రెండు చేతులతోనూ బౌలింగ్.. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఆస్ట్రేలియా జట్టులో భారత కుర్రాడు

ABN , First Publish Date - 2021-12-19T22:22:30+05:30 IST

ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత సంతతికి చెందిన నివేథన్..

రెండు చేతులతోనూ బౌలింగ్.. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఆస్ట్రేలియా జట్టులో భారత కుర్రాడు

న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత సంతతికి చెందిన నివేథన్ రాధాకృష్ణన్ చోటు సంపాదించుకున్నాడు. పరాయి జట్లలో భారతీయ సంతతి వ్యక్తులకు చోటు దక్కడం కొత్త విషయమేమీ కాదు. ఇటీవల భారత్‌తో తలపడిన న్యూజిలాండ్ జట్టులో ఆడిన అజాజ్ పటేల్ కూడా జన్మతః భారతీయుడే. ముంబైలోనే పుట్టాడు. ఇటీవల ముంబైలో భారత్‌తో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి రికార్డులకెక్కాడు. 


ఇక, నివేథన్ రాధాకృష్ణన్ విషయానికి వస్తే.. అతడు తమిళనాడులో జన్మించాడు. అంతేకాదు, నివేథన్ ఇండియాలో ఉండగా తమిళనాడు ప్రీమియర్ క్రికెట్ లీగ్ (టీఎన్‌సీఎల్) తరపున ఆడాడు. పలు దేశవాలీ పోటీల్లో పాలుపంచుకున్నాడు. 2021 ఐపీఎల్‌లో ‘ఢిల్లీ కేపిటల్స్’కి ప్రాతినిధ్యం వహించాడు. అయితే, నెట్ బౌలింగ్‌కే పరిమితమయ్యాడు. 


నివేథన్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన అన్నింటికంటే ముఖ్యమైన విషయం అతడి నైపుణ్యం గురించి. రాధాకృష్ణన్ రెండు చేతులతోనూ బౌలింగ్ వేయగలడు. 8 సంవత్సరాల క్రితం.. అంటే 2013లో నివేథన్ కుటుంబం మొత్తం ఆస్ట్రేలేయాకు వెళ్లి స్థిరపడింది. అక్కడికి వెళ్లిన తర్వాత సిడ్నీ క్రికెట్ అకాడమీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతడి ప్రదర్శన, నైపుణ్యాన్ని చూసిన ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ అండర్-16 జట్టుకు ఎంపిక చేసింది.


2019లో పాకిస్థాన్‌తో జరిగిన అండర్-16 సిరీస్‌కు ఆస్ట్రేలియా తరపున నివేథన్ ఎంపికయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని నివేథన్ చక్కగా వినియోగించుకున్నాడు. బౌలింగ్ నైపుణ్యంతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నాడు. అంతేకాదు, బ్యాటింగ్‌లోనూ రాణించాడు. 5 మ్యాచుల్లో 172 పరుగులు చేసి 8 వికెట్లు నేలకూల్చాడు. ఇప్పుడు అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికపై ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.



Updated Date - 2021-12-19T22:22:30+05:30 IST