ఈ పతనం.. స్వయంకృతం!

Published: Sun, 26 Jun 2022 00:32:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ పతనం.. స్వయంకృతం!

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనేది నానుడి. మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ నానుడి గుర్తుకొస్తుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు చేయడం వెనుక ప్రచ్ఛన్న శక్తి ఉంటే ఉండవచ్చు కానీ ప్రేరణ మాత్రం శివసేన అధినేత ఏకపక్ష పోకడలే. అసమ్మతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం అనేకం చూశాం. ఆ మాటకొస్తే కేంద్రంలో 1978లో ఏర్పాటైన జనతా ప్రభుత్వం కూడా అసమ్మతి కారణంగానే కూలిపోయింది. మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పతనం కావడానికి చౌదరి చరణ్‌సింగ్‌లో పేరుకుపోయిన అధికార కాంక్ష కారణం కావచ్చును గానీ.. ప్రోత్సహించింది మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యం సాగిన రోజుల్లో ప్రతిపక్షానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వాలను బతికిబట్టకట్టనిచ్చేవారు కాదు. ప్రత్యర్థులను కూల్చడానికి అసమ్మతి నేతలు దొరకని పక్షంలో ఆర్టికల్‌ 356 ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించేవారు. ఈ పోకడలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అప్పట్లో పెద్ద ఉద్యమాలే చేశాయి. ఫలితంగా ఆర్టికల్‌ 356 ఉపయోగించడం ఆగిపోయింది. ప్రతిపక్షాల విషయంలో ఒకప్పుడు కాంగ్రెస్‌ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెత్తనం చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా అనుసరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు పతనమయ్యాయి. సొంత బలం లేకపోయినా ప్రతిపక్షంలోని అనైక్యతను ఆసరాగా చేసుకుని అనేక రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర సంక్షోభం ప్రత్యేకమైనది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి శివసేన పోటీ చేసింది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠం విషయమై ఉభయ పక్షాల మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదొకరకంగా అనైతికమే. న్యాయంగా అయితే శివసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉండాల్సింది. ఈ నేపథ్యంలో అవకాశం కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే రూపంలో ఆ అవకాశం బీజేపీ పెద్దలకు లభించింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు షిండేతో చేతులు కలిపారు. హిందుత్వమే ఆలంబనగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఎదిగిన శివసేన, సెక్యులర్‌ పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌తో జత కట్టడాన్ని పలువురు శివసేన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారన్న వార్తలు అప్పుడే వచ్చాయి. అయితే అధినాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే తీసుకున్న నిర్ణయాన్ని వారు అప్పట్లో వ్యతిరేకించలేదు.


ఇప్పుడు ఇంతకాలానికి పార్టీలో తిరుగుబాటు రావడానికి ఉద్ధవ్‌ ఠాక్రే పోకడలే ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ ఎమ్మెల్యేలను కలుసుకోవడానికి ఇష్టపడరని, ఆయన పోకడలు ఏకపక్షంగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో శాసనసభ్యుల్లో అసంతృప్తి రాజుకుంది. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ నాయకత్వం పావులు కదిపింది. ఏక్‌నాథ్‌ షిండేకు అభయ హస్తం ఇచ్చింది. ఫలితమే ప్రస్తుత సంక్షోభం. ఈ పరిణామానికి బీజేపీని నిందించే బదులు ఉద్ధవ్‌ ఠాక్రే ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. శత్రువుకు అవకాశం ఇచ్చింది ఆయనే కనుక ఇది స్వయంకృతమే అవుతుంది.


ఎన్టీఆర్‌కే తప్పలేదు!

ప్రాంతీయ పార్టీల అధినేతల పోకడలపై అసంతృప్త స్వరాలు వినిపించడం కొత్తకాదు. అయితే పలు సందర్భాల్లో అవి తిరుగుబాటు వరకు రాలేదు. బలమైన నాయకుడు లభించినప్పుడు తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ పార్టీలో నంబర్‌–2 అంటూ ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టారు. తెలుగునాట తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు ఏడాదిన్నరకే తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో నంబర్‌–2గా నాదెండ్ల భాస్కరరావు ఉండేవారు. అయితే పెత్తనమంతా ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉండే పర్వతనేని ఉపేంద్ర వద్ద ఉండేది. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షల కోసం ఎన్టీఆర్‌ విదేశాలకు వెళ్లినప్పుడు తన తరఫున నాదెండ్ల భాస్కరరావు గాకుండా చేగొండి హరిరామజోగయ్య ప్రధాన బాధ్యతలు చూస్తారని ప్రకటించారు. దీంతో నాదెండ్ల భాస్కరరావులో ఆగ్రహం తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తనను నమ్మడం లేదని గ్రహించిన భాస్కరరావు, కాంగ్రెస్‌తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకుని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి అభయం పొందారు. అప్పటికే ఎన్టీఆర్‌ పోకడల పట్ల పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఎన్టీఆర్‌ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు వాపోయారు. అటువంటి వారందరినీ చేరదీసి ప్రధాని ఇందిరాగాంధీ ఆశీస్సులతో ఎన్టీఆర్‌ తిరిగి వచ్చినరోజే తిరుగుబాటుకు నాదెండ్ల భాస్కరరావు రంగం సిద్ధం చేశారు. అయితే ఆయన అతి విశ్వాసంతో అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోలేకపోయారు. అదే సమయంలో ప్రజల్లో ఎన్టీఆర్‌పై మోజు తగ్గలేదు. దీంతో తమ ప్రియతమ నేత అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్యాయంగా అధికారం నుంచి తొలగించారని ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది.


పలు జిల్లాల్లో ఆందోళనలు అదుపు చేయలేని స్థాయికి చేరాయి. మరోవైపు బలపరీక్షకు గడువు సమీపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అవసరమైన సంఖ్యను సమకూర్చుకోలేకపోయారు. ఎన్టీఆర్‌ వెంట ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపులు నిర్వహించారు. నాదెండ్ల శిబిరంలో చేరిన ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడులు చేశారు. దీంతో మెజారిటీ శాసనసభ్యులు ఎన్టీఆర్‌తోనే ఉండిపోయారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం జాతీయ స్థాయికి విస్తరించడంతో ఇందిరాగాంధీ దిగిరాక తప్పలేదు. అప్పటి గవర్నర్‌ రామ్‌లాల్‌ను ఇంటికి పంపించి ఎన్టీఆర్‌కు తిరిగి అధికారం అప్పగించారు. ఫలితంగా నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుదారుడిగా, నెల రోజుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు. 1984లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన పోకడలలో పెద్దగా మార్పు రాలేదు. అయితే నాదెండ్ల భాస్కరరావు అనుభవం ఇంకా పచ్చిగానే ఉన్నందున ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరూ సాహసం చేయలేదు. అయితే నాటి సీనియర్‌ మంత్రులైన కె.జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు వంటి వారిలో అసంతృప్తి పేరుకుపోతూ వచ్చింది. అదే సమయంలో మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రులు పత్రికలవారికి లీకు చేస్తున్నారన్న కోపంతో మొత్తం 31 మంది మంత్రులను ఒక్క కలంపోటుతో ఎన్టీఆర్‌ తొలగించారు. ఈ విషయం అప్పట్లో పెను సంచలనమైంది. ఒక్క మంత్రి కూడా లేకుండా దాదాపు 15 రోజులపాటు ఎన్టీఆర్‌ ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమను అవమానకర రీతిలో మంత్రిమండలి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేని జానారెడ్డి, కృష్ణమూర్తి, వసంత ప్రభృతులు తెలుగుదేశం పార్టీని వీడి, సొంత పార్టీ పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు.


అయితే ఆ పార్టీ కొద్దిరోజులకే తెరమరుగైంది. మొత్తంమీద అధికారంలో వాటా దక్కకపోవడం వల్ల గానీ, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కకపోవడం వల్ల గానీ ఎన్టీఆర్‌ అంతటివాడే రెండుసార్లు సంక్షోభం ఎదుర్కొన్నారు. మూడోసారి మాత్రం ఆయన నిలదొక్కుకోలేకపోయారు. 1994లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు భార్య రూపంలో లక్ష్మీపార్వతి బెడదగా మారారు. లక్ష్మీపార్వతి పోకడలను సహించలేకపోయిన అల్లుళ్లు చంద్రబాబు, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్లు అశోకగజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటివారు సమస్యను ఎన్టీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అంతిమంగా నాటి పరిణామాలు ఎన్టీఆర్‌పై తిరుగుబాటుకు దారి తీశాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఎన్టీఆర్‌ కన్నుమూశారు. రాజకీయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతోపాటు సినీ రంగంలో రారాజుగా వెలగడం వల్ల ఎన్టీఆర్‌లో లౌక్యం కనిపించేది కాదు. ఈ కారణంగానే ఆయన రాజకీయ ప్రస్థానంలో సంక్షోభాలను చవిచూశారు. ఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియకపోవడానికి కారణం ఉంది కానీ ఉద్ధవ్‌ ఠాక్రేకు ఏమైంది? శివసేనను స్థాపించిన బాల్‌ ఠాక్రే వారసుడిగా పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన ఆయన, రాజకీయాలలోనే పుట్టి పెరిగారు. అయినా గత అనుభవాలు నేర్పిన పాఠాలను ఆయన చెవికి ఎక్కించుకోలేదు. శాసనసభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీని లేదా ఏక్‌నాథ్‌ షిండేను నిందించి ప్రయోజనం ఏం ఉంది? ‘మన బంగారం మంచిదైతే..’ అనే సామెత ఉండనే ఉంది కదా! అధికారంలోకి రావడానికి కారణం ఎవరైనప్పటికీ అధికారంలో వాటా కావాలని అందరూ కోరుకుంటారు. అది దక్కనప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా తిరుగుబాట్లు తప్పవు. అంతెందుకు బలీయమైన శక్తిగా కనిపిస్తున్న బీజేపీలో కూడా అసంతృప్తి లేకపోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకపక్ష పోకడలపై పలువురు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. అధికారం అంతా మోదీ, అమిత్‌ షా వద్ద కేంద్రీకృతమైందని లోలోపల మథనపడుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోదీని ఎదిరించే శక్తి వారిలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే 2014 నుంచి బీజేపీని విజయపథం వైపు ఒంటిచేత్తో నడిపిస్తున్న శక్తి మోదీనే కనుక. మోదీకి జనాదరణ తగ్గినట్టు రుజువైతే పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రజల్లో పలుచబడినప్పుడు ఇందిరాగాంధీ వంటి నాయకురాలే తిరుగుబాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ మాత్రం మినహాయింపు ఎలా అవుతారు? రాజుల కాలంలోనే కాదు ప్రజాస్వామ్యంలో కూడా తిరుగుబాట్లు సహజం!


కేసీఆర్‌–జగన్‌.. ఇద్దరూ ఇద్దరే!

ఇప్పుడు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల విషయానికొద్దాం. నియంతృత్వ పోకడల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఈ రెండు పార్టీలలో ప్రజాస్వామ్య వాసనలు మచ్చుకైనా కానరావు. మరో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంలో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడులో కూడా ఏకపక్ష ధోరణులు తన్నుకు వస్తాయి. అయితే స్వతహాగా భీరువు అయిన చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రుల వలే నియంతృత్వంగా ఉండలేదు. ఉండలేరు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయమే తీసుకుందాం. కారణం ఏమైనా ఆయన మంత్రులను, శాసనసభ్యులను.. చివరకు ప్రజలను కలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇష్టమైనప్పుడు, అవసరమైనప్పుడు మాత్రం పాతాళంలో ఉన్నవారిని కూడా దొరకపుచ్చుకుని గంటల తరబడి, రోజుల తరబడి మంతనాలు జరుపుతారు. తాను చెప్పాలనుకున్నదంతా అవతలివాళ్లు వినే వరకు వదిలిపెట్టరు. పార్టీపరమైన విషయాలలో గానీ, ప్రభుత్వపరమైన నిర్ణయాలలో గానీ అన్యులకు పాత్ర ఉండదు. కేసీఆర్‌ కుమారుడైన కేటీఆర్‌కు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పెరిగింది కానీ నిన్న మొన్నటివరకు ఆయన కూడా మిగతావారితో సమానంగానే ఉండేవారు. కేసీఆర్‌ నోటి నుంచి వెలువడే ఆదేశాలను మాత్రమే అధికారులు పాటిస్తారు. మంత్రులెవరూ తమ శాఖల విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్‌ అనుమతి లేకుండా తెలంగాణలో గాలి వీయదు.. ఆకు కదలదు. పార్టీ, ప్రభుత్వంపై కేసీఆర్‌ పట్టు ఆ స్థాయిలో ఉంటుంది. అయితే తన మేధస్సును మథించి తీసుకునే నిర్ణయాలను మాత్రం కేసీఆర్‌ తనకు ఇష్టమైనవారిని పిలిపించి కొలువుదీరి పంచుకుంటారు. మంత్రివర్గ సమావేశమైనా సరే ముఖ్యమంత్రిదే ఏకపాత్రాభినయం. ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాల పర్యవసానాలు తెలియకపోయినా అందరూ సమర్థించాల్సిందే. వ్యక్తిపూజ విషయంలో కేసీఆర్‌కు మరెవరూ సాటిరారు. ఉదాహరణకు కేసీఆర్‌ ప్రకటించిన భారత రాష్ట్ర సమితి పార్టీ విషయానికొద్దాం. ఈ నిర్ణయం వల్ల ఫలితం ఉండదని టీఆర్‌ఎస్‌లో పలువురు భావిస్తున్నారు.


అయితే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు కనుక పార్టీలో ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడతారు. భారత రాష్ట్ర సమితి నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ, అందులోని మర్మం ఏమిటనేది కేసీఆర్‌కు మాత్రమే తెలుసు. ఇతరులకు ఏ పాత్రా ఉండదు. అయినా అధినేత నిర్ణయాలకు దరువేయక తప్పదు. దళితబంధు పథకాన్నే తీసుకుందాం.. ఈ పథకం వల్ల నష్టం జరుగుతుందని పార్టీలో మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతుంటారు. కానీ తమ అభిప్రాయాలను కేసీఆర్‌ ఎదుట చెప్పే సాహసం ఎవరికీ ఉండదు. కేసీఆర్‌ వద్ద ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యం లభిస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రాధాన్యం లభించినవారు అప్పటికి సంబరపడుతుంటారు. ఆదరణకు నోచుకోని వారు లోలోపల కుమిలిపోతుంటారు. సీనియర్‌ మంత్రి హరీష్‌రావు పరిస్థితి ఇందుకు నిదర్శనం. నిన్నమొన్నటివరకు హరీష్‌రావును పక్కనబెట్టారు. సిద్దిపేట మినహా మిగిలిన ప్రాంతాల్లో పర్యటించకుండా ఆయనపై ఆంక్షలు విధించారు. అయినా కిమ్మనకుండా మంచి రోజుల కోసం ఆయన ఎదురుచూశారు. కారణం ఏమైనా కేసీఆర్‌ మనసు కరిగి ఇటీవలి కాలంలో హరీష్‌రావుకు మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. రాజుల కాలంలో అనుగ్రహం, ఆగ్రహం ఎలా ఉండేదో కేసీఆర్‌ పాలనలో కూడా అలాగే ఉంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రజాస్వామ్యవాదుల సంగతి అటుంచితే, ఆత్మ గౌరవం ఉండదని ఆ పార్టీ నాయకులే వాపోతుంటారు. అయినా కేసీఆర్‌ నాయకత్వానికి సవాళ్లు ఎదురుకాకపోవడానికి కారణం ఉంది. ఏక్‌నాథ్‌ షిండే వంటి వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో లేరు. అంతటి శక్తియుక్తులు ఉన్నవారు కేసీఆర్‌ కుటుంబంలో భాగమే కావడం గమనార్హం. అధినాయకుడి నిరాదరణకు గురైనప్పుడు హరీష్‌రావును తమ చేతుల్లోకి తీసుకోవడానికి బీజేపీ పెద్దలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా హరీష్‌రావు తొందరపడకుండా కేసీఆర్‌ పెట్టిన పరీక్షలో పాసయ్యారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌, హరీష్‌రావు మాత్రమే కనిపిస్తారు. ఎంపీ సంతోష్‌ ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యం సంతరించుకుంటున్నారు. అయితే ఆయన ప్రజాక్షేత్రం నుంచి రాలేదు. మైనస్‌ కేసీఆర్‌... ఆయన జీరోనే. ఇక టీఆర్‌ఎస్‌లోని మిగిలినవారెవరూ కేసీఆర్‌ను ఎదిరించలేని పరిస్థితి. అధినేతలు ఒంటెత్తు పోకడలు పోయినప్పుడు ప్రతి సందర్భంలో ఏక్‌నాథ్‌ షిండేలు పుట్టుకురాకపోవచ్చు గానీ ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారు. 1984–89 మధ్య కాలంలో ఎన్టీఆర్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జానారెడ్డి వంటివారు తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపలేకపోయినప్పటికీ, 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను ప్రజలే ఓడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీ చేసిన ఎన్టీఆర్‌, అక్కడ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సొంత పార్టీ వారి నుంచి సవాళ్లు ఎదురుకాకపోవచ్చు గానీ ఆయన ఏకపక్ష పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. అయితే ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌–బీజేపీ మధ్య ఓట్లు చీలిపోయి తాను సేఫ్‌గా ఉంటానని కేసీఆర్‌ భావిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నందున తమ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ అధికారానికి ఢోకా ఉండదని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు నమ్ముతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే చెప్పలేం. 


ప్రజలు గమనిస్తున్నారు!

ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయానికొద్దాం. ఈయన వ్యవహారశైలి కూడా కేసీఆర్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇంకా చెప్పాలంటే పలు సందర్భాలలో కేసీఆర్‌ మెరుగ్గా కనిపిస్తారు. జగన్మోహన్‌రెడ్డి ఏమి ఆలోచిస్తారో ఆ పార్టీలో ఒక్కరికి కూడా తెలియదు. మంత్రులు, శాసనసభ్యులు ఎవరిని తిట్టాలి, ఎలా తిట్టాలో కూడా తాడేపల్లి ప్యాలెస్‌లోనే నిర్ణయిస్తారు. జగన్‌ను మూడేళ్లుగా కలుసుకోని ఎమ్మెల్యేలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జన సమూహంలోకి వచ్చినప్పుడు డివైన్‌ లుక్స్‌తో కరుణామయుడిని తలపించేలా హావభావాలను ప్రదర్శించే జగన్‌, ఆంతరంగిక సమావేశాల్లో మూడీగా కనిపిస్తారని చెబుతారు. వైసీపీలో ముఖ్యులుగా చలామణి అవుతున్న విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు కూడా జగన్మోహన్‌రెడ్డి ముందు చొరవగా కూర్చోలేరు. ముఖ్యమంత్రికి ఆగ్రహం వస్తే ఇలాంటివాళ్లు కూడా కాళ్ల బేరానికి దిగాల్సిందే. ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నిన్న మొన్నటి వరకు ఉన్న విజయసాయిరెడ్డిపై జగన్‌కు కోపం వచ్చింది. అంతే అన్ని బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. దీంతో తన పరువు కాపాడాలని జగన్‌ వద్ద ఆయన ప్రాధేయపడ్డారు. ఫలితంగా జగన్‌ దయతలచి పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి అధినేత వద్ద కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం విజయసాయిరెడ్డి నానా అగచాట్లు పడుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి మనసు దోచుకోవడం కోసం నీచాతినీచమైన కామెంట్లను ట్విటర్‌ వేదికగా పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి అన్ని రకాల పరిధులను అతిక్రమిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీరభక్తుడిగా కూడా మారిపోయారు. ప్రధానిని ఎవరైనా విమర్శిస్తే బీజేపీ కంటే ముందే విజయసాయిరెడ్డి ప్రతివిమర్శలు చేస్తున్నారు. అవినీతి కేసులలో చిక్కుకున్న తమపై మోదీ అనుగ్రహం కోసం విజయసాయిరెడ్డి బీజేపీ నాయకుడి పాత్ర కూడా పోషిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డికి కూడా కావాల్సింది ఇదే కనుక ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి రెచ్చిపోతున్నారు. మీడియాకు నీతులు చెప్పే తెంపరితనానికి కూడా పాల్పడుతున్నారు. జగన్‌ చుట్టూ ఉంటూ ఆయన ఆదేశాలు అమలు చేసే సజ్జల, విజయసాయి, వైవీ వంటి వారు మినహా మిగిలిన మంత్రులు, నాయకులు ఎవరికీ వైసీపీ వ్యవహారాలలో గానీ, ప్రభుత్వంలో గానీ ఏ పాత్రా ఉండదు. జగన్‌ అండ్‌ కో చెప్పుకొనే సామాజిక న్యాయం ఒక బూటకం. తెలంగాణలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం బీజేపీతో కేసీఆర్‌ తలపడుతుండగా, అవినీతి కేసుల నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం ప్రధాని మోదీతో జగన్మోహన్‌రెడ్డి అంటకాగుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జగన్‌ అవసరం ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా వంటి రాష్ర్టానికి సంబంధించిన అంశాల ఊసు కూడా ఎత్తని జగన్‌వంటి వాళ్లు మోదీ, అమిత్‌ షాకు సహజంగానే నచ్చుతారు. అందుకే ముఖ్యమంత్రిని ప్రధాని దత్తపుత్రుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభివర్ణించి ఉంటారు. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏక్‌నాథ్‌ షిండేలు కనిపించరు. అయితే జగన్‌ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అండతో ధనబలాన్ని జోడించి ఎన్నికల్లో గెలవచ్చని జగన్‌ అండ్‌ కో అభిప్రాయపడుతుండవచ్చు గానీ జనాగ్రహం ముందు ఏ బలం కూడా పనిచేయదు. కేంద్రంలో బీజేపీ పెద్దలు ఈవీఎంలు టాంపర్‌ చేస్తారన్న అనుమానం చాలా మందిలో ఉంటే ఉండవచ్చు గానీ ప్రజాభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరు. అదే నిజమైతే పశ్చిమ బెంగాల్‌లో తాము తీవ్రంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీని ఎన్నికల్లో గెలవనిచ్చేవారు కాదు కదా! ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడం ఆషామాషీ కాదని పశ్చిమ బెంగాల్‌ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కేసీఆర్‌, జగన్‌వంటి వారికి సొంత పార్టీల నుంచి తిరుగుబాట్ల బెడద ఉండకపోవచ్చు గానీ ప్రజల నుంచి ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది నియంతలు కనిపిస్తారు. అయితే అందరికీ చివరికి పరాభవమే మిగిలింది!

ఆర్కే

ఈ పతనం.. స్వయంకృతం!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.