వడం పేరున ఆ కాలంలో పీఠికలు రాశారు. ఇది తరువాత సాహిత్య చరిత్ర రచనకు దోహదపడింది. పీఠికల్లో విస్తారమైన రాజవంశ చిత్రణ, సుకవిస్తుతి, కుకవినిందలు కనపడతాయి. వీటి వల్ల రాజులకాలం, పాలనవిశిష్టతలు, కవులరచనాలక్షణాలు తెలిశాయి. ఆ కాలంలోనే పీఠికా రచనలో మార్పులు కూడా వచ్చాయి. మొదట్లో పీఠికలో భాగంగా ఉన్న ఫలశృతి తరువాత కావ్యం చివర వచ్చి చేరింది. కవి తన రచన గురించి చెప్పుకోవడం అవతారిక లోని విశేషం. ‘‘లోనారసి’’, ‘‘ప్రసన్న కథాకలితార్థయుక్తి’’ లాంటి మాటలు దీన్నే సూచిస్తాయి.


విద్య చాలామందికి అందుబాటులోకి రావడం వల్ల రాసే వారి సంఖ్య పెరిగింది. దానికి తోడు అచ్చుయంత్రం రావడం వల్ల రచన పుస్తక రూపంలోకి వచ్చింది. ఈ సమయాన ప్రాచీన సాహిత్యాన్ని ప్రచారంలోకి తెచ్చే క్రమంలో పరిష్కృత గ్రంథాలు వెలువడ్డాయి. గ్రంథాలను అచ్చు వేసేవారు (పరిష్కర్తలు, ప్రచురణ కర్తలు) కూడా పీఠికలను రాశారు. రచయితలే కాకుండా ఇతరులు కూడా పీఠికలు రాసే సంప్రదాయం మొదలయింది. వీరు ఆయా రచనలపై తమ స్వంత అభిప్రాయాలను పేర్కొన్నారు. అందులో భాగంగా కవికర్తృత్వచర్చ, కవిత్వచర్చ, కావ్యవిమర్శ, ఛందోవిశేషాలు, శబ్దప్రయోగవిశిష్టతలు, రచయితకు రచనకు మధ్యగల ఏకాత్మభావన, రచనతో రచయితతో తనకు గల విభేదాల్ని పీఠికల్లో ప్రస్తావించారు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు పాల్కురికి సోమనాథుని బసవపురాణం కావ్యానికి రాసిన పీఠిక, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ పాండురంగ మహాత్మ్యానికి కూర్చిన పీఠికలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. అలా పీఠికసాహిత్యవిమర్శకు పురుడుపోసింది. 


ఆ విమర్శపై ఖండన మండనలు జరిగి, అవి కూడా పుస్తకంగా వచ్చాయి. ఈ విధం గ్రంథ ప్రాచుర్యానికి దోహదపడింది, పరిష్కృత గ్రంథం స్వంతత్రరచన కాదు. ఆ రచన పరిష్కర్త చేయలేదు. పీఠికలోని విషయ విస్తృతి వల్ల సాహిత్యానికి మేలు జరిగింది.


ఆధునిక కాలంలో పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు వస్తున్నాయి. ఈ కాలం అవతారికకు ఆధునికతను చేర్చి పీఠిక సంప్రదాయ సాహిత్యానికి చెందినదనే భావనను పెంచింది. పీఠిక పద్యరూపం వీడి గద్య రూపం సంతరించుకుంది. గత కాలంలో లాగే ఇప్పుడు కూడా రచయిత తన పుస్తకానికి ముందుమాటను అభిప్రాయం రూపంలో రాసుకుంటున్నాడు. రచనా నేపథ్యం, కృతజ్ఞతలు, వగైరాలను నమోదు చేస్తున్నాడు. అదనంగా ఇతరుల మాటలను కూడా జత చేస్తున్నాడు. ఈ సందర్భమే పీఠిక రంగు, రూపాల్ని మార్చింది. మిత్రునితోనో, ప్రముఖులతోనో, అంతరంగికునితోనో తనే రాసి ఇతరుల పేరు పెట్టడంతోనో, ఇంకా ఎన్నో విధాలుగా ముందుమాటల్ని పుస్తకంలో పొందుపరుస్తున్నారు. పుస్తకానికి రెంటికి మించి మాటలు కనపడుతున్న రోజులివి. పీఠికలు గ్రంథాన్ని అర్థం చేయించడానికి, అదనపు సమాచారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అంతకు మించి రకరకాల శీర్షికలతో వచ్చే మాటలు చర్విత చరణానికి చోటు కల్పిస్తాయి. 


ఈ ధోరణి వల్ల రచన విలువ తగ్గుతుంది.


పుస్తకం రాశాక, దాని గురించి రాసేది ముందుమాట. దీనికి పరిధి, ప్రయోజనం, ప్రణాళిక, లక్ష్యం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసిన మాటకు వ్యక్తిత్వం ఉంటుంది. అలాంటి ముందుమాట తను నిలబడి, పుస్తకాన్ని నిలబెడుతుంది. 


చలం యోగ్యతాపత్రం, కుందుర్తి పీఠికలు, శివారెడ్డి ముందుమాటలు ఇందుకు ఉదాహరణలు. ఇలాంటివి సాహిత్య విమర్శలో ప్రధాన భూమికను పోషించాయి. ఉద్యమనేపథ్యం గలవి, సిద్ధాంతనేపథ్యం గలవి, ఉద్యమ స్వరూప స్వభావాలను చర్చ చేసినవి, కథాకావ్యచర్చ జరిపినవి, వచనకవితా చర్చను లేపినవి, ఆయా వాదాల్ని స్థిరపరచడానికి దోహదపడినవి... ఈ కోవలో వచ్చిన మిగతా ముందుమాటలు సాహిత్య పురోగమనానికి చేయూతనిచ్చాయి. కొత్త ప్రయోగాలు వచ్చినపుడు వాటిని వివరిస్తూ వచ్చిన ముందుమాటలు చాలా ఉపయోగపడ్డాయి. గ్రంథ ప్రయోజనాన్ని చిత్రించి పాఠకుల అవగాహనను పెంచాయి. మెచ్చుకోలు మాటలు అందుకు భిన్నంగా ప్రవర్తించాయి. ముందుమాటలు రాయడంతోనే కాలం ముగిసిందని వాపోయిన ప్రముఖుడు ఒకవైపు, ఫలానా ప్రముఖుడు కాలయాపన చేసి కూడా రాయకపోవడం వల్ల ముందుమాట లేకుండానే పుస్తక ప్రచురణ చేసానన్న రచయిత మరొక వైపు కనిపించాడు. అడగగానే అలవోకగా ముందుమాట రాసిచ్చేవారు కనపడుతున్నారు. ఈ స్థితి ఆరోగ్యకరమైనది కాదు. అస్మదీయులు, తస్మదీయులు అనే కొలమానంతో రాసిన మాటలున్నాయి. రాసిన ఉపోద్ఘాతాన్ని మార్చి వేసుకున్న సందర్భాలున్నాయి. రచనతో నిమిత్తం లేకుండా ఎవరి మీదో ఉన్న అక్కసును పరిచయంగా పేర్చిన వారున్నారు. రచన కన్నా భూమిక సైజు పెద్దగా ఉన్న సమయాలు ఉన్నవి. మలిప్రచురణ సందర్భంలో మలిపలుకులు (ఎపిలాగ్‌) పేరుతో విస్తరించిన మాటలున్నవి. మొహమాటంతో రాసిన ప్రస్తావనలు కనిపిస్తాయి. రచయిత తన ప్రయోజనం కోసం స్నేహితులతో బంధువులతో రాయించుకున్న ఒప్పుకోలు మాటలు పీఠికల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ముందుమాటలు సమకాలీన పరిస్థితులను, కావ్య నిర్మాణాన్ని, కవి సమర్థతను విశ్లేషించి రచయిత హృదయావిష్కరణ చేయాలి. క్లుప్తతకు బదులు అసంగతి, ఆప్తతకు బదులు పొగడ్త ఉండకూడదు. ముందుమాట - పుస్తక సమీక్ష ఒకటి కాకూడదు, పుస్తక లోపలి ద్వారం తెరవడానికి అభిప్రాయాల్లోని భాషాసౌందర్య పరిమళం, తార్కిక అవగాహనలు ఉపయోగపడాలి.


వాచకానికి ఊతంగా నిలిచి స్వయం ప్రకాశకాలుగా వెలిగిన ముందుమాటలు కూడా ఉన్నవి. తాము రాసిన ముందుమాటలలోని మన్నిక గల మాటలను ఏర్చికూర్చి పుస్తకాలుగా తెచ్చిన ప్రముఖులు ఆనాడు-ఈనాడు ఉన్నారు. ‘నూరుపూలు’ (నందిని సిధారెడ్డి ముందుమాటలు) ‘అక్షరధుని’ (గన్నమరాజు గిరాజా మనోహరబాబు ముందుమాటల మూట) అనే సంపుటాలు ముందుమాటల భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నవి. నందిని సిధారెడ్డి ముందుమాటల్లో విమర్శ-విశ్లేషణ- అధిక్షములు తాత్వికతను సంతరించుకొని ఉంటాయి. సంస్కృతశతకం కన్నా భిన్నంగా తెలుగుశతకం ఆవిర్భవించిందనే ప్రతిపాదనల్లాంటివి గిరిజామనోహరబాబు ముందుమాటల్లో అనేకం కనిపిస్తాయి. తమ షష్టిపూర్తి సందర్భంలో పలువురు సాహితీ మూర్తులు వెలువరించిన సంచికలలో తమకు నచ్చిన ఒకరిద్దరి రచయితల రెండు మూడు పీఠికలను వేసుకున్నారు. అదొక ధోరణిగా రావాలి. నాటి నుండి నేటి వరకు వచ్చిన సుప్రసిద్ధ పీఠికలను ఏర్చికూర్చి సంకలనంగా తేవాలి. సాహితీ సంస్థలు, సాహిత్య అకాడమీలు, విశ్వవిద్యాలయాలు, ప్రచురణ సంస్థలు ఇందుకు పూనుకోవాలి. దానివల్ల సాహిత్య విమర్శకు మేలు జరుగుతుంది. మెచ్చుకోలు మాటల స్థానంలో మేలుకొలుపు మాటలు కొలువుదీరాలి. పీఠికలు సంకలనాలై పుష్పించాలి విమర్శావరణ వర్ధిల్లాలి.

బి.వి.ఎన్‌. స్వామి

92478 17732


Updated Date - 2022-02-14T07:03:09+05:30 IST