కోవిడ్ థర్డ్ డోస్ త్వరలో..నిపుణుల అభిప్రాయం

ABN , First Publish Date - 2021-11-22T17:22:43+05:30 IST

పెద్ద సంఖ్యలో దేశ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం, ఇంకా తీసుకోని వాళ్ల కోసం మరిన్ని నూతన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో..

కోవిడ్ థర్డ్ డోస్ త్వరలో..నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ: పెద్ద సంఖ్యలో దేశ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం, ఇంకా తీసుకోని వాళ్ల కోసం మరిన్ని నూతన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో థర్ట్ డోస్ లేదా బూస్టర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం దేశవ్యాప్త విధానం తీసుకురావాలని వైద్యులు కోరుతున్నారు. దీనిపై ఐఎంఏ ఫంక్షనరీ డాక్టర్ రవి వాంఖేడ్కర్ మాట్లాడుతూ, డాక్టర్లే మొదట కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నారని, వారిలో ఎక్కువ మంది 28 రోజుల గ్యాప్‌లో రెండో డోసు తీసుకున్నారని అన్నారు. అయితే ఆ తర్వాత బెటర్ ఇమ్యూనిటీ కోసం మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్ పెంచడం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఆ విధంగా చూసినప్పుడు, మెరుగైన రక్షణ అవకాశం వైద్యులకు దక్కలేదనీ, ఆ కారణంగానే థర్డ్ డోస్‌కు తమను అనుమతించాలని వైద్యులు కోరుతున్నారని ఆయన చెప్పారు. థర్డ్ డోస్ కోసం ఒక విధానం తీసుకు వస్తే ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్లు సమర్ధవంతంగా ఇస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని అన్నారు. సరైన విధానమంటూ ఒకటి రూపొందిస్తే ప్రజలకు మరింత ఎక్కువ  ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.


కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో థర్డ్ డోస్ ప్రవేశపెట్టడానికి ఇదే మంచి తరుణమని ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ షిండే అభిప్రాయం వ్యక్తం చేశారు. ''2021లో ఇదే సమయంలో వైరస్ మ్యూటేట్ అయింది. ఫిబ్రవరి నాటికి డెల్డా హిట్‌తో సెకెండ్ వేవ్ మొదలైంది. ఆ దృష్ట్యా 2022 ఫిబ్రవరి వరకూ వేచిచూడకుండా థర్డ్ డోస్ పాలసీని ప్రారంభించి, అధికారికంగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు అనుమతించాలి'' అని అన్నారు. అమెరికాలో థర్డ్ డోస్ అధికారికంగా ఆమోదించిందని, పరిస్థితి అనివార్యతను బట్టి భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. థర్డ్ డోస్ ఐచ్ఛికంగా ఉండొచ్చని, ఆసక్తి కలిగిన వ్యక్తులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులను అనుమతించాలని ఆయన సూచించారు. నవంబర్ నెలాఖరు కల్లా దేశవ్యాప్త విధానం ప్రకటించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-11-22T17:22:43+05:30 IST