ఈ తివాచీకి .... మహిళలే ఆలంబన

ABN , First Publish Date - 2021-10-27T05:30:00+05:30 IST

ఒకప్పుడు ఏలూరు ప్రాంతానికి అపారమైన కీర్తి తెచ్చిన ఘనత తివాచీలది. భారత్‌-పర్షియా కళానైపుణ్యాల మేలికలయికగా....

ఈ తివాచీకి .... మహిళలే ఆలంబన

ఒకప్పుడు ఏలూరు ప్రాంతానికి 

అపారమైన కీర్తి తెచ్చిన ఘనత తివాచీలది.

భారత్‌-పర్షియా కళానైపుణ్యాల మేలికలయికగా..

వందలాది మహిళా కళాకారుల నైపుణ్యంతో 

అలరారిన ఈ పరిశ్రమ ఇప్పుడు క్రమంగా 

కనుమరుగైపోతోంది. ఇప్పటికీ మహిళలు 

ఈ కళకు ఆలంబనగా నిలుస్తున్నారు.


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పేరు వినగానే రంగురంగుల తివాచీలు కళ్ళ ముందు మెదులుతాయి. దేశీయంగానే కాకుండా... అంతర్జాతీయంగానూ ఇవి ఎంతో ప్రఖ్యాతి పొందాయి. వీటి తయారీలో ప్రధాన పాత్ర మహిళలదే కావడం విశేషం. నాలుగు దశాబ్దాల క్రితం పర్షియా నుంచి తివాచీలు నేయడంలో నైపుణ్యం ఉన్న కళాకారులు మచిలీపట్నానికి వలస వచ్చారు. వారు క్రమంగా ఏలూరు సమీపంలోని తంగెళ్ళమూడి వచ్చి స్థిరపడ్డారు. ఆ రోజుల్లో అక్కడ తంగేడు వనం ఉండేది. దాని నుంచి రంగులను సహజసిద్ధంగా తీసి, వాటిని ఉన్నికి అద్ది, తివాచీలు చేసేవారు. వారి నుంచి స్థానికంగా ఉండే ముస్లిం కుటుంబాలవారు ఈ కళను నేర్చుకున్నారు. ఇంటి దగ్గరే ఉండి చేసుకొనే వృత్తి కావడంతో... తివాచీల తయారీలో మహిళలు పెద్ద సంఖ్యలో భాగం అయ్యారు. తమ ఆదాయాలతో కుటుంబాలకు ఆసరాగా నిలిచారు.  ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ, కొత్త కొత్త డిజైన్లతో తివాచీలను రూపొందించేవారు. వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండేది. 

మహిళలకు వెసులుబాటుగా...

తివాచీల తయారీ ఇంటి పట్టున ఉండి చేసుకునే పని కావడంతో కుటుంబ సభ్యులందరూ వీటి రూప కల్పనలో భాగస్వాములవుతారు. తివాచీ తయారు చేయాలంటే మగ్గం కచ్చితంగా అవసరం. మగ్గానికి ఇద్దరు మనుషులు విధిగా ఉండాలి. గతంలో భార్యాభర్తలు కలిసి ఈ పని చేసుకునేవారు. ఇంటి పని చేసుకుంటూ మహిళలు దీనిలో భాగమయ్యేవారు. మగవారు బయటికి వెళ్లినప్పుడు ఇంట్లో ఉండే మహిళలే ఈ పని చేసేవారు. ఆ విధంగా తివాచీల తయారీ దాదాపుగా మహిళల చేతికి వచ్చింది. ఇక, ఇంట్లో ఉండే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూ ఉండడంతో... ప్రత్యేకంగా నేర్చుకోకుండానే ఒక అవగాహన వచ్చేస్తుంది.

సాధారణంగా ఈ పని నేర్చుకోవాలంటే కనీసం ఆరు నెలలు సమయం పడుతుంది. కానీ మగ్గం ఉన్న ఇంటి పిల్లలకు, మహిళలకు ప్రత్యేక శిక్షణ అవసరం ఉండదు. దీంతో తివాచీల పరిశ్రమ వారికి మంచి అవకాశంగా నిలుస్తోంది. ఇంటి పనులు పూర్తి చేసుకున్నాక... ఈ పనిలో దిగవచ్చు. స్వతంత్రంగా చేసుకునే అవకాశం ఉండడం కూడా ఈ వృత్తి పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవడానికి కారణమయ్యాయి. అప్పట్లో ఏలూరు నగరంలోనే దాదాపు 500 తివాచీ మగ్గాలు ఉండేవి. వీటి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కుటుంబాలు ఆధారపడేవి. కానీ అదంతా గతం. వందల్లో ఉండే మగ్గాలు పదుల సంఖ్యలోకి... వేలల్లో ఉండే కళాకారులు వందల సంఖ్యలోకి తగ్గిపోయారు. ఈ పరిస్థితికి కారణాలు అనేకం అని చెబుతున్నారు ఈ వృత్తిపై ఇప్పటికీ ఆధారపడి జీవిస్తున్న మహిళలు.

కనీస ఆదాయం, ప్రోత్సాహం కరువై...

ఏలూరు తివాచీలకు స్థానికంగా దొరికే ఉన్నిని ఉపయోగించరు. న్యూజిలాండ్‌ నుంచి లేదా మన దేశంలోని రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఉన్ని మాత్రమే వినియోగిస్తారు. ఇటీవలి కాలంలో ఆ ఉన్ని ధర, రవాణా ఖర్చులతో పాటు తివాచీలకు వాడే రంగుల ధర కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ఉత్పాదక వ్యయం అనేక రెట్లు ఎక్కువయింది. ప్రస్తుతం ఒక మీటరు తివాచీ తయారీకి అయిదు నుంచి ఆరువేల రూపాయలు ఖర్చవుతోందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. వచ్చేదానిలో మూడొంతులు ముడిసరుక్కే సరిపోతుంది. మిగిలిన ఒక వంతు మాత్రమే ఈ కళాకారులకు దక్కుతుంది. ఒక తివాచీ తయారీకి సైజును బట్టి వారం నుంచి పది రోజులు పడుతుంది. తయారు చేసినవారికి దక్కేది మూడు నుంచి నాలుగు వేల రూపాయల కూలీ. ఒక తివాచీ తయారీకి కనీసం ఇద్దరు, ఒక్కోసారి ముగ్గురు మహిళలు అవసరమవుతారు. ఆ వచ్చిన మొత్తాన్నే వీరందరూ పంచుకోవాలి. అంటే రోజుకు దొరికేది రూ.200 కన్నా తక్కువే. అందుకే ఈ తరం వారు తివాచీల తయారీ పట్ల ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు కరోనా కూడా ఈ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. ఎగుమతులు లేకపోవడంతో ఆర్డర్లు ఆగిపోయాయి. కళాకారులు ఇళ్ళకే పరిమితం కావలసి వచ్చింది. కనీస స్థాయిలోనైనా ఆదాయం లేకపోవడంతో.. ఆసుపత్రుల్లో ఆయాలుగా, దుకాణాల్లో సేల్స్‌ గర్ల్స్‌గా చాలామంది చేరిపోయారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ సంప్రదాయ కళారూపానికి ప్రభుత్వం తరఫు నుంచి తగిన ప్రోత్సాహం లేదనీ, కొత్తవారికి శిక్షణ ఇవ్వడానికి చేపట్టిన కార్యక్రమాలు కూడా 1990ల తరువాత ఆగిపోయాయనీ ఈ కళాకారులు చెబుతున్నారు. ముడి సరుకుల భారాన్ని మోయలేకపోతున్న ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలూ లేవని అంటున్నారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని బదోహి, మిర్జాపూర్‌, ఆగ్రా, పానిపట్‌, రాజస్థాన్‌లోని జైపూర్‌లు కేంద్రాలుగా సాగుతున్న తివాచీ పరిశ్రమ ఏటా ఏడు నుంచి ఎనిమిది కోట్ల టర్నోవర్‌ సాధిస్తోంది. తివాచీలకు ఉన్న డిమాండ్‌కు ఇది నిదర్శనం. మాకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే... భారత్‌-పర్షియా కళా నైపుణ్యాల మేలికలయిక అయిన ఏలూరు తివాచీలకు పూర్వ వైభవాన్ని సాధించి పెడతాం. ఆ ప్రాంతాలకన్నా మెరుగైన స్థితికి ఈ పరిశ్రమను తీసుకువెళ్తాం’’ అంటున్నారు స్థానిక తివాచీ తయారీదార్లు. 

 ఆకురాతి సతీశ్‌,  ఏలూరు, ఫొటోలు: ఐ.వీ. వరప్రసాద్‌


రోజుకు 350 రూపాయలన్నా రావాలి

గతంలో రెండు వందలు కూలీ వచ్చినా కొంచెం ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడేమో ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ ధరలకు అనుగుణంగా కూలీ ఉండాలి. ఇప్పుడు ఒక తివాచీ నేస్తే 3 వేల రూపాయలు వస్తాయి. ఇది ఇద్దరం పంచుకోవాలి. ఒక తివాచీ నేయాలంటే కనీసం వారం నుంచి పది రోజులు పడుతుంది. అంటే పది రోజులకు ఒక మనిషికి రూ.1,500 వస్తుందన్న మాట!  గతంలో అడపాదడపా పని చేసినా రోజుకు రూ.200 ఆదాయం ఉండేది. ఇప్పుడు రోజంతా పని చేసినా ఆ ఆదాయం రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం రూ.350 అయినా కూలీ వస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది. కానీ వస్తున్న కొద్ది మొత్తమైనా కుటుంబానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఈ పనిలోనే కొనసాగుతున్నా.

వాసా గాయత్రి, ఏలూరు


చాలా మంది ఈ పని మానేశారు!

ఈ రోజుల్లో ఇంట్లో ఒకరు పని చేస్తే చాలని పరిస్థితి. అందువల్ల మేం కూడా ఈ పని చేస్తున్నాం.   ఇంటి పట్టున ఉండి పని చేసుకుంటుంటాం. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఈ పని చేసేవారు. మేం మా అమ్మవాళ్లను చూసి ఈ పని నేర్చుకున్నాం. ప్రత్యేకించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. మేం ఇంటి పనలన్నీ చేసుకుని, పిల్లల్ని స్కూలుకు పంపి కాస్త తీరిక చేసుకుని మగ్గాల్లోకి వెళతాం. సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ పని చేస్తుంటాం. గతంలో రోజుకు రూ.300 దాకా వచ్చేవి. ఇప్పుడు అంతగా రావడం లేదు. దీంతో చాలా మంది ఈ పని మానేశారు. గతంలో ఏ మూల చూసినా ఈ మగ్గాలే ఉండేవి. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.     

                                                                                                 - షేక్‌ ఫాతిమా, తంగెళ్లమూడి.  



Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST