Robbery: బ్యాంకులో దొంగలు పడ్డారు.. బ్యాంకు సిబ్బందిని టాయ్‌లెట్‌‌లో ఉంచి లాక్ చేసి..

ABN , First Publish Date - 2022-08-14T03:23:53+05:30 IST

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. చెన్నైలోని అరుంబకం ప్రాంతంలోని FedBank లోకి శనివారం సాయంత్రం ముగ్గురు మాస్క్ ధరించిన..

Robbery: బ్యాంకులో దొంగలు పడ్డారు.. బ్యాంకు సిబ్బందిని టాయ్‌లెట్‌‌లో ఉంచి లాక్ చేసి..

చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. చెన్నైలోని అరుంబకం ప్రాంతంలోని FedBank లోకి శనివారం సాయంత్రం ముగ్గురు మాస్క్ ధరించిన వ్యక్తులు జొరబడ్డారు. బ్యాంకు సిబ్బందిని టాయ్‌లెట్‌లో ఉంచి లాక్ చేశారు. ఆ తర్వాత తమ చేతివాటం చూపించారు. గోల్డ్ లోన్ బ్యాంకు కావడంతో 32 కిలోల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది. క్యారీ బ్యాగ్స్‌లో బంగారాన్ని సర్దుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ ముగ్గురు దొంగల్లో ఒకరు బ్యాంకులో పనిచేసే వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకెళ్లిన బంగారం విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉండొచ్చని బ్యాంకు సిబ్బంది తెలిపారు.



ఈ ఘటనపై అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టీఎస్ అన్బు స్పందిస్తూ.. నాలుగు ప్రత్యేక బృందాలతో ఈ కేసును విచారిస్తున్నామని.. ఇది బ్యాంకు ఉద్యోగి పనేనని కచ్చితంగా చెప్పగలమని తెలిపారు. ఇప్పటికే ఆ ఉద్యోగి ఎవరో గుర్తించామని, రీజనల్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా అతను పనిచేస్తున్నాడని.. బాధ్యులని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ దోపిడి గురించి ఆ బ్యాంకు సెక్యూరిటీ గార్డు‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఆరా తీయగా.. వాళ్లు కూల్ డ్రింక్ తాగమని ఇచ్చారని, ఆ కూల్‌డ్రింక్ తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని సెక్యురిటీ గార్డ్ చెప్పాడు.



ఇదిలా ఉండగా.. బ్యాంకు సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని.. ఈ బ్రాంచ్‌ వాస్తవానికి ఇవాళ క్లోజ్ చేయడం జరిగిందని.. కొన్ని అకౌంట్స్ సంబంధిత వర్క్ పెండింగ్‌లో ఉండటంతో కొద్ది మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉన్నారని పోలీసుల విచారణలో తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు చెక్ చేశారు. దోచుకున్న తర్వాత దొంగలు బైక్స్‌పై పరారయినట్లు తేలింది. Fedbank Financial Services Ltd సంస్థకు దేశవ్యాప్తంగా 463 బ్రాంచులున్నాయి. గోల్డ్ లోన్స్, హోం లోన్స్, ప్రాపర్టీ లోన్స్, బిజినెస్ లోన్స్‌ ఈ బ్యాంకు ప్రధాన కార్యకలాపాలుగా చెప్పొచ్చు.

Updated Date - 2022-08-14T03:23:53+05:30 IST