ఈ గిరిపుత్రి తొలి నౌకాదళాధికారిణి

ABN , First Publish Date - 2022-06-25T09:48:15+05:30 IST

‘‘నేవీలో మహిళలు సపోర్టింగ్‌ రోల్‌లో మాత్రమే ఉంటారు.

ఈ గిరిపుత్రి తొలి నౌకాదళాధికారిణి

గిరిజన తెగల్లో అక్షరాస్యులు అత్యల్పం. అలాంటి తెగల్లో బడగ తెగ ఒకటి. ఆ తెగకు చెందిన వారు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే అదే గొప్పగా భావిస్తారు. కానీ ఆ తెగకు చెందిన ఓ యువతి భారత నౌకాదళాధికారిణిగా ఎంపికయ్యింది. బడగ తెగ నుంచి అత్యున్నత ఉద్యోగానికి ఎంపికైన తొలిమహిళగా గుర్తింపుపొందింది. ఆమే నీలగిరి జిల్లా అచ్చన్‌కాల్‌ కు చెందిన ఆర్‌.మీరా. తన జీవితం గురించి ఆమె మాటల్లోనే...


‘‘నేవీలో మహిళలు సపోర్టింగ్‌ రోల్‌లో మాత్రమే ఉంటారు. అంటే నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్స్‌పెక్టర్‌, నావల్‌ గన్స్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, నావల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్స్‌పెక్టరేట్‌, లాజిస్టిక్‌, ఫైనాన్షియల్‌, అడ్మినిస్ట్రేషన్‌ వంటి వాటిల్లో మాత్రమే మహిళలు నావల్‌బే్‌సలో సేవలందిస్తారు. ఇవి కాకుండా ఎగ్జిక్యూటివ్‌ రోల్‌ కూడా వుంది. ఏళ్ల తరబడి సముద్రయానం చేసే పని ఇది. అందులో పురుషులు మాత్రమే ఉంటారు. యుద్ధనౌక డాక్‌లోకి ప్రవేశించగానే దాడి చేయడం, అనుమానాస్పద నౌకలపై నిఘా పెట్టడం వంటి విధుల్లో వారు ఉంటారు. మహిళలు ఇంకా ఆ విధుల్లో పాల్గొనలేదు. ఇటీవలే నేవీ పైలెట్స్‌ మిషన్‌లో ఇద్దరు మహిళలు చేరారు. యుద్ధనౌకకు అమర్చిన ఆయుధాలను ఆపరేట్‌ చేయడం, నాణ్యతా ధ్రువీకరణ పరిశీలించే బాధ్యతను ప్రస్తుతం నిర్వర్తిస్తున్నాను. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయడమే నా విధి. ప్రస్తుతం నేను సబ్‌ లెఫ్ట్‌నెంట్‌గా వున్నాను. ఆ తరువాత లెఫ్ట్‌నెంట్‌, కెప్టెన్‌గా ప్రమోషన్లు వస్తాయి. శిక్షణలో స్వల్పకాలిక శిక్షణ, దీర్ఘకాలిక శిక్షణ ఉంటాయి. షార్ట్‌టెర్మ్‌ ట్రైనీలకు 14 ఏళ్లపాటు మాత్రమే ఉపాధి కల్పిస్తారు. ఇందులో వాటర్‌మ్యాన్‌షి్‌ప శిక్షణ కూడా ఉంటుంది. నావల్‌ బేస్‌ స్టడీతో లీడర్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్‌, స్విమ్మింగ్‌ వంటివి కూడా ఉంటాయి. అన్ని వ్యాయామాలు సముద్రానికి దగ్గరగా వుండే బ్యాక్‌వాటర్‌లో ఉంటాయి. శిక్షణ సమయంలో అనుభవం కోసం కొన్ని రోజుల పాటు ఓడలో వెళ్లాల్సి ఉంటుంది. ప్లస్‌టూ పూర్తి చేసిన వారికి దీర్ఘకాలిక శిక్షణ అందిస్తారు.  ఇందులో ఇంజనీరింగ్‌లో నాలుగు సంవత్సరాలు శిక్షణ ఉంటుంది. 


అవకాశాలు పుష్కలం

‘‘మహిళలు సైన్యంలో ప్రవేశించడం సులభం కాదంటే నేను ఒప్పుకోను. సైన్యంలో చేరాలని మనసులో దృఢంగా అనుకుని, వందశాతం ప్రయత్నం చేస్తే తప్పక అవకాశం లభిస్తుంది. సాయుధ దళాల్లో మహిళలకు పుష్కలంగా ఉద్యోగావకాశాలున్నాయి. సాయుధ దళాల్లో పని చేయడానికి, దేశానికి సేవ చేయడానికి మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. రక్షణశాఖలో ఉండడమంటే ప్రత్యేక గౌరవం. అయితే కొన్ని మార్లు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది, తప్పదు. సైన్యంలో చేరేందుకు హిందీ తప్పనిసరి కాదు. అయితే మా నాన్న ఉద్యోగం వల్ల రకరకాల ప్రాంతాలు తిరగడంతో భాష సమస్య రాలేదు. 


మార్పు మొదలయింది

మా బడగ తెగలో ఇప్పటి వరకూ ఒకే ఒక్క ఎయిర్‌ఫోర్స్‌ అధికారి వున్నారు. అయితే నేవీలో మొదటి మహిళా అధికారిని మాత్రం నేనే. మా తెగలో మహిళలను అత్యంత గౌరవంగా చూస్తారు. ఇప్పుడు మాకు అందరి ఆడవాళ్లలాగే వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ వుంది. ఇష్టమైన దుస్తులు వేసుకోవచ్చు. మా తెగలో కట్నం ప్రస్తావన ఉండదు. మాలోనూ చదువుకునే వారి సంఖ్య పెరిగి, ఉద్యోగాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. పెళ్లి మాత్రం మా తెగకు చెందిన వారినే చేసుకోవాలన్న నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. నాకు నేవీ అధికారిగా ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలిసి మా ఊరివారంతా సంతోషంగా వున్నారు. భవిష్యత్‌ తరాలకు నన్ను రోల్‌ మోడల్‌గా చూస్తున్నారు.’’

డా. ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై


మా అమ్మ పేరు మాలతి, నాన్న రవీంద్రనాథ్‌. నాకు ఓ అక్క కూడా ఉంది. మా నాన్న ఆర్మీ హాస్పిటల్‌లో పనిచేశారు. నాన్న ఉద్యోగాన్ని చూస్తూ పెరిగిన నాకు తెలియకుండానే సైన్యంలో చేరాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. కోయంబత్తూరులోని హిందుస్థాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీఈ పూర్తి చేసిన తరువాత డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాశా.  స్టాఫ్‌ సెలక్షన్‌ బోర్డులో ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని నేవీలో చేరా. కేరళలోని ఎజిమలలో వున్న ఇండియన్‌ నేవీ అకాడమీలో శిక్షణ తరువాత సబ్‌ లెఫ్ట్‌నెంట్‌గా విధుల్లో చేరా.

Updated Date - 2022-06-25T09:48:15+05:30 IST