Confused: ‘మూడో ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలతో బీజేపీలో కలకలం

ABN , First Publish Date - 2022-08-11T18:21:33+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) స్థానంలో ఈనెల 15 తర్వాత నూతన నేత రాబోతున్నట్టు బీజేపీ

Confused: ‘మూడో ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలతో బీజేపీలో కలకలం

 - సీఎం మార్పు ఉండదు 

 - బొమ్మైకు అధిష్టానం  భరోసా

 - మాజీ ఎమ్మెల్యే సురేష్‌గౌడకు షోకాజ్‌ నోటీసు

 - కాంగ్రెస్‌ వరుస ట్వీట్లపై బీజేపీ ఆగ్రహం


బెంగళూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) స్థానంలో ఈనెల 15 తర్వాత నూతన నేత రాబోతున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్‌గౌడ(Former MLA Suresh Gowda) చేసిన వ్యాఖ్యలు, అనంతరం కాంగ్రెస్‌ వరుస ట్వీట్లు, బీజేపీ నేతల ఎదురుదాడులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తథ్యమంటూ సురేశ్‌గౌడ రగిల్చిన మంటలు కాంగ్రెస్‏కు అస్త్రంగా మారడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఈ వ్యాఖ్యలు చేసిన సురేశ్‌గౌడకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని నిర్ణయించింది. నోటీసుకు సరైన సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ హెచ్చరించినట్టు తెలుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా సురేశ్‌గౌడకు ఫోన్‌ చేసి క్లాస్‌ తీసుకున్ననట్టు సమాచారం. విధానసౌధలో బుధవారం మీడియా కంట కనిపించిన సురేశ్‌గౌడ ఈ తాజా పరిణామాలతో మౌనముద్ర దాల్చి తప్పించుకోవడం గమనార్హం. రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రి ఖాయమంటూ కాంగ్రెస్‌ వరుసగా రెండోరోజు కూడా ట్వీట్‌ చేసింది. యడియూరప్పను కన్నీరు పెట్టించి రెండేళ్లకే సాగనంపారని, ఇప్పుడు బొమ్మైను ఏడాది తర్వాత సాగనంపేందుక వేదిక సన్నద్ధమవుతోందని కాంగ్రెస్‌ ట్వీట్‌(Congress tweet) చేసింది. 12సార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం దొరలను కలసినా కేబినెట్‌ విస్తరణకు బొమ్మైకి అనుమతి దక్కలేదంటూ కాంగ్రెస్‌ తన ట్వీట్‌లో ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ వరుస ట్వీట్లపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, సీనియర్‌ మంత్రి అశోక్‌ కాంగ్రెస్‌ ట్వీట్లపై ఆక్రోశం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తూ వాటిని నిజాలుగా చూపాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దావణగెరె ఉత్సవం అనంతరం కాంగ్రెస్ లో కలహాలు తారస్థాయికి చేరాయని, వీటినుంచి ప్రజలదృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్‌ కావాలనే మూడో ముఖ్యమంత్రి అంటూ ప్రజల్లో గందరగోళం రేపుతోందని కటీల్‌ వ్యాఖ్యానించారు. 


బొమ్మైకు అధిష్టానం భరోసా 

ప్రస్తుతానికి కర్ణాటకలో నాయకత్వమార్పు ప్రతిపాదనలు ఏవీ తమ పరిశీలనలో లేవని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ట్వీట్లను కొట్టిపారేసింది. నాయకత్వ మార్పు కథనాలపై ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి బొమ్మై(Chief Minister Bommai)కు సూచించింది. వీటిని పట్టించుకోకుండా యథాప్రకారం పనిచేసుకోవాలని సూచించింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాంగ్రెస్‌ ట్వీట్లపై స్పందించినట్టు తెలుస్తోంది. నాయకత్వ మార్పునకు సంబంధించిన వదంతులు తొలుత బీజేపీవైపు నుంచే వచ్చాయని, ఇవి కాంగ్రె్‌సకు అస్త్రంగా మారాయని అభిప్రాయపడిన నడ్డా ఇందుకు ఎవరు కారకులో గుర్తించి వివరాలు అందచేయాలని రాష్ట్రనేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాక్‌సమరం సాగుతోంది. మరో మూడు రోజులు వేచి చూడాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivakumar) వ్యాఖ్యానించగా నాయకత్వ మార్పుకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని హుబ్బళ్లిలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కాంగ్రెస్‌ ట్వీట్లపై హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ పనీపాటాలేని కాంగ్రెస్‌ ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 



Updated Date - 2022-08-11T18:21:33+05:30 IST