ఈ పరిస్థితిని ఊహించలేదు

ABN , First Publish Date - 2021-05-15T09:23:33+05:30 IST

గత ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌లో కాలికి అయిన గాయం.. దాంతో విపరీతమైన నొప్పి..

ఈ పరిస్థితిని  ఊహించలేదు

ఆసుపత్రిలో బెడ్లు దొరకకపోవడంపై విహారి ఆవేదన

 వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా కొవిడ్‌ రోగులకు చేయూత


న్యూడిల్లీ: గత ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌లో కాలికి అయిన గాయం.. దాంతో విపరీతమైన నొప్పి.. దానిని పంటిబిగువన అదిమిపెట్టి వీరోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసినప్పుడు కూడా కలగని సంతృప్తి, కొవిడ్‌ రోగులకు సాయపడినప్పుడు లభించిందని టీమిండియా బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి చెప్పాడు. దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విధ్వంసం సృష్టిస్తున్న వేళ కొవిడ్‌ బాధితులకు ఆసుపత్రిలో పడకలు, రెమ్‌డె్‌సవిర్‌ ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ దొరకడం గగనమవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు ఆర్థికంగా, మందులు, ఇతర రూపాల్లో రోగులకు సాయమందిస్తున్నారు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి కూడా కరోనా రోగులకు చేయూతనిస్తున్నాడు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఉన్న తన అభిమానులు, స్నేహితులు 100 మందితో కలిసి ఓ గ్రూపు ఏర్పాటు చేశాడు.


ఆ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా కరోనా రోగులను ఆదుకుంటున్నాడు. వారికి ప్లాస్మా, ఆసుపత్రిలో బెడ్‌, ఆక్సిజన్‌, ఆహారం సమకూరుస్తున్నాడు. ‘ఇది నేను పేరుకోసం చేయడంలేదు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు నాకు చేతనైనవిధంగా తోడ్పడుతున్నా’ అని 27 ఏళ్ల విహారి అన్నాడు. వార్విక్‌షైర్‌కు ఆడేందుకు ఏప్రిల్‌లో అతడు ఇంగ్లండ్‌ వెళ్లాడు. వచ్చేనెల 3న లండన్‌ చేరుకొనే భారత జట్టుతో అతడు అక్కడ కలుస్తాడు. ‘దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉంది. ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్‌ దొరకడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు. దాంతో నా ఫ్యాన్స్‌, స్నేహితులతో వలంటీర్‌ గ్రూపు ఏర్పాటు చేసి కరోనా రోగులకు సాయపడుతున్నా’ అని వెల్లడించాడు. తన భార్య, సోదరి, ఆంధ్ర క్రికెట్‌ జట్టులోని కొందరు సహచరులు ఈ గ్రూపులో ఉండి తోడ్పాటు అందిస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌ గురించి విహారి మాట్లాడుతూ.. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా తాను సిద్ధమేనన్నాడు. 

Updated Date - 2021-05-15T09:23:33+05:30 IST