కమిన్స్‌ మెరుపు దాడి

ABN , First Publish Date - 2022-04-07T09:20:48+05:30 IST

ప్యాట్‌ కమిన్స్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌తో.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా

కమిన్స్‌ మెరుపు దాడి

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ

వెంకటేష్‌ అర్ధ శతకం

5 వికెట్లతో నెగ్గిన కోల్‌కతా

సూర్య పోరాటం వృథా


కమిన్స్‌ పెను విధ్వంసంతో.. ఐపీఎల్‌లో కోల్‌కతా గ్రాండ్‌గా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఓ మాదిరి లక్ష్య ఛేదనలో అయ్యర్‌ సేన ఆరంభంలో తడబడినా.. కమిన్స్‌ సునామీ బ్యాటింగ్‌తో అలవోకగా గెలిపించాడు. అయితే, బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన మాజీ చాంపియన్‌ ముంబై.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటములతో ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. 


పుణె: ప్యాట్‌ కమిన్స్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌తో.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో చిత్తయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 161/4 స్కోరు చేసింది. సూర్యకుమార్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్‌ వర్మ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్‌), పొలార్డ్‌ (5 బంతుల్లో 22 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. కమిన్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి గెలిచింది. వెంకటేష్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మురుగన్‌ అశ్విన్‌, మిల్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కమిన్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 


ఆరంభంలో తడబాటు..

ఛేదన ఆరంభంలో కోల్‌కతా తడబడినా.. కమిన్స్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో సునాయాసంగా విజయాన్ని అందుకొంది. ఓపెనర్‌ రహానె (7) మరోసారి నిరాశ పరచగా.. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆరో ఓవర్‌లో డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ వెంకటేష్‌  రెండు బౌండ్రీలతో జోరు చూపినా.. శ్రేయాస్‌ను అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. అయితే, వెంకటేష్‌, బిల్లింగ్స్‌ (17) ధాటిగా ఆడుతూ స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశారు. బిల్లింగ్స్‌ను మురుగన్‌ అవుట్‌ చేయడంతో.. 10 ఓవర్లు ముగిసే సరికి నైట్‌రైడర్స్‌ 67/3తో నిలిచింది. రాణా (8), రస్సెల్‌ (11) స్వల్ప తేడాతో అవుటయ్యారు. కానీ, 40 బంతుల్లో 61 పరుగులు కావాల్సిన తరుణంలో కమిన్స్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడిన కమిన్స్‌.. ప్రత్యర్థికి మరో అవకాశం లేకుండా చేశాడు. అయ్యర్‌.. సింగిల్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసిన 15వ ఓవర్‌లో 6,4తో బ్యాట్‌ ఝుళిపించిన కమిన్స్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో విధ్వంసం సృష్టించాడు. సామ్స్‌ బౌలింగ్‌లో 6,4,6,6,4,6తో మొత్తం 35 పరుగులు పిండుకున్న కమిన్స్‌.. ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధ శతకంతో మరో 24 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. అయ్యర్‌, కమిన్స్‌ ఆరో వికెట్‌కు 18 బంతుల్లో 61 పరుగులు జోడించడం విశేషం. 


రోహిత్‌ విఫలం..

కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై విలవిల్లాడింది. అయితే, సూర్యకుమార్‌, తిలక్‌ నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 83 పరుగులు జోడించడంతో.. ప్రత్యర్థి ముందు పోరాడగలిగే స్కోరును ఉంచింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (3) స్వల్ప స్కోరుకు పెవిలియన్‌ చేరాడు. అయితే, ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిన ‘బేబీ ఏబీ’ డెవాల్డ్‌ బ్రేవిస్‌ (29).. చక్రవర్తి బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. షాట్లు ఆడేందుకు ఇబ్బందులు పడుతున్న ఇషాన్‌ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చడంతో.. 12 ఓవర్లకు ముంబై 58/3 స్కోరు మాత్రమే చేసింది. ఈ దశలో జట్టు బాధ్యతల్ని భుజాన వేసుకున్న సూర్యకుమార్‌.. వర్మతో కలసి స్కోరు బోర్డును నడిపించాడు. ఉమేష్‌ బౌలింగ్‌ 4, 6 బాదిన సూర్య.. సల్మాన్‌ వేసిన ఓవర్‌లో మరో ఫోర్‌ కొట్టాడు. మరోవైపు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న తిలక్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో 6,4తో మొత్తం 13 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత చక్రవర్తి బౌలింగ్‌లో మరో 6,4తో జట్టు స్కోరు సెంచరీ దాటించాడు. రస్సెల్‌ బౌలింగ్‌లో బౌండ్రీతో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య.. ఆఖరి ఓవర్‌లో కమిన్స్‌ అవుట్‌ చేశాడు. అయితే, పొలార్డ్‌ మూడు సిక్స్‌లతో స్కోరును 160 పరుగులు దాటించాడు. 


ముంబై: రోహిత్‌ శర్మ (సి) బిల్లింగ్స్‌ (బి) ఉమేష్‌ 3, ఇషాన్‌ కిషన్‌ (సి) శ్రేయాస్‌ (బి) కమిన్స్‌ 14, బ్రేవిస్‌ (స్టంప్డ్‌) బిల్లింగ్స్‌ (బి) చక్రవర్తి 29, సూర్యకుమార్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) కమిన్స్‌ 52, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 38, పొలార్డ్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 161/4; వికెట్ల పతనం: 1-6, 2-45, 3-55, 4-138; బౌలింగ్‌: ఉమేష్‌ యాదవ్‌ 4-0-25-1, రసిక్‌ సలామ్‌ 3-0-18-0, ప్యాట్‌ కమిన్స్‌ 4-0-49-2, సునీల్‌ నరైన్‌ 4-0-26-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-32-1, రస్సెల్‌ 1-0-9-0. 


కోల్‌కతా: రహానె (సి) సామ్స్‌ (బి) మిల్స్‌ 7, వెంకటేష్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 50, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) తిలక్‌ (బి) సామ్స్‌ 10, సామ్‌ బిల్లింగ్స్‌  (సి) థంపి (బి) మురుగన్‌ 17, నితీష్‌ రాణా (సి) సామ్స్‌ (బి) మురుగన్‌ 8, రస్సెల్‌ (సి) బ్రేవిస్‌ (బి) మిల్స్‌ 11, కమిన్స్‌ (నాటౌట్‌) 56; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 16 ఓవర్లలో 162/5; వికెట్ల పతనం: 1-16, 2-35, 3-67, 4-83, 5-101; బౌలింగ్‌: బాసిల్‌ థంపి 3-0-15-0, డేనియల్‌ సామ్స్‌ 3-0-50-1, బుమ్రా 3-0-26-0, మిల్స్‌ 3-0-38-2, తిలక్‌ వర్మ 1-0-6-0, మురుగన్‌ అశ్విన్‌ 3-0-25-2.

Updated Date - 2022-04-07T09:20:48+05:30 IST