సీమకు మరో దగా ఈ బడ్జెట్!

Published: Wed, 23 Mar 2022 00:31:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీమకు మరో దగా ఈ బడ్జెట్!

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసిన నేతల కాళ్లు బొబ్బలెక్కినట్లున్నాయి. అరచిన గొంతుకలు జీరబోయినట్టున్నాయి. పిడికిలి బిగించిన చేతులు బలహీనపడినట్టున్నాయి. అందువల్లనే బహుశా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వెలుగులోనికి వచ్చిన ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకున్నా అడిగేవారు లేరు. గతంలో లాగా ధర్నాలు లేవు. నిరసన సభలు లేవు. 


కనీసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదాకు హేతువైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు కూడా బడ్జెట్టులో కేటాయింపులు లేవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 2019లో తొలిసారి సీమ పర్యటన చేసిన సందర్భంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జల వనరుల శాఖాధికారులు 33,135 కోట్ల రూపాయల వ్యయంతో పలు ప్రతిపాదనలు పంపారు. ఈ పథకాలకూ ఈ బడ్జెట్టులో మోక్షం లభించలేదు. 2021 మే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో హంద్రీనీవా ప్రాజెక్టు విస్తరణకు ఆమోదం లభించింది. 6,182 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరణ పథకం ఆమోదించగా ఈ బడ్జెట్టులో కేవలం 148.13 కోట్లు కేటాయించారు. జరిగిన అన్యాయానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ రోజుకూ చంద్రబాబు నాయుడిని ఏ అంశాలపై సాధిస్తున్నారో– ఆ గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు, తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణం... వీటిని ఈ బడ్జెట్టులో ప్రస్తావించలేదు. తుదకు చిత్తూరు జిల్లాకు మిగిలిన గాలేరు నగరి రెండవ దశ ఊసే లేదు. ఆ మాట కొస్తే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో లేదు. నవ రత్నాల ద్వారా లభించే ఉచితాలతో సంతృప్తి పడి ఊరుకోవాలేమో?


రాయలసీమ ప్రజలు ఎదుర్కొంటున్న దగా ఈ నాటిది కాదు. ఈ మాయా నాటకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తొలి అంకానికి 1953లోనే తెర లేచింది. 1937లో శ్రీబాగ్ ఒడంబడిక చేసుకొనే సమయంలో ఆనాటి పెద్దలు ముందు చూపుతో రాజధానిని నాల్గవ అంశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను రెండవ అంశంగా ప్రాధాన్యతతో పొందుపర్చారు. కాని 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే సమయంలో వివిధ కారణాలతో రాజధాని ప్రథమ అంశమైంది. కర్నూలును రాజధాని చేశారు. సెంటిమెంటుతో సీమ ప్రజలను ఆకట్టుకున్నారు. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలంను జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా చేపట్టడంకన్నా సిద్దేశ్వరం వద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మించితే కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు ఉద్దేశించిన మొత్తం ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చని ఆనాడు వామపక్షాలు డిమాండు చేశాయి. కాని శ్రీబాగ్ ఒడంబడిక పేరుతో 1953లో రాజధాని సెంటిమెంటు రగిల్చిన నీలం సంజీవరెడ్డి సీమ సామాజిక ఆర్థిక గతిని మార్చే సాగునీటి వసతిని విస్మరించి శ్రీశైలాన్ని కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా మాత్రమే నిర్మించారు. కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు పోయినందువల్ల సీమకు జరిగిన నష్టం ఎంత వాస్తవమో సిద్దేశ్వరం ప్రాజెక్టు కాకుండా శ్రీశైలాన్ని కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మించడం వల్ల కూడా సీమకు అంతే నష్టం జరిగింది. ఇది ఈ తరం వారికి ఎంతమందికి తెలుసు?


1982లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శ్రీరామకృష్ణయ్య మిగులు జలాలతో రాయలసీమకు నాలుగు సాగునీటి ప్రాజెక్టులను ప్రతిపాదించిన సమయంలో– నికర జలాలతోనే పథకాలను ప్రకటించాలని డాక్టర్ మైసూరారెడ్డి, డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. 1989 నుంచి అయిదేళ్లు అధికార హవా సాగించిన డాక్టర్ మైసూరారెడ్డి గాని, 2004లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గాని రాయలసీమకు నికర జలాలు ఎందుకు కేటాయించలేకపోయారు? ఈ రోజుకూ నికర జలాలనే అంశం ఒక నినాదంగా మిగిలిపోయి ఒక్కో సమయంలో అవసరమైనపుడు కొందరికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు మిగులు జలాలు కోరడం లేదని రాసిన లేఖ సీమకు నేడు ఉరి తాడుగా ఉంది.


రాయలసీమ దాహార్తి తీర్చేందుకు ఎన్టీఆర్ ప్రతిపాదించిన మిగులు జలాల ఆధారంగా గల ప్రాజెక్టులు సుదీర్ఘ కాలం దస్త్రాలకే పరిమితమై వుంటే, డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దుమ్ము దులిపి చొరవతో నిర్మాణాలను మొదలుపెట్టడమొక్కటే గుర్తించదగ్గ మేలు.


2014లో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు నికర జలాలు 400 టియంసిల డిమాండును బలంగా తెర మీదకు వచ్చింది. చంద్రబాబు నాయుడు పట్టిసీమ పట్ల చూపించిన శ్రద్ధ అంతర్ రాష్ట్ర వివాదమున్న గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, తుదకు హంద్రీనీవా గాలేరు నగరి వెలుగొండ పథకాల పట్ల కూడా చూపలేదు. పట్టిసీమ నీళ్లు సీమ పొలాలకు పారిస్తానని చెప్పడాన్ని సీమ ప్రజలు నమ్మలేదు. తర్వాత ఈ మూడేళ్ల కాలంలో కథ మొదటికొచ్చింది. అయిదేళ్ల కాలంలో 400 టీయంసీల నికర జలాలు కావాలని అరచిన గొంతులు మూగపోయాయి. తుదకు పెండింగు ప్రాజెక్టుల గురించి టీడీపీ హయాంలో సాగిన సమైక్య పోరాటం కూడా కనుమరుగైంది. 


టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సమావేశాలు, పాదయాత్రలు, నిరసన సభలు నిర్వహించిన సీమ పరిరక్షణ ఉద్యమకారులు నేడు ఏమయ్యారయ్యారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! కారుచీకటిలో కాంతిరేఖ లాగా కర్నూలు అనంతపురం జిల్లాల్లో కొందరు యువకులు సీమకు జరుగుతున్న అన్యాయం గురించి గళమెత్తితే వారిపై టీడీపీ ముద్ర వేసి సీమ ప్రాజెక్టుల డిమాండును పక్కదారి పట్టించడమే నేటి విషాదం. ఫలితంగా ఉద్యమకారుల్లో నేడు అంతర్యుద్ధమే కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో ఏ ప్రాజెక్టులోనూ తట్టెడు మట్టి పడలేదని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందని చెబుతున్న వీరు చిరు దివ్వెలా మిగిలారు.


తుదకు కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం వైజాగుకు తరలిపోవడం, అదేవిధంగా వేసవిలో సీమ తాగునీటికి కూడా మిగల్చకుండా శ్రీశైలం డెడ్ స్టోరేజీకి దిగజార్చడం, పెండింగు ప్రాజెక్టుల అతీగతీ గురించి ప్రభుత్వ వైఫల్యాలను సమైక్యంగా ప్రశ్నించలేని దుస్థితి నేడు సీమలో నెలకొంది. గత సుదీర్ఘ చరిత్ర పుటలు తిరగేస్తే సీమలో సాగునీటి కోసం జరిగే ఆందోళన కొందరు అధికారం చేపట్టినపుడే ఊపు అందుకుంటుందా? అనే అనుమానం కలగక మానదు. 

వి. శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.