బీజేపీని 10 మార్కుల విద్యార్థితో పోల్చిన స్టాలిన్

ABN , First Publish Date - 2022-04-03T23:17:28+05:30 IST

తమిళనాడులో బీజేపీ తృతీయ ఫ్రంట్‌గా ఆవిర్భవించినట్టు ఆ పార్టీ చెప్పుకోవడాన్ని..

బీజేపీని 10 మార్కుల విద్యార్థితో పోల్చిన స్టాలిన్

చెన్నై: తమిళనాడులో బీజేపీ తృతీయ ఫ్రంట్‌గా ఆవిర్భవించినట్టు ఆ పార్టీ చెప్పుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విసుర్లు విసిరారు. బీజేపీని 10 మార్కులకే పరిమితమైన విద్యార్థితో పోల్చారు. 90 మార్కులు, 50 మార్కులు సాధించే విద్యార్థుల తర్వాత కేవలం 10 మార్కులతో సరిపుచ్చుకునే విద్యార్థి స్థాయికే బీజేపీ పరిమితమని అన్నారు. ''పరీక్షల్లో ఒక విద్యార్థికి 90 మార్కులు వచ్చాయి. మరో విద్యార్థికి 50 మార్కులు వచ్చాయి. ఇంకో విద్యార్థి కేవలం 10 మార్కులే తెచ్చుకున్నాడు. పది పాయింట్ల సోర్కింగ్‌తో మూడో స్థానంలో ఉన్నామని చెప్పుకునే వారిని అభినందిస్తామా?'' అని స్టాలిన్ ప్రశ్నించారు.


ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని చెప్పుకోవడం కూడా తప్పని స్టాలిన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సంఖ్యా బలం తగ్గిందని, ఉప ముఖ్యమంత్రి సహా ఆ పార్టీకి చెందిన 10 మంది మంత్రులు ఓటమి చవిచూశారని, గోవాలోని కీలక నేతలు, ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి కూడా ఓటమి పాలయ్యారని, పంజాబ్‌లో రెండు సీట్లకే ఆ పార్టీ పరిమితమైందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బీజేపీకి ఇది పూర్తిగా నెగిటివ్ ఫలితాలేనని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం విశ్లేషించారు.


Updated Date - 2022-04-03T23:17:28+05:30 IST